Hyderabad Sadar Festival Celebrations: దీపావళి సందర్భంగా నిర్వహించే సదర్ ఉత్సవాలకు భాగ్యనగరం ముస్తాబైంది. ఇందుకోసం ఒక్కొక్కటి రూ. 16 కోట్ల విలువైన కింగ్, సర్తాజ్ (దున్నపోతులు) ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ముషీరాబాద్‌కు చెందిన అఖిల భారత యాదవ సంఘం ప్రధాన కార్యదర్శి, టీఆర్‌ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి ఎడ్ల హరిబాబు యాదవ్ నవంబర్ 6న జరిగే సదర్ కోసం హర్యానా నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన దున్నలను పెంచుతున్నట్లు తెలిపారు.
కింగ్ వయసు నాలుగున్నర సంవత్సరాలు. బరువు 1,500 కిలోలు. పొడవు 15 అడుగులు. ఎత్తు 5.6 అడుగులు. రోజూ దీని ఆహారం కోసం రూ. మూడు వేలు వెచ్చిస్తారట. పది కిలోల ఆపిల్ పండ్లు, ఎనిమిది లీటర్ల పాలు, కిలో బెల్లం, రెండు కిలోల కంది పప్పు, రెండు కిలోల శెనగపప్పుతో పాటు వివిధ రకాల ప్రొటీన్ ఆహారంగా అందిస్తారు. దీని ఆలనాపాలనా చేసే కార్మికుడు రోజుకు రెండు సార్లు స్నానం చేయించి, కిలోన్నర ఆవ నూనెతో మసాజ్ చేస్తారు. దీని వీర్యాన్ని చిన్న చిన్న ట్యూబ్‌లలో రూ. 300 నుంచి 400కు విక్రయిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు.
సర్తాజ్ వయసు ఏడేళ్లు. బరువు 1600 కిలోలు. ఎత్తు ఏడు అడుగులు. పొడవు 15 అడుగులు ఉంటుంది. దీని కోసం కూడా అంతే ఖర్చు చేస్తామని నిర్వాహకులు పేర్కొంటున్నారు. వీటి వీర్యం వల్ల పుట్టే సంతానం బలంగా ఉండడంతోపాటు 20 నుంచి 30 లీటర్ల పాలు ఉదయం, సాయంత్రం ఇస్తాయని తెలిపారు. 2019, 2020 జాతీయ స్థాయి పశువుల పోటీలో ఉత్తమ దున్నలుగా ఇవి నిలిచాయని ఎడ్ల హరిబాబుయాదవ్ తెలిపారు. ఉత్సవాలలో ప్రత్యేకత కోసం సుమారు 2,300 కిలోమీటర్ల దూరం నుంచి ప్రత్యేక వాహనంలో కింగ్, సర్తాజ్‌లను తీసుకొచ్చామన్నారు..
Read Also… Viral Video: సింహంతో పరాచకాలు ఆడితే.. రియాక్షన్ ఇలానే ఉంటుంది.. జస్ట్ మిస్