ఎవరికెన్ని అభిప్రాయాలున్నా సరే.. ప్రజలకు సేవ చేసే ఓ బలమైన వేదిక.. జర్నలిజం. ప్రజలకు వందకు వంద శాతం మంచి చేసే ఓ ఫ్లాట్‌ఫామ్.. జర్నలిజం. ఎవరో ఒకరిద్దరి చర్యలను చూసి ‘జర్నలిజం అంతా ఇంతే’ అంటూ చాలా తక్కువ చేసి మాట్లాడుతుంటారు కొందరు. కాని, రాసిపెట్టుకోండి.. ఇప్పటికీ, ఎప్పటికీ సమాజాన్ని ఓ సరైన దారిలో పెట్టేది కచ్చితంగా జర్నలిజమే. ఆ వృత్తిపై ప్రేమతో, ప్రజలకు సమాజానికి మంచి చేయాలనే కసితో పనిచేస్తూ.. ప్రాణాలు కోల్పోతున్న జర్నలిస్టులు ఎందరో. మీకు తెలుసా.. ప్రపంచంలోనే ప్రమాదకరమైన వృత్తులలో జర్నలిజం కూడా ఒకటి అని ఐక్యరాజ్యసమితి ఓ డెఫినేషన్ ఇచ్చింది. అది నిజం కూడా. న్యాయవాది కావాలంటే లా చదవాలి. డాక్టర్ కావాలంటే మెడిసిన్ చదవాలి. ఉపాధ్యాయుడు కావాలంటే టీచర్ ట్రైనింగ్ తీసుకోవాలి. ఒక్క జర్నలిస్టుకు మాత్రం అన్యాయాన్ని సహించలేని ఫైర్ ఉంటే చాలు. అదే.. జర్నలిస్టులపై దాడులకు కారణం అవుతోంది. ప్రభుత్వానికి కావొచ్చు, మోహన్‌బాబు లాంటి షార్ట్‌టెంపర్ వ్యక్తులకు కావొచ్చు.. జర్నలిస్ట్ ఒక సాఫ్ట్ టార్గెట్ ఇప్పుడు. సరిగ్గా మానవ హక్కుల దినోత్సవం అయిన డిసెంబర్ 10వ తేదీనే.. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాస్తూ మోహన్‌బాబు అనే వ్యక్తి ఏకంగా మీడియాపై దాడి చేశాడు. ఏం.. జర్నలిస్ట్ అంటే అంత తేలికా? డాక్టర్‌పై చేయ్యెస్తే ఓ చట్టం, జూడాలపై దాడి చేస్తే రక్షణగా చట్టం, ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేస్తే దానికో చట్టం.. మరి జర్నలిజం అంటే ఫోర్త్ ఎస్టేట్ కదా..! ఏ చట్టాలు లేవా? జర్నలిస్టులకు రక్షణగా ఒక్క చట్టం కూడా చేయలేరా? ‘ఒక్క సిరా చుక్క లక్షల మెదళ్ల కదలిక’ అన్నారు ప్రజాకవి కాళోజీ నారాయణరావు. అలాంటి రంగాన్ని కాపాడే బాధ్యత ఈ సమాజానికి, ఈ ప్రభుత్వాలకు లేవా? అసలు జర్నలిజానికి ఉన్న పవర్ ఏంటి? ఆ రంగంలో సమిధలవుతున్న నిఖార్సైన జర్నలిస్టులెంత మంది? ఈ అంశంపై డిటైల్డ్ అనాలసిస్ చూద్దాం ఇవాళ్టి టీవీ9 ఎక్స్‌క్లూజివ్‌లో.
మనిషి తన మనుగడ కోసం ఎన్నో ప్రయాణాలు చేశాడు. ఓ సమాజాన్ని ఏర్పరుచుకున్నాడు. దానికంటూ ఓ వ్యవస్థ ఉంటే తప్ప ఆ మనుగడ సాధ్యం కాదనుకున్నాడు. అలాంటప్పుడు వచ్చిందే ‘ప్రజాస్వామ్యానికి నాలుగు స్తంభాలు’ అనే కాన్సెప్ట్. అందుకోసం లెజిస్లేచర్-శాసనాలను రాసుకున్నారు. దాన్ని అమలు చేయడానికి ఎగ్జిక్యూటివ్-పరిపాలన శాఖను ఎంచుకున్నారు. వీటి మధ్య ఘర్షణను తీర్చడానికి జ్యుడీషియరీ-న్యాయశాస్త్రాన్ని తీసుకొచ్చుకున్నారు. కాని, ఆ బ్యాలెన్స్ సరిపోలేదు. మనిషి మనుగడకు, సమాజ క్షేమానికి మరొకటి కావాల్సి వచ్చింది. ఆ నాలుగో పాదాన్ని ఫిల్ చేసిందే జర్నలిజం. ఏం చేస్తాడు ఈ జర్నలిస్ట్..? ప్రజలకు, ప్రభుత్వాలనికి అసలుసిసలైన వారధి ఆ జర్నలిస్టే. అందుకే, విద్యారంగం, పారిశ్రామిరంగం, ప్రభుత్వరంగం.. ఇలా ఎన్ని రంగాలు ఉన్నా ఒక్క జర్నలిజం మాత్రమే ఫోర్త్ ఎస్టేట్‌గా నిలబడింది. ఎందుకని? ప్రభుత్వం చేసే తప్పొప్పులను ప్రజలకు చేర్చడం, సమాజానికి, ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని, వారి డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేయడం కేవలం ఒక్క జర్నలిజంతోనే సాధ్యం కాబట్టి. అందుకే.. ప్రజాస్వామ్యానికి ఉన్న నాలుగు స్తంభాల్లో ఒకటిగా నిలిచింది జర్నలిజం.
ఇందాక చెప్పుకున్నాం.. ఒకరిద్దరు చేసే చిల్లర వ్యవహారాలను ముడిపెట్టి జర్నలిజాన్ని బ్లేమ్ చేయడం సరికాదని. ఇదే జర్నలిజంలో నీతి, నిజాయితీతో పనిచేసి, ప్రజల తరపున పోరాడిన వారికి దక్కిందేంటో తెలుసా.. మరణం. ప్రజల కోసం ప్రాణాలు అడ్డుపెట్టిన ఒక్క ఎమ్మెల్యే, మంత్రిని చూసుండరు. కాని, అదే ప్రజల కోసం ప్రాణాలను సైతం లెక్కచేయక కన్నుమూసిన వారు ఎందరో తెలుసా. 1600 మంది. యునెస్కో ఇచ్చిన రిపోర్ట్ ఇది. 2021 నవంబర్‌లో.. బిహార్‌లోని మధుబని జిల్లాలో సగం కాలిన మృతదేహం కనిపించింది. అతనెవరో తెలుసా. జర్నలిస్ట్ బుద్ధినాథ్ ఝా. వయసు కేవలం 22 ఏళ్లు. కిడ్నాప్ చేసి, మూడు రోజుల పాటు హింసించి, కాల్చేశారు. కొన్ని హాస్పిటల్స్, కొందరు డాక్టర్లు చేస్తున్న అరాచకాలను బయటపెడుతున్నందుకు అన్యాయంగా చంపేశారు. ఎప్పటిదాకో ఎందుకు.. ఈ ఏడాదిలో, ఈ అక్టోబర్‌లోనే ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు జర్నలిస్టులను దారుణంగా చంపేశారు. అది కూడా కేవలం వారం రోజుల వ్యవధిలోనే. పత్రికా స్వేచ్ఛపైనా, మీడియా సంస్థలపై దాడులపైనా జర్నలిస్టులు ఆందోళన చేస్తున్న సమయంలోనే రెండో హత్య జరిగింది. అక్టోబర్ 27న యూపీలోని హమీర్‌పూర్ జిల్లాకు చెందిన ఇద్దరు జర్నలిస్టులను అక్కడి పంచాయతీ చైర్మన్, ఆయన అనుచరగణం తుపాకీతో బెదిరించి బట్టలు విప్పించి మరీ కొట్టారు. మూత్రం తాగాలంటూ ఒత్తిడి తెచ్చారు. ఈ ఘటనను మరిచిపోకముందే.. అక్టోబర్ 30 అర్ధరాత్రి.. ఫతేపూర్ జిల్లాలో ఒక జర్నలిస్ట్‌ను చంపేశారు. ఇలా చెబుతూ వెళ్లాలే గానీ.. అన్యాయంగా ప్రాణాలు పోగొట్టుకున్న జర్నలిస్టులు ఎందరో. ఇక కొట్టి, చిత్రహింసలు పెట్టి, కేసులలో ఇరికిస్తున్న సంఘటనలు కోకొల్లలు. యునెస్కో డేటా ప్రకారం.. 2019 నుంచి 2022 జూన్ వరకు 70 దేశాల్లో 89 దాడులు జరిగాయి. ఇక 2023 నుంచి ప్రపంచవ్యాప్తంగా 74 మంది జర్నలిస్టులపై దాడులు, బాంబు దాడులు జరిగాయి. ఈ ఏడాది ఒక్క అక్టోబర్‌లోనే 36 మంది జర్నలిస్టులు చనిపోయారు. ముఖ్యంగా ఎన్నికల సమయం అయితే చాలు.. ఎంతోమంది జర్నలిస్టులను ఏకంగా కిడ్నాప్ చేస్తున్నారు.
ఏం.. ఎవరెవరికో అన్యాయం జరుగుతుంటే జర్నలిస్టులు పోరాడుతున్నారు కదా.. మరి జర్నలిస్టులపై ఇన్ని దాడులు, హత్యలు జరుగుతుంటే వారికి వారు న్యాయం చేసుకోలేకపోతున్నారా? న్యాయం జరగడం లేదనే కదా ఇక్కడ బాధంతా..! కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్ అనే సంస్థ ఓ రిపోర్ట్ విడుదల చేసింది. గత పదేళ్లలో 263 జర్నలిస్టులను అన్యాయంగా చంపేస్తే.. వాటి కోసం న్యాయపోరాటం చేస్తే.. 80 శాతం కేసులలో కించిత్ న్యాయం కూడా జరగలేదు. జర్నలిస్టులను హతమార్చిన వారిని చట్టం ముందు దోషులుగా తేల్చే ప్రయత్నమే జరగలేదు. ఏ వ్యవస్థలలో జరుగుతున్న అన్యాయం ‘సగటు జర్నలిస్టు’ పోరాడుతున్నాడో.. అవే ‘వ్యవస్థల’ కారణంగా జర్నలిస్టు బలవుతున్నాడు. చివరికి అవే వ్యవస్థల కారణంగా న్యాయం దక్కకుండా పోతోంది. మరో దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే.. ఇప్పటి వరకు మీడియా సిబ్బందిపై జరిగిన దాడులలో 42 శాతం చట్టాన్ని అమలు చేసే సంస్థలే చేశాయి. యునెస్కో విడుదల చేసిన రిపోర్ట్ ఇది. ఈ దాడుల బాధితులలో 28 శాతం మంది జర్నలిస్టులు మహిళలే. దాదాపు 226 మంది జర్నలిస్టులు.. కొన్ని ప్రభుత్వ ఏజెన్సీలు, రాజకీయేతర, సంఘ విద్రోహ శక్తులు, నేరస్థులకు లక్ష్యంగా మారారని సాక్షాత్తు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియానే ఓ రిపోర్ట్ విడుదల చేసింది. పర్యావరణానికి నష్టం కలుగుతోందంటూ.. కొందరు బడాబాబులకు వ్యతిరేకంగా పోరాడినందుకు, వాళ్లకు వ్యతిరేకంగా వార్తలు రాసినందుకు ఏకంగా 28 మంది జర్నలిస్టులను చంపేశారు మన దేశంలో. గౌరీ లంకేష్ తెలుసుగా. ఇండియన్ ఉమెన్ జర్నలిస్ట్. ముస్లింల హక్కులు, మైనారిటీల రక్షణ కోసం పోరాడుతున్నందుకు 2017 సెప్టెంబర్ 5న హత్య చేశారు. 2022లో జర్నలిస్టులపై ఈ దాడులు మరింత దారుణంగా జరిగాయి. ఆ ఒక్క ఏడాదిలోనే 67 మంది జర్నలిస్టులు, మీడియా సిబ్బందిని చంపేశారు. 2018తో పోల్చితే ఏకంగా 50 శాతం దారుణాలు పెరిగాయి.
జర్నలిస్టులపై ఇన్ని దారుణాలు, దాడులు, హత్యలు జరుగుతుంటే.. ఓ ప్రత్యేక చట్టం చేయడానికి వీలు పడట్లేదా? ఫోర్త్ ఎస్టేట్‌ను గౌరవప్రదంగా, నిర్భయంగా మార్చేందుకు ఆమాత్రం చేయడానికి ఎవరూ ముందుకురావడం లేదా? జర్నలిస్టుల రక్షణను ఎలాంటి చట్టం కోరుకుంటున్నారు? డిటైల్స్ ఓ షార్ట్ బ్రేక్ తరువాత..
మీడియా ప్రతి ఒక్కరికి కావాలి. తాను ప్రజల మనిషిని చెప్పుకునే ప్రజాప్రతినిధికీ జర్నలిస్ట్ కావాలి. ఎంత పెద్ద స్టార్ అయినా.. తన ప్రమోషన్ల కోసం జర్నలిస్ట్ కావాలి. గల్లీలో ఉన్న కార్పొరేటర్ నుంచి ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రుల వరకు జర్నలిస్ట్ కావాలి. కాని, అతని రక్షణ బాధ్యత మాత్రం ఎవరికీ అక్కర్లేదు. అలా తయారైంది పరిస్థితి. దేశంలో జర్నలిస్టుల భద్రత, రక్షణ కోసం ఒక చట్టాన్ని తీసుకురావాలని కేంద్రంలోని ప్రతి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూనే వస్తోంది ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా-PCI. కేంద్రం పనిని మరింత సులభతరం చేయడానికి.. మీడియా సిబ్బంది అరెస్టులు, తప్పుడు నిర్బంధాలు, బెదిరింపులపై ఏమేం చేయాలి, ఎలా రక్షణ కల్పించాలనే దానిపై ప్రెస్ కౌన్సిల్ సభ్యులు ఓ నివేదిక తయారు చేశారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దీన్ని ఆమోదించింది కూడా. కాని, అంతకు మించి ఒక్క అడుగు కూడా పడలేదు. ఆ నివేదికలో ప్రధానంగా మూడు ప్రతిపాదనలు చేశారు. ముఖ్యంగా.. దేశంలో జర్నలిస్టుల రక్షణ భద్రత కోసం ఒక జాతీయ చట్టాన్ని ఏర్పాటు చేయడం. దీంతో పాటు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యాక్ట్‌కు మరిన్ని అధికారాలు కల్పించడం. ఫోర్త్ ఎస్టేట్ స్టేటస్ ఉన్న మీడియా సిబ్బందితో ఎలా వ్యవహరించాలో పోలీసులకు అవగాహన కల్పించటం.. వీటన్నింటినీ చేరుస్తూ ఒక చట్టం చేయాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు. కనీసం జర్నలిస్టులపై దాడులను నివారించడానికి కమిటీలు వేయాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు తెలుగు రాష్ట్రాల జర్నలిస్టులు. కాని, ఆ విషయమై ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు.
ఇందాక చెప్పుకున్నట్టు.. కొందరు వ్యక్తులకు, ప్రభుత్వాలకు ‘ఫస్ట్ టార్గెట్.. సాఫ్ట్ టార్గెట్’గా కనిపిస్తున్నది జర్నలిస్టే. ఏ ప్రభుత్వమైనా సరే ప్రశ్నించేవారిని కట్టడి చేయాలనే అనుకుంటుంది. ఈ ప్రయత్నంలో మోహన్‌బాబు లాంటి కొందరు వ్యక్తులు, కొన్ని ప్రభుత్వాలు క్రూరంగా ప్రవర్తిస్తుంటాయి కూడా. ఎందుకంటే.. ఈ ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వం కూడా నిజాయతీగా పని చేసే మీడియాను అంగీకరించలేదు కాబట్టి. ప్రతి ఒక్కరూ మీడియా గొంతు నులిమేస్తే చాలు.. అంతా గప్‌చప్ అవుతుందనే భావనలో ఉంటారు కాబట్టి. నిజంగా.. జర్నలిస్టులు తప్పు చేస్తే, ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తే.. అలాంటి వారిపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వాలకు అనేక మార్గాలు ఉన్నాయి. కాని, ఇప్పుడు జరుగుతున్నదేంటి..? ఏకంగా రాజద్రోహం కేసులు పెడుతున్నారు. తీవ్రవాదుల నియంత్రణకు ఉపయోగించే ఉపా చట్టాలను ప్రయోగిస్తున్నారు. కేసులతో ఎంత హింసించాలో అంతా చేస్తున్నారు. ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాడకపోతే ప్రజాస్వామ్యానికే ముప్పు ఏర్పడుతుందని వారికి తెలియడం లేదు పాపం.
మీడియాకు ఫుల్ పవర్స్ ఉంటాయని, వాళ్లేం చెప్పినా నడుస్తుందని చాలా మంది అనుకుంటుంటారు గానీ.. మీడియాకు అసలు స్వేచ్ఛే లేదని, జర్నలిస్టులు అత్యంత దారుణ పరిస్థితుల్లో ఉన్నారని అత్యధిక మందికి తెలీదు. వరల్డ్ మీడియా ఫ్రీడమ్ ఇండెక్స్‌లో ఇండియా ర్యాంక్ ఎంతో తెలుసా.. 180. అంతకు ముందు 161వ ర్యాంక్‌లో ఉంటే మరింత దిగజారింది. నిజానికి కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా మీడియా పరిస్థితి ఇంతే. 2002లో ఇదే వరల్డ్ మీడియా ఫ్రీడమ్ ఇండెక్స్‌లో భారతదేశం ర్యాంక్ 150. ఇన్నేళ్లలో మీడియాకు స్వేచ్ఛను కల్పించడం అటుంచితే.. మరింత దారుణంగా తొక్కేయడమే కనిపిస్తోంది.
కాకపోతే.. ఈమధ్య కొంత ఊరటనిస్తూ ఓ తీర్పు చెప్పింది సుప్రీంకోర్టు. భావప్రకటన స్వేచ్ఛకు భంగం కలగకుండా.. జర్నలిస్టులు ఏ వార్త రాసినా సరే.. వాటిపై కేసులు పెట్టకూడదనే తీర్పు ఇచ్చింది. అదొక్కటే ప్రస్తుతానికి జర్నలిస్టులకు శ్రీరామరక్ష. జర్నలిస్టు అభిషేక్ ఉపాధ్యాయ్‌పై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పెట్టిన కేసును కొట్టివేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం జర్నలిస్టు రాసినవి ప్రభుత్వాన్ని విమర్శించేలా ఉన్నాయనే కారణంతో క్రిమినల్ కేసులు పెట్టొద్దని చాలా స్పష్టంగా చెప్పింది సుప్రీంకోర్టు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) కింద జర్నలిస్టులకు ఉన్న భావప్రకటన స్వేచ్ఛను కాపాడాలని స్పష్టం చేసింది. సో, జర్నలిస్టులపై జరుగుతున్న అన్యాయాలపై పోరాడాలన్నా ఆర్టికల్ 19(1)(a) మాత్రమే మనకు రక్ష..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..