Telangana: కాంగ్రెస్ సంబరాలు.. కమలం వ్యూహాలు.. ఆ ఎన్నికలపై ప్రత్యేక ఫోకస్..

| Edited By: Srikar T

Jul 19, 2024 | 4:49 PM

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై పోరుకు భారతీయ జనతా పార్టీ సన్నద్దమవుతోంది. వందరోజుల హామీలు 8 నెలలైన అమలు చేయకపోగా.. డిక్లరేషన్ల పేరుతో ఆయా వర్గాలను వంచించారంటూ టీబీజేపీ నిరసన సభలకు సన్నాహకాలు చేస్తోంది.

Telangana: కాంగ్రెస్ సంబరాలు.. కమలం వ్యూహాలు.. ఆ ఎన్నికలపై ప్రత్యేక ఫోకస్..
Telangana
Follow us on

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై పోరుకు భారతీయ జనతా పార్టీ సన్నద్దమవుతోంది. వందరోజుల హామీలు 8 నెలలైన అమలు చేయకపోగా.. డిక్లరేషన్ల పేరుతో ఆయా వర్గాలను వంచించారంటూ టీబీజేపీ నిరసన సభలకు సన్నాహకాలు చేస్తోంది. ఓ వైపు అధికార కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో మెజారీటీ అమలు చేస్తున్నామని.. ఒక్కో హామీ నెరవేరుతోందంటూ సంబరాలు చేసేందుకు రెడీ అవుతోంది. దానికి పోటాపోటీగా విపక్ష బీజేపీ అటకెక్కిన మరిన్ని హామీలంటూ ఆందోళనలకు శ్రీకారం చుడుతోంది. రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో రానున్న లోకల్ బాడీ ఎన్నికలే లక్ష్యంగా అన్ని పార్టీలు పావులు కదుపుతున్నాయి. అందుకు అధికార హస్తం పార్టీ సైతం హామీలు అమలు చేస్తున్నామంటూ ప్రజల్లోకి వెళ్లేందుకు ఉత్సావాల పేరిట కార్యక్రమాలకు రూపకల్పన చేస్తోంది. అయితే ప్రతిపక్ష పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిన కమలం పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లాలని గట్టిగా నిర్ణయించుకుంది. ఇప్పటికే నిరుద్యోగుల సమస్యలపై బీజేవైఎం రోడ్లెక్కి ధర్నాలు, పార్టీ కార్యలయాల ముట్టడిలు చేపట్టగా.. మహిళలకు రక్షణ లేదంటూ మహిళా మోర్చా ఆధ్వర్వంలో ఇటీవల ధర్నాచౌక్‎లో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాడానికి ఆయా జిల్లా కేంద్రాల్లో డిక్లరేషన్ల పేరుతో భారీ సభలు పెట్టి హామీలు ఇచ్చి అరకొరగా అమలుతో ప్రజలను మోసం చేస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ ఎక్కడైతే డిక్లరేషన్లు పెట్టిందో అక్కడే అదే వర్గాల ప్రజలతో నిరసన సభలకు కాషాయ దండు స్కెచ్ వేసింది. కాంగ్రెస్ చేస్తోన్న మోసాలను తాము అక్కడే డిక్లేర్ చేస్తామంటూ కమలం నేతలు చెబుతున్నారు. నిరుద్యోగులకు రాహుల్ గాంధీ, రేవంత్ ఎక్కడైతే సీటీ సెంట్రల్ లైబ్రరీ దగ్గర జాబ్ క్యాలెండర్ హామీ ఇచ్చారో అక్కడి నుంచే పోరాటానికి బీజేపీ రెడీ అయింది. ఈ నెల 20న చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ నుంచి ధర్నా చౌక్ వరకు భారీ ర్యాలీ చేపట్టి, ఇందిరాపార్క్ దగ్గర మహా ధర్నా చేయనున్నారు. వరంగల్‎లో కాంగ్రెస్ రైతు డిక్లేరేషన్ ఇచ్చిన చోటే రైతులతో అతిపెద్ద నిరసన సభ పెట్టి హస్తం పార్టీ మోసాన్ని డిక్లేర్ చేస్తామని బీజేపీ నేతలు చెప్పారు. చేవెళ్లలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్, సరూర్ నగర్‎లో యూత్ డిక్లరేషన్, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్, హైదరాబాద్‎లో మైనార్టీ డిక్లరేషన్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లోనే హామీలు అమలు వైఫల్యాలను ఎండగట్టాలని.. భారీ నిరసన సభలతో రేవంత్ సర్కారు మోసాలను ప్రజలకు వివరిస్తామని బీజేపీ అంటోంది కమలం పార్టీ. మొత్తంగా రాష్ట్రంలో అధికార విపక్షాల మధ్య మరో ఆసక్తికర పోరు నెలకొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..