ప్రధాన పార్టీలన్నీ స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెడుతున్నాయి. ఎవరికీ వారు ఓటు బ్యాంకును పదిలం చేసుకునే వ్యూహాలను రచిస్తున్నాయి. కాంగ్రెస్ అసెంబ్లీ ఫలితాల్లో బీఅర్‌ఎస్ ఓట్లను ఎలాగైతే కొల్లగొట్టిందో.. ప్రస్తుతం జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో అత్యధిక ఓట్ల శాతం కైవసం చేసుకోవాలని హస్తం పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగానే పీసీసీ చీఫ్ జిల్లాల పర్యటన షురూ చేశారు.
ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బాధ్యతలు చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్ పార్టీ బలోపేతంపై ఫోకస్ చేశారు. ముఖ్యంగా రాబోయే సంస్థాగత ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని దూకుడు పెంచారు. ఇందులో భాగంగా డీసీసీ, మండల, గ్రామస్థాయి నుండి పార్టీని స్ట్రేంతెన్ చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక ఓటు బ్యాంకు హస్తం వైపు తిప్పుకునేలా వ్యూహాలు రచిస్తున్నారు. తన సొంత జిల్లా నుండి పర్యటన షురూ చేసి, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నాటికి పర్యటన పూర్తి చేయాలని భావిస్తున్నారు.
రాష్ట్రంలో రెండు సార్లు పవర్ చూసిన బీఅర్‌స్ పార్టీ ప్రతిపక్ష హోదాలో మొదటి సారిగా స్థానిక సంస్థల ఎన్నికల బరిలో ఉండబోతోంది. ఎలాగైనా హస్తం ఓటు శాతాన్ని గులాబీ వైపు తిప్పుకునేలా వ్యూహాలను సిద్ధం చేస్తోంది. అధికారంలో ఉన్నా రెండు దఫాలు స్థానిక సంస్థల ఫలితాల్లో బీఆర్ఎస్ మార్క్ చూపించింది. కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వేవ్ తో బీఆర్ఎస్ చిత్తయింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, డిక్లరేషన్‌లు, కులగణన, బీసీ సబ్ ప్లాన్, 42 శాతం బీసీల రిజర్వేషన్ల అంశాలను అస్త్రంగా చేసుకుని కాంగ్రెస్ ఓట్లను చీల్చాలని గులాబీ భావిస్తోంది.
మొన్నటి అసెంబ్లీ ఫలితాలనే మళ్ళీ రిపీట్ చేయాలని అధికార కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. బీఆర్ఎస్ లెవనెత్తుతున్న అంశాలను తిప్పి కొట్టే ప్రయత్నాలు హస్తం పార్టీ చేస్తోంది. ఇందులో భాగంగానే బీసీ డిక్లరేషన్, కులగణన, 42 శాతం రిజర్వేషన్ల ప్రాతిపదికన లోకల్ బాడీ ఎన్నికలకు వెళతాం అంటూ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పింది. ఇదే అంశాన్ని క్షేత్ర స్థాయిలో ప్రచారంలో ఉంచాలని భావిస్తోంది. పవర్‌లో ఉన్నప్పుడు బీసీలను దూరం పెట్టిన బీఆర్ఎస్, ఇప్పుడు ప్రతిపక్ష హోదాకు పరిమితమై తిరిగి బీసీ నినాదాన్ని ఎత్తుకుందని కాంగ్రెస్ విమర్శిస్తోంది. తమ కాంగ్రెస్ పార్టీ బీసీలకు సముచిత స్థానం కల్పించడమే కాకుండా కీలక పదవులు, ఉప ముఖ్యమంత్రి దళిత నేతకు ఇవ్వడమే కాకుండా నామినేటెడ్ పోస్టుల్లోనూ మెజారిటీ బీసీలకు ప్రత్యేకత కల్పించామనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని హస్తం పార్టీ భావిస్తోంది.
రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం కొత్త పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కసరత్తు షురూ చేశారు. ఇప్పటకే ఉమ్మడి జిల్లాల పర్యటనకు శ్రీకారం కారం చుట్టారు, ఈ క్రమంలోనే వరంగల్ జిల్లాలో పర్యటించడంతోపాటు అక్కడ బహిరంగ సభలో పాల్గొన్నారు. మరోవైపు ఉమ్మడి వరంగల్, కరీంనగర్ నిజామాబాద్ జిల్లాల ముఖ్య నేతలు, ఆయా జిల్లాల మంత్రులు, ఇంచార్జ్ మంత్రితో గాంధీభవన్‌లో రివ్యూ మీటింగ్ కూడా నిర్వహించారు. మరో ఏడు జిల్లాలకు సంబంధించి త్వరలో రివ్యూ నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఉమ్మడి నిజామాబాద్ పర్యటన చేపట్టారు. పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుండి మహేష్ కుమార్ గౌడ్ గాంధీభవన్‌లో నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ జిల్లాల పర్యటన తోపాటు రివ్యూ మీటింగ్‌లు నిర్వహిస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు.
పార్టీని ప్రక్షాళన చేయడంలో పాటు పెండింగ్‌లో ఉన్న కార్పొరేషన్ పదవులు అదేవిధంగా పీసీసి కార్యవర్గాన్ని తొందరగా పూర్తి చేసి స్థానిక సంస్థలకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని భావిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..