హైటెక్‌సిటీ మెట్రోకారిడార్ ప్రారంభం తర్వాత కారిడార్-3లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. మెట్రోరైళ్ల ఫ్రీక్వెన్సీ ప్రతి 6 నిమిషాలకు ఒకటి నడుపుతున్నామని, రద్దీని బట్టి రైళ్లను అదనంగా నడిపి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చేస్తామని మెట్రో అధికారులు ప్రకటించినా అలాంటి పరిస్థితి మెట్రో కారిడార్లలో కనిపించడం లేదు. వేసవి కావడంతో మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పెరిగినా, దానికి అనుగుణంగా ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు.
మెట్రో కారిడార్‌లలో రద్దీ ఎక్కువగా ఉంటే, దానికి అనుగుణంగా ప్రతి 2-3 నిమిషాలకో మెట్రో రైలును నడిపే అవకాశం ఉందని మెట్రో అధికారులు పేర్లోన్నారు. కమ్యూనికేషన్ బేస్డ్ ట్రెయిన్ కంట్రోల్ (సీబీటీసీ) విధానంలో రైళ్లను నడుపుతున్నారు. దీనివల్ల ప్రతి 6 నిమిషాలకే కాకుండా 2 నిమిషాలకో మెట్రో రైలును ఎలాంటీ ఇబ్బందులూ లేకుండా సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నడపవచ్చని ఆర్భాటంగా ప్రకటించారు.
ప్రస్తుతం మెట్రో రైళ్లలో రద్దీ కిక్కిరిసి ఉంటున్నా, రైళ్ల మధ్య ఫ్రీక్వెన్సీ సమయం కూడా ఎక్కువగా ఉండడంతో కనీసం నిలబడలేని పరిస్థితి ఉంది. ఏ మెట్రో స్టేషన్‌లో ఎంత రద్దీ ఉందో ఉప్పల్ కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి పరిశీలించి ఆయా మార్గంలో మెట్రో రైళ్లను నడిపేందుకు అవకాశం ఉంది. అయినా ఆ విధంగా రైళ్లను నడపడం లేదని మెట్రో ప్రయాణికులు వాపోతున్నారు.