అప్పట్లో గజ్వేల్, సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గాలకు మహర్దశ పడితే ఇప్పుడు కొడంగల్ నియోజకవర్గానికి రాజ యోగం పట్టనుంది. గత బీఆర్‌ఎస్ సర్కార్‌లో నాటి సీఎం కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వేల్, అప్పట్లో మంత్రిగా పనిచేసిన కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్ల నియోజకవర్గాలకు వీఐపీ ట్రీట్‌మెంట్ ఉండేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం కావడంతో ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్‌కు మహర్దశ పట్టింది. ఇప్పటికే కొడంగల్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు అయింది. ఇక ఇవాళ ఫస్ట్ టైమ్ సీఎం హోదాలో నియోజకవర్గానికి వెళుతున్న సీఎం రేవంత్. రూ. 4 వేల కోట్ల విలువైన 71 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.
కరువు పీడిత కొడంగల్-నారాయణపేట-మక్తల్ నియోజకవర్గాల పరిధిలోని లక్ష ఎకరాలకు సాగు నీరు ఇచ్చే నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి రేవంత్ ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు. 2009లో తొలిసారి కొడంగల్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఈ పథకం సాధనకు రేవంత్ ఎంతో ప్రయత్నించారు. ఆయన పోరాటంతో 2014లోనే ఈ పథకం అమలు చేయాలని అప్పటి ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ జీవో కూడా జారీ చేశారు. రూ.2945.50 కోట్లు ఖర్చయ్యే ఈ పథకానికి పరిపాలన పరమైన అనుమతులు ఇస్తూ తెలంగాణ సర్కార్, ఈ నెల 8న జీవో జారీ చేసింది. దీంతోపాటు ఆర్ అండ్ బీ, విద్యా, వైద్య, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, పంచాయతీరాజ్, విద్యుత్, పట్టణాభివృద్ధి, పశుగణాభివృద్ధి శాఖల పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు.
ఇక కొడంగల్‌లో గవర్నమెంట్ మెడికల్ కాలేజి, నర్సింగ్ కళాశాల, ప్రభుత్వ ఫిజియో థెరపి కళాశాలలకు సీఎం శంకుస్థాన చేస్తారు. కొడంగల్‌లోని సామూహిక ఆరోగ్య కేంద్రాన్ని…220 పడకల సామర్థ్యంగల బోధన ఆసుపత్రిగా మార్చే పనులకు కూడా రేవంత్ శ్రీకారం చుడతారు. వీటి నిర్మాణంతో కొడంగల్, నారాయణపేట్‌తో పాటు సమీప నియోజకవర్గాల్లోని లక్షలాదిమంది ప్రజలకు వైద్య సేవలు చేరువ కానున్నాయి. రూ.360 కోట్ల ఖర్చుతో నిర్మించనున్న ప్రభుత్వ వెటర్నరీ కాలేజీకి కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు.
కొడంగల్ మున్సిపాలిటీ పరిధిలో రూ. 45 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులు, ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్, వికారాబాద్ జిల్లాలో సింగిల్ లేన్‌గా ఉన్న రహదారులను డబుల్ లేన్ రోడ్లుగా మార్చడం, పలు ప్రాంతాల్లో బ్రిడ్జిల నిర్మాణ పనులకు రేవంత్ శంకుస్థాపన చేస్తారు. ఇక కొడంగల్ టీఎంఆర్ స్కూల్‌కు శాశ్వత భవనాల నిర్మాణం, నియోజకవర్గం పరిధిలోని తండాలు, గిరిజన ప్రాంతాలను అనుసంధానించే రహదారుల పనులు, కొడంగల్‌లో హాస్టల్ బిల్డింగ్ నిర్మాణం పనులు, సీసీ రోడ్ల పనులకు సీఎం శ్రీకారం చుడతారు.
ఇక దౌల్తాబాద్, బొంరాస్‌పేట్‌లో జూనియర్ కాలేజీ భవనాల పనులకు ముఖ్యమంత్రి ఇవాళ శంకుస్థాపన చేస్తారు. దౌల్తాబాద్ మండలం నీటూరులో ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ స్కూల్, జూనియర్ కళాశాల భవనాలు, కోస్గిలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల భవనాల నిర్మాణ పనులు సీఎం చేతుల మీదగా శ్రీకారం చుట్టుకుంటాయి. కోస్గిలో నిర్మించే ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల భవనం, మద్దూర్‌లో నిర్మించే టీఎస్‌డబ్ల్యూఆర్ ఎస్‌జేసీ, కొడంగల్‌లో నిర్మించనున్న టీఎస్‌డబ్ల్యూఆర్ఎస్‌జేసీ భవనాల పనులకు శంకుస్థాపనలు ఉంటాయి. అలాగే కొడంగల్ నియోజకవర్గ పరిధిలో హై లెవెల్ బ్రిడ్జిలు, అప్రోచ్ రోడ్ల పనులు, దుద్యాల మండలం హస్నాబాద్‌లో విద్యుత్ సబ్ స్టేషన్ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఇక రూ. 3 కోట్ల వ్యయంతో కోస్గిలో నిర్మించిన పాలిటెక్నిక్ కాలేజి, హాస్టల్ భవనాలను సీఎం ప్రారంభిస్తారు. సీఎం రేవంత్ సంకల్పంతో ఇక కొడంగల్‌కు మహర్దశ పట్టనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..