జమిలి ఎన్నికల ప్రస్తావన లేదు… మహిళా రిజర్వేషన్ కూడా ఇప్పట్లో అమలయ్యేలా కనిపించడం లేదు. దీంతో తెలంగాణలో ఎన్నికలు సమయానికే జరుగుతాయన్న సంకేతాలతో పార్టీలన్నీ సమరానికి సమాయత్తం అవుతున్నాయి. ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకోవడానికి కొత్త పథకాలకు పదును పెడుతున్నాయి పార్టీలు. ఇప్పటికే CWC సమావేశానికి వచ్చిన సోనియాగాంధీ.. పార్టీ తరపున ఆరు గ్యారెంటీ పథకాలు ప్రకటించారు. సంక్షేమంలో తమకు తిరుగులేదంటోంది బీఆర్ఎస్ పార్టీ. బీజేపీ కూడా జనాకర్షణ పథకాలతో వచ్చేస్తోంది.
ఢిల్లీ నుంచి గల్లీ దాకా అభ్యర్ధులపై కసరత్తు చేస్తూనే గెలుపు కోసం నేతలు నియోజకవర్గాల్లో స్పీడు పెంచారు. అక్కడక్కడా నేతల మధ్య కుమ్ములాటలతో స్పీడు బ్రేకర్లు వస్తున్నా విజయం తమదేనంటున్నారు హస్తం పెద్దలు. 70కు పైగా సీట్లు గెలిచి అధికారంలోకి వస్తామంటూ ధీమాగా చెబుతున్నారు కీలక నేతలు. కర్నాటకలో 5 హామీలు తమ విజయానికి కారణమయ్యాయని… తెలంగాణలోనూ 6 గ్యారెంటీలు జనాన్ని ఆకట్టుకుంటున్నాయన్న భరోసాలో ఉంది కాంగ్రెస్.
కాంగ్రెస్ కు పొరపాటున ఓటేస్తే ఆరు కష్టాలు గ్యారెంటీ అంటోంది బీఆర్ఎస్. ఐదేళ్లకు ఐదుగురు ముఖ్యమంత్రులు మారడం ఖాయమన్నారు మంత్రి కేటీఆర్. కరెంటు కష్టాలు, తాగునీటి సమస్యలు, ఎరువులకోసం ఎదురుచూపులు, రైతు బంధు, ధరణి మాయం అవుతాయన్నారు మంత్రి. రాజకీయ అస్థిరతతో రాష్ట్రాన్ని కుదేలు చేయడం పక్కా గ్యారెంటీ అంటూ విరుచుకుపడ్డారు మంత్రులు. అటు తెలంగాణ కాంగ్రెస్‌కు ఢిల్లీలో ఫస్ట్ హైకమాండ్ ఉంటే.. బెంగళూరులో రెండో అధిష్టానం ఉందంటూ ఎద్దేవా చేశారు మరో మంత్రి హరీష్‌రావు.
ఇక ఓట్ల కోసం అమలుసాధ్యం కాని హామీలు కాంగ్రెస్ ప్రకటిస్తోందని బీజేపీ ఆరోపించింది. ఉచిత పథకాలతో డెలవప్మెంట్ ఆగిపోతుందని కర్నాటక మంత్రులే చెబుతున్నారన్నారని వ్యాఖ్యానించారు డీకే అరుణ. మొత్తానికి తెలంగాణలో పథకాల చుట్టూ రాజకీయం నడుస్తోంది. ఇంతకీ ప్రజలు ఎవరి స్కీములకు పడతారు? ఏది ఉచితం? మరేది అనుచితం?