
సాఫ్ట్‌వేర్ హబ్‌లుగా పేరుగాంచిన హైదరాబాద్, బెంగళూరు నగరాల మధ్య పోలిక ఈనాటిది కాదు. ఐటీ కంపెనీలు, జీవన ప్రమాణాలు, వాతావరణం.. ఇలా ప్రతి విషయంలోనూ ఈ రెండు నగరాల మధ్య పోటీ ఉంటుంది. అయితే తాజాగా ట్రాఫిక్ విషయంలో ఈ రెండు నగరాల మధ్య జరిగిన ఒక ఆసక్తికర చర్చ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హైదరాబాద్ రోడ్ల మౌలిక సదుపాయాలను చూసి ఓ బెంగళూరు వ్యక్తి ఆశ్చర్యపోతూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఆర్చీ సేన్‌గుప్తా అనే వ్యక్తి ఎక్స్ వేదికగా తన అనుభవాన్ని పంచుకుంటూ.. ‘‘నేను ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నాను. ఇక్కడ 12 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 30 నిమిషాల్లో పూర్తి చేశానంటే నా బెంగళూరు మెదడుకు అర్థం కావడం లేదు. ఎందుకంటే బెంగళూరులో 30 నిమిషాలు అంటే కేవలం ఒక కిలోమీటరు ప్రయాణించినట్లే లెక్క. ఇక్కడి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిజంగా అద్భుతం” అంటూ రాసుకొచ్చారు.
ఈ పోస్ట్ పెట్టిన కొద్దిసేపటికే 43,000కు పైగా వ్యూస్, వందలాది కామెంట్లతో నెట్టింట జోరుగా చర్చ నడిచింది. ‘‘నేను ఆఫీసు నుండి బయలుదేరినప్పుడు 50 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 45-55 నిమిషాల్లోనే చేరుకుంటాను” అని ఒక హైదరాబాద్ యూజర్ గర్వంగా చెబితే.. “నేను బెంగళూరు నుండి హైదరాబాద్ మారినప్పుడు నా ప్రయాణ సమయం అకస్మాత్తుగా నార్మల్ అయిపోయింది” అని మరొకరు తన అనుభవాన్ని పంచుకున్నారు. 5 కిలోమీటర్లు అంటే అది చాలా పెద్ద దూరం అని నమ్మేలా బెంగళూరు ట్రాఫిక్ మనల్ని మార్చేసింది అంటూ కొందరు వాపోయారు. బెంగళూరులో ప్రజా రవాణా, రోడ్ల ప్రణాళికపై తక్షణమే దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. అయితే అందరూ హైదరాబాద్‌ను పొగడటంతో ఏకీభవించలేదు. “మీరు ఆదివారం ప్రయాణించి ఉంటారు, వర్షం పడినప్పుడు మా ట్రాఫిక్ చూడండి.. త్వరలోనే మేము కూడా బెంగళూరు స్థాయికి చేరుకుంటాము” అని కొందరు స్థానికులు హెచ్చరించారు.
హైదరాబాద్‌లోని విశాలమైన రోడ్లు, వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కింద నిర్మించిన ఫ్లైఓవర్లు, మల్టీ లెవల్ గ్రేడ్ సెపరేటర్లు, అత్యంత వేగవంతమైన ఔటర్ రింగ్ రోడ్ నగర రవాణా ముఖచిత్రాన్ని మార్చేశాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి బెంగళూరు టెక్కీ చేసిన ఈ పోస్ట్ రెండు నగరాల మౌలిక సదుపాయాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మరోసారి ఎత్తిచూపింది. హైదరాబాద్ ప్రణాళికాబద్ధంగా దూసుకుపోతుంటే, బెంగళూరు తన పాత ట్రాఫిక్ కష్టాల నుండి బయటపడటానికి ఇంకా కష్టపడుతూనే ఉంది.
i’m in hyd right now, and my bangalore brain can’t comprehend that i traveled 12 km in 30 minutes. in blr, 30 minutes is more like 1 km. the infrastructure is really good.
— Archie Sengupta (@archiexzzz) May 10, 2026