ఆ పేరు చెప్పి ఈఎన్‎టి డాక్టర్‎ను బురిడీ కొట్టించిన కేటుగాళ్లు..

| Edited By: Srikar T

Aug 19, 2024 | 6:35 PM

హైదరాబాదులో పనిచేస్తున్న ఒక ఈఎన్‎టీ సర్జన్ అక్షరాల 8 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాడు. ఒక ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులో ఇరుక్కున్న డాక్టర్ తాను మోసపోయానని గ్రహించి చివరకు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఫేస్‎బుక్ ద్వారా ట్రేడింగ్ ప్రకటన చూసి మోసపోయిన డాక్టర్ పలు దఫాలుగా 8 కోట్ల రూపాయలను చెల్లించాడు.

ఆ పేరు చెప్పి ఈఎన్‎టి డాక్టర్‎ను బురిడీ కొట్టించిన కేటుగాళ్లు..
Cyber Crime
Follow us on

హైదరాబాదులో పనిచేస్తున్న ఒక ఈఎన్‎టీ సర్జన్ అక్షరాల 8 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాడు. ఒక ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులో ఇరుక్కున్న డాక్టర్ తాను మోసపోయానని గ్రహించి చివరకు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఫేస్‎బుక్ ద్వారా ట్రేడింగ్ ప్రకటన చూసి మోసపోయిన డాక్టర్ పలు దఫాలుగా 8 కోట్ల రూపాయలను చెల్లించాడు.

మూడు నెలల క్రితం ఫేస్‎బుక్ ట్రేడింగ్ యాప్ ప్రకటన చూసిన డాక్టర్ వాళ్ళ ఫోన్ నెంబర్లను సంప్రదించాడు. ఒక యాప్ ద్వారా పెట్టుబడి పెట్టడం ప్రారంభించారు. స్టార్ట్ బ్రోకింగ్‎పై సలహాలు సూచనలు ఇస్తామంటూ నమ్మించి ఎనిమిది కోట్ల రూపాయలు కాజేశారు. కూకట్‎పల్లిలో ఈఎన్‎టీ వైద్యుడిగా బాధితుడు పనిచేస్తున్నాడు. ఈ ఏడాది మే నెలలో ఫేస్‎బుక్ యాడ్ చూసి కొన్ని ఫోన్ నెంబర్లను సంప్రదించటంతో ఒక నాలుగు కంపెనీల నుండి అతడికి కాల్స్ వచ్చాయి.

జెపి మోర్గాన్, గోల్డ్ మాన్ కంపెనీ, మాన్ గ్రూప్,, యుఎస్బి సెక్యూరిటీస్ కంపెనీ పేర్లు చెప్పి బాధితుడికి పలువురు ఫోన్ చేశారు. ఈ సంస్థలకు సంబంధించిన ప్రతినిధిగా వాళ్లు పరిచయం చేసుకున్నారు. స్టాక్ బ్రోకింగ్‎లో తమవి పెద్ద కంపెనీలు అని నమ్మించి.. తాము చెప్పింది చేస్తే స్టాక్ బ్రోకింగ్‎లో ఎక్కువ లాభాలు తెప్పిస్తామని నమ్మించారు. బాధితుడికి అనుమానం కలిగి ఆర్బీఐ రెగ్యులేటరీ కింద జారీ చేసిన పత్రాలను చూపించాల్సిందిగా కోరాడు. వీటితోపాటు NSE, BSE కు సంబంధించిన పత్రాలను చూపించాల్సిందిగా కోరాడు.

బాధితుడు కోరినప్పటికీ పొంతనలేని సమాధానాలు చెబుతూ అలాంటి డాక్యుమెంట్స్ అత్యంత రహస్యంగా ఉంచుతామని అవి బహిర్గతం చేయలేమని బాధితుడిని నమ్మించారు. ఆ తర్వాత వీరు సూచించిన ఆప్‎లను డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా బాధితుడుని మభ్య పెట్టారు. అందులో మాత్రమే స్టాక్ బ్రోకింగ్ చేయాలని సూచించారు. నిందితులు చెప్పిన విధంగా డాక్టర్ మొదట చిన్న నగదును పెట్టుబడిగా పెట్టారు. కొన్ని రోజులపాటు నగదు విత్ డ్రా చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. ఆ తర్వాత భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించాడు. అందులోనూ లాభాలు వచ్చాయి. వచ్చిన లాభాలను విత్ డ్రా చేసుకోవాలని చూస్తే యాప్ దానిని రిస్ట్రిక్ట్ చేస్తుంది.

తనకు వచ్చిన లాభాలు విత్ డ్రా చేసుకోవాలని నిందితులను అడిగితే, తమకు ఇవ్వాల్సిన 20శాతం ప్రాఫిట్‎తో పాటు 30శాతం టాక్స్ చెల్లిస్తే విత్ డ్రా వెసులు బాటు కల్పిస్తామని మభ్య పెట్టారు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. డాక్టర్ నగదు ట్రాన్స్‎ఫర్ చేసిన లావాదేవీల వివరాలను పరిశీలిస్తున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..