అల్పపీడనంపై కచ్చితమైన రిపోర్ట్.. తుఫాన్‌గా మారుద్దా..? ఏయే ప్రాంతాలపై ప్రభావం ఉంటుంది..?
Weather: ప్రస్తుతం పొడి వాతావరణం ఉన్నా, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది వాయుగుండంగా బలపడి, నవంబర్ 15, 16 నాటికి తీరం వైపు కదిలే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాలకు వర్షాలు ఉంటాయా లేదా అనేది దాని గమనంపై ఆధారపడి ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రస్తుతానికి పొడి వాతావరణం నెలకొంది. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలను తుఫానులు, భారీ వర్షాలు భయపెట్టినప్పటికీ, ప్రస్తుతం వర్షాలు లేవు. అయితే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ అప్రమత్తంగా ఉంది. భారత వాతావరణ శాఖ (IMD) అంచనాల ప్రకారం, నవంబర్ 13, 14 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారనుంది. ఇది క్రమంగా బలపడి, నవంబర్ 14, 15 నాటికి తీవ్ర అల్పపీడనంగా, ఆ తర్వాత నవంబర్ 15, 16 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని IMD అంచనా వేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ వాతావరణం
ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్‌లో వర్ష సూచనలు లేవని IMD వెల్లడించింది. విశాఖపట్నం వాతావరణ కేంద్రం నివేదిక ప్రకారం, గురు, శుక్రవారాల్లో వర్షాలు పడే అవకాశం లేదు. అయితే దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నందున, దీని ప్రభావంతో అల్పపీడనం ఏర్పడి వాయువ్య దిశగా కదులుతూ బలపడే అవకాశం ఉంది.
మత్స్యకారులకు హెచ్చరికలు, తీరప్రాంత ప్రజలకు సూచనలు
నవంబర్ 15 వరకు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత మత్స్యకారులకు ఎలాంటి ప్రమాద హెచ్చరికలు లేవని అధికారులు తెలిపారు. ప్రస్తుతం వాతావరణం ప్రశాంతంగానే ఉంది. అయితే అండమాన్ సముద్ర ప్రాంతంలో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున, ఆ ప్రాంతానికి వెళ్ళకుండా ఉండటం మంచిదని సూచించారు. నవంబర్ 13 తర్వాత వాతావరణ శాఖ జారీ చేసే సూచనలకు అనుగుణంగా తీరప్రాంతాల్లో నివసించే ప్రజలు, రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు. ముఖ్యంగా కోతకు వచ్చిన పంటలు ఉన్న రైతులు నవంబర్ 15 తర్వాత విడుదలయ్యే హెచ్చరికలను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతానికి తుఫాను హెచ్చరికలు లేనందున సాధారణ ప్రయాణాలకు ఎలాంటి ఆటంకము లేదని స్పష్టం చేశారు.
తెలంగాణ వాతావరణం
తెలంగాణలో దాదాపు వారం రోజులుగా పొడి వాతావరణమే నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉన్నప్పటికీ, వర్షాలు లేవు. హైదరాబాద్, రామగుండం, హనుమకొండ, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ వంటి ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగుతోంది. నవంబర్ 15వ తేదీ వరకు తెలంగాణలో ఎలాంటి వర్ష సూచన లేదని IMD నివేదించింది. అయితే, వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం నవంబర్ మూడో వారంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం గమనాన్ని బట్టి తెలంగాణలో వర్షాలు కురుస్తాయా లేదా అనేది ఆధారపడి ఉంటుందని IMD అధికారులు తెలిపారు. ప్రస్తుత అధికారిక నివేదికల ప్రకారం తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం తక్కువగా ఉంది.
