రంగు నలుపు.. అయితేనేం? మాంసం రుచి అదరహో! ప్రొటీన్ల శాతం కూడా సూపర్.. కొవ్వు తక్కువ. ఇంకెన్నో సుగుణాలు కల్గిన కడక్‌నాథ్ అనే నల్ల కోళ్ల పెంపకంపై తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఆసక్తి భారీగా పెరుగుతోంది. రైతులు వ్యవసాయానికి అనుబంధంగా అదనపు ఆదాయ వనరుగా ఈ కోళ్ల పెంపకం మొదలు పెడుతున్నారు. ఇందులో మేముసైతం అంటూ వ్యవసాయంలోకి ఎంట్రీ ఇస్తున్నారు కంప్యూటర్లతో కుస్తీ పట్టే సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. హైదరాబాద్ నగర శివారు ఫాం హౌజ్‌లలో కడక్ నాథ్ కోళ్ల పెంపకంను మొదలు పెట్టారు. ఈ కోవలోనే వికారాబాద్ జిల్లాలో కొంత మంది సాఫ్ట్ వేర్ మిత్రులు కలిసి కడక్ నాథ్ కోళ్ల పెంపంకం చేపట్టి మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. మరి వాళ్ల పెంపకం, మార్కెట్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ మొత్తం చదవాల్సందే..
నాటు కోళ్ళ పెంపకం నేడు లాభసాటి వ్యాపారంగా మారింది. ఒకప్పుడు గ్రామాల్లో చిన్న, సన్నకారు రైతులు, భూమిలేని వ్యవసాయ కూలీలు ఈ నాటు కోళ్ల పెంపకాన్ని ఒక వ్యాపకంగా చేపట్టి , తమ ఉపాధికి తోడు… చేదోడువాదోడుగా కొంత సొమ్ము సంపాదించుకునేవారు. అయితే ప్రస్తుతం నాటుకోడి మాంసానికి డిమాండ్ బాగా పెరగడంతో పెరటి కోళ్ల పెంపకం కుటీర పరిశ్రమలా మారింది. బ్రాయిలర్ పరిశ్రమ విస్తరించినా నాటుకోళ్లపై మక్కువ తగ్గలేదు. దీంతో ఔత్సాహిక రైతులు నాటుకోళ్లలో భిన్నమైన రకాల కోళ్ల పెంపకాన్నిచేపడుతున్నారు. ప్రస్థుతం తెలుగు రాష్ట్రాల్లో నాటు కోడిని తలదన్నేలా ఒక ప్రత్యేక జాతి కోడి మార్కెట్లో ప్రవేశించి అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది.
అదే కడక్ నాథ్ కోడి. ఈ కోడి మాంసం కిలో ధర ఐదారొందలు పలుకుంతుంది. ఏంటి దీని స్పెషాలిటీ అని ఆశ్చర్యపోతున్నారా… ఈ మాంసంలో ఔషధ గుణాలు, అత్యధిక ప్రోటీన్లతోపాటు, పుంసత్వాన్ని పెంచే లక్షణాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు పరిశోధకులు. అందుకే అందరి దృష్టీ ఇప్పుడు ఈ జాతిపై పడింది. ఇటు మార్కెట్ డిమాండ్ కూడా పెరిగింది. దీనినే ఆసరాగా చేసుకొని కొందరు సాఫ్ట్ వేర్ యువకులు కడక్ నాథ్ కోళ్ల పెంపకం చేపట్టి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు.
ఈ యువకులంతా స్టాఫ్ట్ వేర్ ప్రొబేషన్ లో ఉన్నారే.. వీరికి హైదరాబాద్ లో సొంతంగా కో ప్రైమ్ అనాలసిస్ ప్రైవేట్ లిమిటెడ్ సాఫ్ట్ వేర్ కంపెనీ ఉంది. అయితే వారానికి ఐదు రోజులు ఉద్యోగం.. మరో రెండు రోజులు ఖాళీగా ఉంటుంది. ఈ సమయాన్నే వ్యవసాయంపై పెట్టాలనుకున్నా. ఇందుకోసం నగరానికి దగ్గరగా ఉన్న వికారాబాద్ జిల్లా, పూడూరు మండలం, మేడికొండ గ్రామంలో 10 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. అందులో శ్రీ గౌరీ ఫామ్ టూ హోం పేరుతో 9 ఎకరాల్లో పండ్ల మొక్కలు నాటారు. మరో ఎకరంలో 220 ఫీట్ల పోడవు, 27 ఫీట్ల వెడల్పుతో ఒక షెడ్ ఏర్పాటు చేసి, అందులో కడక్ నాథ్ కోళ్ల పెంపకం చేపట్టారు. మొదట 500 కోళ్ల తో ప్రారంభించిన ఈ పెంపకం ప్రస్తుతం 5 వేల 700 వరకు ఉన్నాయి.
ఈ యువరైతులు కోళ్లను ఫ్రీరేంజ్ పద్ధతిలో పెంపకం చేపడుతున్నారు. స్థానిక పెరటి కోళ్ల మాదిరిగానే.. వీటి పోషణకు పెద్దగా ఖర్చు లేకుండా చూసుకుంటున్నారు. ఇందుకోసం స్థానిక రైతుల నుండి వేస్టేజ్ కూరగాయలు , ఆకు కూరలు సేకరించి కోళ్లకు వేస్తున్నారు. అంతే కాకుండా కోళ్ళను రోగనిరోధక శక్తిని పెంచేందుకు వేపాకు, కరివేపాకు, మునగాకును వేయడమే కాకుండా నీటిలో పసుపు, అల్లం, వెల్లుల్లి రసాన్ని కలుపుతున్నారు. మరోవైపు కోళ్లు పెట్టిన గుడ్లలో కొన్నింటిని మార్కెట్ చేసుకుంటూ మరికొన్నింటిని ఇంక్యూబేటర్ ద్వారా పిల్లల ఉత్పత్తి చేస్తూ మంచి ఆదాయం ఆర్జిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఈ కోళ్ల పెంపకం తక్కువ వుండటం వల్ల డిమాండ్ అధికంగా వుంది. వినియోగానికి తగ్గట్లుగా ఉత్పత్తి లేకపోవటంతో ఇతర రాష్ట్రాలనుండి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ప్రస్థుతం ఈ కోళ్ల ధర అధికంగా ఉండటంతో రైతులు మంచి లాభాలు గడిస్తున్నారు. ప్రతి ఒక్కరికీ మాంసం అందుబాటులోకి రావాలంటే ఈ కోళ్ల పెంపకం విస్తృతంగా జరగాల్సిన అవసరం కనిపిస్తోంది.