AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో నాగుపాముల కలకలం.. బుసలు కొడుతున్న పిల్ల నాగుల వీడియో ఇదిగో

Madhuranagar Police Station: హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మూడు నాగుపాము పిల్లలు కనిపించడంతో కలకలం రేగింది. అప్రమత్తమైన పోలీసులు ‘ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్’ సంస్థకు సమాచారం అందించగా, రెస్క్యూ బృందం సురక్షితంగా పాములను పట్టుకుని జనావాసాలకు దూరంగా తరలించింది. ఈ ఘటనలో ఎవరికీ హాని జరగలేదు.

మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో నాగుపాముల కలకలం.. బుసలు కొడుతున్న పిల్ల నాగుల వీడియో ఇదిగో
Madhuranagar Ps Snakes
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Jul 11, 2026 | 1:20 PM

Share

హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్‌ స్టేషన్‌లో శనివారం ఉదయం నాగుపాము పిల్లలు ప్రత్యక్షమవడంతో కొద్దిసేపు కలకలం నెలకొంది. స్టేషన్‌ ఆవరణలో ఒకటి తర్వాత ఒకటిగా మూడు నాగుపాము పిల్లలు కనిపించడంతో పోలీసు సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే వాటి జోలికి వెళ్లకుండా ‘ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్’ సంస్థకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న స్నేక్‌ రెస్క్యూ బృందం కొద్ది సేపటికే పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని జాగ్రత్తగా గాలింపు చేపట్టింది. స్టేషన్‌ ఆవరణలో సంచరిస్తున్న మూడు నాగుపాము పిల్లలను ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సురక్షితంగా పట్టుకుంది. అనంతరం వాటిని ఒక బకెట్‌లో ఉంచి, జనావాసాలకు దూరంగా అనువైన ప్రాంతంలో విడిచిపెట్టేందుకు తరలించింది. రెస్క్యూ బృందం చేపట్టిన ఈ ఆపరేషన్‌ను అక్కడున్న పోలీసులు, సిబ్బంది ఆసక్తిగా వీక్షించారు.

ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని పోలీసులు తెలిపారు. నాగుపాము పిల్లలను ఎలాంటి హాని కలిగించకుండా సురక్షితంగా పట్టుకుని తరలించినట్లు వెల్లడించారు. రెస్క్యూ ప్రక్రియకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. స్నేక్‌ క్యాచర్లు ఎంతో చాకచక్యంగా పాములను పట్టుకున్న తీరును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

మధురానగర్ పోలీస్‌ స్టేషన్‌కు సమీపంలో బురద ప్రాంతం, పొదలు ఉండటంతో అక్కడి నుంచి ఈ నాగుపాము పిల్లలు స్టేషన్‌ ఆవరణలోకి ప్రవేశించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. వర్షాకాలంలో ఇలాంటి ప్రాంతాల నుంచి పాములు జనావాసాల్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా పాములు కనిపిస్తే వాటిని చంపేందుకు లేదా స్వయంగా పట్టుకునేందుకు ప్రయత్నించకుండా వెంటనే అటవీ శాఖ అధికారులకు లేదా శిక్షణ పొందిన స్నేక్‌ రెస్క్యూ బృందాలకు సమాచారం ఇవ్వాలని సూచించారు. దీంతో మనుషులతో పాటు పాముల ప్రాణాలను కూడా సురక్షితంగా కాపాడవచ్చని తెలిపారు.

వీడియో చూడండి..
Follow Us