AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణ వాసులకు గుడ్‌న్యూస్.. ఈ 5 పర్యాటక ప్రాంతాల్లో రోప్‌వేల నిర్మాణం

ఒకవైపు ఆధ్యాత్మిక వైభవం.. మరోవైపు బౌద్ధ వారసత్వపు అద్భుత చరిత్ర. ఇంకోవైపు ప్రకృతి అందాలు.. కొండలు, లోయలు, జలాశయాల సోయగాలు. ఇన్ని ప్రత్యేకతలున్నా.. పర్యాటక పటంలో ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కించుకోని ప్రాంతాలకు ఇప్పుడు కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఆధ్మాత్మిక, చారిత్రక పర్యాటక ప్రాంతాలకు రోప్వే సౌకర్యం కల్పించే దిశగా కీలక ముందడుగు పడింది.

Telangana: తెలంగాణ వాసులకు గుడ్‌న్యూస్.. ఈ 5 పర్యాటక ప్రాంతాల్లో రోప్‌వేల నిర్మాణం
Centre Approves Rs 1230 Crore Under Parvatmala Scheme
M Revan Reddy
| Edited By: |

Updated on: Oct 15, 2026 | 3:59 PM

Share

తెలంగాణ పర్యాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక అడుగులు వేస్తున్నాయి. పర్వతమాల పథకం కింద కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రానికి ఐదు రోప్‌వే ప్రాజెక్టులు మంజూరు చేసింది. రాష్ట్రంలోని అయిదు పర్యాటక ప్రాంతాలకు రోప్వే ప్రాజెక్టుల ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది. పర్వతమాల పథకంలో రూ.1,230 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే అయిదు ప్రాజెక్టుల్లో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టతో పాటు నల్లగొండలోని హనుమాన్ హిల్, నాగార్జున సాగర్‌–నాగార్జునకొండ, పెద్దపల్లిలోని రామగిరి కోట, నిజామాబాద్‌లోని ఖిల్లా రామాలయలకు ఆమోదం దక్కింది. కేంద్ర రోడ్లు, రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ఢిల్లీలో రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జరిపిన సమావేశంలో రాష్ట్రానికి చెందిన పలు ప్రాజెక్టులతోపాటు పర్వతమాల పథకంలో రోప్వేలను కేంద్రం ఆమోదించినట్లు ప్రకటించారు.

నాగార్జునకొండ.. బౌద్ధ వారసత్వానికి కొత్త గుర్తింపు

ప్రపంచపు అతిపెద్ద ద్వీపపు మ్యూజియం నాగార్జునకొండ. నాగార్జున సాగర్ అంటే కేవలం ఒక డ్యామ్ మాత్రమే కాదు.. అది ప్రకృతి అందాలకు, చారిత్రక వారసత్వానికి, బౌద్ధ సంస్కృతికి నిలయం. కృష్ణానది జలాలు.. చుట్టూ పచ్చని కొండలు.. నాగార్జునకొండ బౌద్ధ కట్టడాలు.. పర్యాటకులను ఆకట్టుకునే ఎన్నో ప్రత్యేకతలు ఈ ప్రాంతం సొంతం. అయితే ఈ వారసత్వ సంపదకు మరింత విస్తృత ప్రచారం కల్పించడం, పర్యాటకులకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించడం కీలకం. నాగార్జునసాగర్‌–నాగార్జునకొండ రోప్‌వే ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే ఈ ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకుల అనుభూతి మరో స్థాయికి చేరే అవకాశం ఉంది. కొండలు, లోయల మధ్య కేబుల్ కార్లలో ప్రయాణం.. ప్రకృతి అందాలను వీక్షించే అవకాశం ఉంది. కేవలం విహారయాత్రలకే పరిమితం కాకుండా.. చరిత్ర, పురావస్తు పరిశోధనలు, విద్యా పర్యటనలకు కూడా ఈ ప్రాంతం మరింత ప్రాధాన్యం పొందే అవకాశం ఉంది.

పర్యాటకానికి రోప్‌వే.. నల్లగొండకు కొత్త కళ

నల్లగొండ పట్టణానికి హనుమాన్ హిల్ ఆకర్షణగా ఉంది. నల్లగొండ పట్టణంలోని హనుమాన్ కొండ పైకి 1.2 కిలోమీటర్ల మేర పర్యావరణ అనుకూల రోప్‌వే ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. హనుమాన్ హిల్ కు మరో గుట్టకు ఈ రోప్వే ఏర్పాటు చేస్తే నల్గొండ పట్టణ పర్యాటక రూపురేఖలు మారానున్నాయి. పట్టణంలోని హనుమాన్ హిల్‌కు రోప్‌వే ప్రాజెక్టులో చోటు దక్కడం స్థానిక పర్యాటక రంగానికి ప్రాధాన్యమైన పరిణామం. ఈ ప్రాంతాన్ని సందర్శించే వారికి సులభమైన రవాణా సదుపాయం కల్పించడంతో పాటు, ప్రకృతి అందాలను ఆస్వాదించే అవకాశాలను విస్తరించవచ్చు.

యాదగిరిగుట్ట.. ఆధ్యాత్మిక పర్యాటకానికి మరో మెట్టు

ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం కూడా ఈ ప్రాజెక్టుకు ఎంపికైంది. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా యాదగిరి కొండకు అభిముఖంగా టెంపుల్ సిటీ లేఅవుట్ అభివృద్ధి చేశారు. పెద్ద గుట్ట- యాదగిరిగుట్ట మధ్యన 2 కిలోమీటర్లు లోయ మార్గంలో ఈ రోప్ వే ఏర్పాటు చేయనున్నారు. రెండు కొండల కోనల నుంచి రోప్ వే ప్రకృతి రమణీయత, ఆహ్లాదకరంగా మారనుంది. యాదగిరిగుట్టపై వెలిసిన స్వయంభు లక్ష్మీ నరసింహుల దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు.

చారిత్రక రామకోట..

పెద్దపల్లి జిల్లాలోని చారిత్రాత్మక రామగిరి కోట (రామగిరి ఖిల్లా)పై రోప్‌వే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కొండ పాదం నుంచి నేరుగా శిఖరం వరకు 2.1 కిలోమీటర్లు రోప్ వే ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం – మంథని – రామగిరి కోటను కలిపి ప్రధాన టూరిజం హబ్ గా అభివృద్ధి చేయడం. కఠినమైన అటవీ ప్రాంతంలో కాలినడక ప్రయాణాన్ని తప్పించి భక్తులకు, పర్యాటకులకు సురక్షితమైన ప్రయాణం అందించే ప్రయత్నం జరుగుతోంది.

ఖిల్లా రామాలయం..

అద్భుతమైన శిల్ప సంపద కలిగిన నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లిలోని ఖిల్లా ఆలయాన్ని ‘ఇందూరు ఖజురహో’ అని పిలుస్తారు. 150 మెట్లు ఉన్న ఏకశిలా శిలాతోరణం, వాసుకిపై నాట్యమాడుతున్న కృష్ణుడు, గుడి ప్రాంగణంలో రోప్ వే ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటివరకు కొండలపై ఉన్న పర్యాటక ప్రాంతాలకు చేరుకోవాలంటే రోడ్డు మార్గాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి.

రోప్‌వేలు అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం తగ్గడంతో పాటు కొండలు, లోయలు, పచ్చని ప్రకృతి అందాలను ఆకాశ మార్గంలో వీక్షించే అవకాశం కలుగుతుంది. పర్యాటకుల అనుభవం కొత్తగా మారడంతో పాటు ఆయా ప్రాంతాలకు సందర్శకుల సంఖ్య పెరిగే అవకాశముంది. ఇన్నాళ్లూ చరిత్ర పుటల్లో, భక్తుల మనసుల్లో మాత్రమే నిలిచిన ఈ ప్రాంతాలు.. ఇక పర్యాటకుల సందడితో కళకళలాడనున్నాయి. స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా పెరగనున్నాయి.

మరిన్నితెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us