భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాదం.. మంత్రాల నెపంతో నలుగురు మృతి!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం బుడుగుల గూత్తికోయ గ్రామంలో మూఢనమ్మకాల కారణంగా దారుణ ఘటన వెలుగుచూసింది. మంత్రాలు చేస్తున్నారనే నెపంతో మాసయ్య, భీమయ్య అనే ఇద్దరు వృద్ధులను కొందరు వ్యక్తులు కర్రలతో కొట్టి చంపి అడవిలో పాతిపెట్టారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఐదుగురు నిందితులను పోలీసులు గుర్తించారు. మరోవైపు, తమను కూడా చంపుతారనే భయంతో హత్యకు గురైన మాసయ్య కొడుకు రాంబాబు, కోడలు సునీత ఇప్పసారాయిలో పురుగుల మందు కలుపుకుని ఆత్మహత్య చేసుకున్నారు. చికిత్స పొందుతూ ఆ దంపతులు కూడా ప్రాణాలు కోల్పోవడంతో, ఈ ఒక్క ఘటనలోనే మొత్తం నలుగురు మృతి చెందడం జిల్లావ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాదం.. మంత్రాల నెపంతో నలుగురు మృతి!
Tribal Village Tragedy

Edited By:

Updated on: Nov 12, 2026 | 9:17 PM

సమాజం ఎంతగానో అభివృద్ధి చెందుతున్నప్పటికీ, మారుమూల ప్రాంతాల్లో ఇంకా మూఢనమ్మకాలు వేళ్లూనుకుని ఉన్నాయి. దీనికి నిదర్శనంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం బుడుగుల గూత్తికోయ గ్రామంలో జరిగిన అమానుష ఘటన నిలిచింది. మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో ఇద్దరు వృద్ధులను హత్య చేయగా, భయంతో వారి కుటుంబానికి చెందిన మరో ఇద్దరు దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వరుస మరణాలతో జిల్లాలో తీవ్ర కలకలం రేగింది. అసలు ఏం జరిగింది?

మణుగూరు మండలం బుడుగుల గ్రామానికి చెందిన పద్దం మాసయ్య, ఆళ్లపల్లి మండలం భూసురాయి గ్రామానికి చెందిన భీమయ్య బంధువులు. నెల రోజుల క్రితం మాసయ్య మనమరాలికి ఆరోగ్యం క్షీణించడంతో భీమయ్య వచ్చి పూజలు చేశాడు. అయితే, బుడుగుల గ్రామంలో గత కొంతకాలంగా భీమయ్య, మాసయ్యలు మంత్రాలు చేస్తూ స్థానికులను ఇబ్బంది పెడుతున్నారని, వీరు చేసే పూజల వల్లే గ్రామంలో అనేకమంది మృత్యువాత పడుతున్నారని కొందరు కక్ష పెంచుకున్నారు.

ఈ క్రమంలో నెల రోజుల క్రితం మాసయ్య, భీమయ్యలను దుండగులు కర్రలతో కొట్టి దారుణంగా హత్య చేసి, అడవిలోని ఓ చెక్‌డ్యామ్ దగ్గర పాతిపెట్టారు. మృతుడు భీమయ్య కూతురు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్యల్లో ఐదుగురు వ్యక్తులు పాల్గొన్నట్లు మణుగూరు సీఐ నాగబాబు తెలిపారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

ఇవి కూడా చదవండి

భయంతో దంపతుల బలవన్మరణం:

మరోవైపు, ఇదే గ్రామంలో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మంత్రాల నెపంతో హత్యకు గురైన పద్దం మాసయ్య కుమారుడు రాంబాబు (30), అతని భార్య సునీత (25) తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తమ తండ్రిని చంపినవారే తమను కూడా చంపుతారనే తీవ్ర భయంతో ఆ దంపతులు బలవన్మరణానికి నిర్ణయించుకున్నారు.

నిన్న రాత్రి ఇద్దరూ కలిసి ఇప్పసారాయిలో పురుగుల మందు కలుపుకుని తాగాక అపస్మారక స్థితికి చేరుకున్నారు. గమనించిన స్థానికులు వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో సునీత ప్రాణాలు కోల్పోయింది. రాంబాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేవలం మూఢనమ్మకాల కారణంగా ఇద్దరు హత్యకు గురికాగా, ప్రాణభయంతో మరో ఇద్దరు దంపతులు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us