Telangana: మేడ్చల్ జిల్లాలో అరుదైన ఆనవాళ్లు.. అవెంటో తెల్సా..?

|

Apr 03, 2024 | 5:51 PM

మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలం అద్రాస్ పల్లిలో పెద్దరాతి యుగం(మెగాలిథిక్) సమాధులను కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు గుర్తించారు. ఇప్పటివరకు మేడ్చల్‌ జిల్లాలో జరిపిన అన్వేషణలో పలు ప్రాంతాల్లో పెట్రోగ్లైప్స్‌, రాతి చిత్రాలు, పాతరాతియుగం సమాధులు, రాతి పనిముట్లను గుర్తించినట్టు బృందం తెలిపింది.

Telangana: మేడ్చల్ జిల్లాలో అరుదైన ఆనవాళ్లు.. అవెంటో తెల్సా..?
Megalithic Graves
Follow us on

తెలంగాణలోని మేడ్చల్‌ జిల్లాలో మూడుచింతలపల్లి మండలం అద్రస్‌పల్లిలో ఆదిమానవుల ఆనవాళ్లను కొత్త తెలంగాణ చరిత్ర బృంద సభ్యులు అహోబిలం కరుణాకర్‌, కొరివి గోపాల్‌, మహ్మద్‌ ససీరుద్దీన్‌ గుర్తించారు. పాతరాతి యుగం (మెగాలిథిక్‌) సమాధులను వారు కనుగొన్నారు. ఒక మెగాలిథిక్‌ సమాధికి 18 బంతిరాళ్లు గుండ్రంగా పాతి ఉండగా మధ్యలో సమాధికి సంబంధించిన పలకరాళ్లు పైకి కనిపిస్తున్నాయని, ఇది పెట్టె సమాధి అని వివరించారు. పరిసరాల్లో ఉన్న నిలువురాళ్లు 12 నుంచి 14 అడుగుల ఎత్తున్నాయని చరిత్ర బృందం కన్వీనర్‌ శ్రీరామోజు హరగోపాల్‌ తెలిపారు.

తెలంగాణలో కనీసం 10 లక్షల బృహత్‌ శిలాయుగపు సమాధులు ఉండి ఉండొచ్చని అప్పటి హైదరాబాద్‌ ఆర్కియలాజికల్‌ సొసైటీ సభ్యుడు, యూరోపియన్‌ పరిశోధకుడు EH హంట్‌ 1925లో రాసిన పుస్తకంలో పేర్కొన్నాడని హరగోపాల్‌ తెలిపారు. అడవుల నరికివేత, రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు, ఇతరత్రా కారణాల లక్షల్లో ఈ సమాధులు కనుమరుగు అయ్యాయని ఆయన వివరించారు.

ఇప్పటివరకు మేడ్చల్‌ జిల్లాలో జరిపిన పరిశోధనల్లో వివిధ ప్రాంతాల్లో పెట్రోగ్లైప్స్‌, రాతి చిత్రాలు, రాతి పనిముట్లు, పాతరాతియుగం సమాధులను గుర్తించినట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం వెల్లడించింది. మన పూర్వీకుల జీవన శైలి, ఆచార వ్యవహారాలు తెలిస్తే మన చరిత్ర సంపూర్ణం అవుతుందని, వాటిని విశ్లేశించి, పరిశోధించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..