హైదరాబాద్‌లో చదువుకుని.. ఆస్ట్రేలియా ఎన్నికల బరిలోకి దిగిన తెలుగు మహిళ!

Lakshmi Lankala Kendarla: హైదరాబాద్‌కు చెందిన లక్ష్మి లంకల ఆస్ట్రేలియా విక్టోరియా రాష్ట్ర సిడెన్‌హామ్ నియోజకవర్గ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. విదేశాల్లో స్థిరపడిన భారతీయులు రాజకీయాల్లో తమ ముద్ర వేస్తున్న క్రమంలో, ఈమె అభ్యర్థిత్వం ఆసక్తి రేకెత్తిస్తోంది. భద్రత, రవాణా, విద్య, వైద్యం వంటి ప్రధాన రంగాలపై దృష్టి సారించి, స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని లక్ష్మి హామీ ఇస్తున్నారు. తెలుగు ప్రవాసుల మద్దతుతో విజయం సాధించాలని ఆశిస్తున్నారు.

హైదరాబాద్‌లో చదువుకుని.. ఆస్ట్రేలియా ఎన్నికల బరిలోకి దిగిన తెలుగు మహిళ!
Lakshmi Lankala Kendarla

Edited By:

Updated on: Nov 25, 2026 | 4:40 PM

చదువుకున్న నగరం హైదరాబాద్.. స్థిరపడిన దేశం ఆస్ట్రేలియా.. ఇప్పుడు లక్ష్యం అక్కడి ప్రజాప్రతినిధిగా ఎన్నికవ్వడం! విదేశాల్లో స్థిరపడిన భారతీయులు ఉద్యోగాలు, వ్యాపారాలకే పరిమితం కాకుండా రాజకీయాల్లోనూ తమదైన ముద్ర వేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన లక్ష్మి లంకల కేందర్ల ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్ర ఎన్నికల బరిలో నిలిచి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. సిడెన్‌హామ్ నియోజకవర్గం నుంచి ‘ది రిపబ్లికన్’ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తూ స్థానిక రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

విక్టోరియా రాష్ట్రంలో నవంబర్ నెల 28న జరగనున్న ఎన్నికల్లో సిడెన్‌హామ్ నియోజకవర్గం నుంచి మొత్తం 12 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరిలో లక్ష్మి లంకల కేందర్ల అభ్యర్థిత్వాన్ని ఎన్నికల సంఘం అధికారికంగా నమోదు చేసింది. బ్యాలెట్ పేపర్‌లో ఆమెకు మూడో స్థానం కేటాయించడం విశేషం. దీంతో తెలుగు మూలాలున్న అభ్యర్థిగా ఆమె పోటీ అక్కడి భారతీయ ప్రవాసుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. లక్ష్మి ప్రయాణం వెనుక హైదరాబాద్‌తో విడదీయలేని అనుబంధం ఉంది.

నగరంలోని నారాయణగూడ కేశవ మెమోరియల్ స్కూల్ అండ్ కాలేజీలో ఆమె విద్యాభ్యాసం సాగింది. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. అనంతరం కర్ణాటకకు చెందిన మల్లేశ్‌ను వివాహం చేసుకుని భర్తతో కలిసి ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. ప్రస్తుతం ఆమె తల్లి ఎల్‌కె జయమ్మతో పాటు కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో నివసిస్తున్నారు. ఒకప్పుడు హైదరాబాద్‌లో చదువుకున్న లక్ష్మి.. ఇప్పుడు వేల కిలోమీటర్ల దూరంలోని ఆస్ట్రేలియాలో ప్రజాప్రతినిధిగా ఎన్నిక కావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.

ఎన్నికల ప్రచారంలో లక్ష్మి కేవలం రాజకీయ హామీలకే పరిమితం కాకుండా స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలపై దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా నాలుగు రంగాలను తన ప్రాధాన్య అంశాలుగా ప్రకటించారు.

  • సేఫ్టీ ఫస్ట్: ప్రజలకు భద్రత కల్పించడం, పోలీసు వ్యవస్థను బలోపేతం చేయడం, నేరాలను అరికట్టేందుకు పటిష్ఠ చర్యలు తీసుకోవడం.
  • స్మార్ట్ ట్రాన్స్‌పోర్ట్: మెరుగైన రహదారులు, ప్రమాదాలు తగ్గించే సురక్షిత కూడళ్లు, నమ్మకమైన ప్రజా రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం.
  • బెటర్ ఎడ్యుకేషన్: పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు విద్యార్థులకు అవసరమైన వనరులు కల్పించడం.
  • అందరికీ వైద్యం: ఆసుపత్రులు, జనరల్ ప్రాక్టీషనర్లు, అత్యవసర వైద్య సేవలు ప్రజలకు సులభంగా అందేలా కృషి చేయడం.

సిడెన్‌హామ్ నియోజకవర్గ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వారి తరఫున గళం వినిపించడమే తన లక్ష్యమని లక్ష్మి చెబుతున్నారు. స్థానిక సమాజానికి మెరుగైన భవిష్యత్తు అందించేందుకు కృషి చేస్తానని ఎన్నికల ప్రచారంలో హామీ ఇస్తున్నారు. మొత్తానికి హైదరాబాద్‌లో చదువుకుని, ఆస్ట్రేలియాలో స్థిరపడిన లక్ష్మి ఇప్పుడు అక్కడి రాజకీయాల్లో తనదైన గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు. 12 మంది అభ్యర్థులు తలపడుతున్న సిడెన్‌హామ్ పోరులో ఆమెకు ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ నవంబర్ నెల 28న వెలువడనున్న ఎన్నికల ఫలితాలే ఆమె రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us