Vidadala Rajini: ఆంధ్ర రాజకీయాల్లో తెలంగాణ ఆడబిడ్డ.. ఇప్పుడు మంత్రిగా పొలిటికల్ ట్రెండ్ సెట్టర్..

|

Apr 13, 2022 | 9:49 AM

ఏపీ రాజకీయాల్లోనే కాదు, పక్క రాష్ట్రం తెలంగాణలోనూ విడదల రజినీకి మాంచి ఫాలోయింగ్‌ ఉంటుంది. అమె చేసే కార్యక్రమాలకు అటు ప్రజల నుంచి, ఇటు సోషల్‌ మీడియాలో ప్రశంసలు వస్తుంటాయి. తాజాగా విడదల రజనికి..

Vidadala Rajini: ఆంధ్ర రాజకీయాల్లో తెలంగాణ ఆడబిడ్డ.. ఇప్పుడు మంత్రిగా పొలిటికల్ ట్రెండ్ సెట్టర్..
Vidadala Rajini
Follow us on

ఏపీ రాజకీయాల్లోనే కాదు, పక్క రాష్ట్రం తెలంగాణలోనూ విడదల రజినీకి(Vidadala Rajini) మాంచి ఫాలోయింగ్‌ ఉంటుంది. అమె చేసే కార్యక్రమాలకు అటు ప్రజల నుంచి, ఇటు సోషల్‌ మీడియాలో ప్రశంసలు వస్తుంటాయి. తాజాగా విడదల రజనికి మంత్రిగా అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్. యూత్ ఐకాన్ గా దూసుకుపోతున్న ఆమె.. ఏపీలో చిన్న వయసులోనే మంత్రి పదవి చేపట్టిన వ్యక్తిగా సరికొత్త రికార్డును సృష్టించారు. ఏపీలో తిరుగులేని పాపులారిటీ, ఉన్నత పదవి పొందిన రజని పక్కా తెలంగాణ ఆడబిడ్డ. విడుదల రజనికి మంత్రి పదవి వచ్చిందని తెలియడంతోనే ఆమె సొంత జిల్లాల్లో సంబరాలు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన విడదల రజని పక్కా తెలంగాణ బిడ్డ అనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అంతేకాదు, తెలంగాణలోని ఆమె స్వగ్రామంలో సంబురాలు కూడా జరుగుతున్నాయి.

తెలంగాణ రాజధాని కేంద్రానికి కూతవేటు దూరంలోని యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం కొండాపురం. ఇదే గ్రామానికి చెందిన రాగుల సత్తయ్య రెండో కూతురు రజని.. ఏపీ మంత్రి కావడంపై ఆ గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రజని కుటుంబంతో తమ అనుబంధాన్ని గ్రామస్తులు పంచుకున్నారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన సత్తయ్య బతుకుదెరువు కోసం 40 ఏళ్ల కిందట కొండాపురం నుంచి హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. సికింద్రాబాద్ పరిధిలోని సఫిల్ గూడలో సొంతిళ్లు కట్టుకున్న సత్తయ్యకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. మంత్రి రజని రెండో కూతురు.

1990లో పుట్టిన విడదల రజని ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధ మల్కాజ్‌గిరి లోని సెయింట్ ఆన్స్ మహిళా డిగ్రీ కళాశాలలో 2011లో బీఎస్సీ కంప్యూటర్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం ఎంబీఏ పూర్తి చేసి హైదరాబాద్‌లోనే ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగినిగా కొంత కాలం పని చేశారు. సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్న సమయంలోనే ఆంధ్రప్రదేశ్ కు చెందిన విడదల కుమారస్వామితో రజనికి వివాహం జరిగింది.

మెరుగైన అవకాశాల కోసం భారతీయ యువతలాగే అమెరికాకు వెళ్లారు. అనతికాలంలోనే అమెరికాలో సొంతగా ఓ ఐటీ కంపెనీ ప్రారంభించారు. భర్తతో కలిసి రజని అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉంటూ సాఫ్ట్‌వేర్‌ మల్టీ నేషనల్‌ కంపెనీ ప్రాసెస్ వీవర్ కంపెనీ నెలకొల్పారు. దీనికి కొన్నాళ్ల పాటు డైరెక్టర్, బోర్డు మెంబర్‌గా సేవలు అందించారు. మంత్రి రజనీకి ఇద్దరు పిల్లలు, ఒక బాబు, ఒక పాప.

అమెరికా నుంచి తిరిగొచ్చిన తర్వాత  2014లో తెలుగు దేశం పార్టీలో చేరి రాజకీయ అరంగేట్రం చేశారు. ‘సైబరాబాద్ ఐటీ వనంలో చంద్రబాబు నాటిన మొక్కను నేను..’ అంటూ రజనీ చేసిన ప్రసంగం వీడియో ఒకటి ఇప్పటికీ సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉంటుంది. భర్త కుమారస్వామి స్వస్థలమైన చిలకలూరిపేట నుంచే రజని రాజకీయాల్లో కొనసాగుతున్నారు.

విడదల రజినీ 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, గుంటూరు జిల్లా, చిలకలూరిపేట శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచింది.  2014లో రాజకీయ ఆరంగ్రేటం చేశారు. 2014లో మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శిష్యురాలిగా, తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత విఆర్ ఫౌండేషన్ స్థాపించి, నియోజకవర్గంలో సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు విడదల రజినీ. అయితే, 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. కానీ, టీడీపీ నుండి ప్రత్తిపాటి పుల్లారావు అక్కడ పోటీ చేస్తుండడంతో, 2018లో వైసీపీలో చేరారు.

వైసీపీ తరఫున జగన్ అవకాశం ఇవ్వడంతో, 2019 ఎన్నికల్లో చిలకలూరి పేట నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. తన గురువు, టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు పై 8వేల 301 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు విడదల రజినీ. ఎమ్మెల్యేగా గెలిచాక నిత్యం ప్రజల్లో ఉంటూ పలు కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా కరోనా సమయంలో పల్లెపల్లె తిరుగుతూ, ప్రజలకు అవగాహన కల్పిస్తూ, పేదలకు అండగా నిలిచారు. ఎమ్మెల్యేల్లో బీసీ ముదిరాజ్ కమ్యూనిటీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే కావడంతో తాజాగా మంత్రి పదవి వరించింది.

ఇవి కూడా చదవండి: Pranahita Pushkaralu: ఇవాళ్టి నుంచి ప్రాణహిత నది పుష్కరాలు.. మధ్యాహ్నం తర్వాత నదిలోకి పుష్కర పురుషుడు..

Tree City: భాగ్యనగరానికి మరో అరుదైన గుర్తింపు.. రెండోసారి ట్రీ సిటీగా..