
ఆదిలాబాద్ జిల్లాలో మంత్రతంత్రాలు, పూజల పేరుతో అమాయక ప్రజలను బురిడీ కొట్టిస్తున్న ముఠాల వ్యవహారం కలకలం రేపుతోంది. నిన్నటికి నిన్న పూజల పేరుతో డబ్బులు రెట్టింపు చేస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసి మోసాల గుట్టు రట్టు చేశారు. ఈ ఘటన మరువకముందే.. తాజాగా చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో ముద్రించిన నోట్లను అసలైన కరెన్సీగా నమ్మిస్తూ మోసాలకు పాల్పడుతున్న మరో ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నలుగురు అరెస్టు కాగా.. ఇద్దరు ప్రధాన నిందితులు ఇప్పటికే మరో కేసులో పోలీసుల అదుపులో ఉన్నారు. వరుస ఘటనలతో మంత్రాల ముసుగులో సాగుతున్న మోసాల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
మంచిర్యాల జిల్లాకు చెందిన పత్తి రాములుకు 2023లో అత్రం పరశురామ్ పరిచయమయ్యాడు. ఈ పరిచయాన్ని ఆసరాగా చేసుకున్న పరశురామ్.. పూజలు, మంత్రతంత్రాలతో డబ్బులు రెట్టింపు చేయవచ్చంటూ నమ్మించాడు. రూ.6.50 లక్షలు ఇస్తే పూజలు చేసి రూ.13 లక్షలు తిరిగి ఇస్తానని ఆశ చూపించాడు. దీంతో బాధితుడు షాంపూర్ శివారులో అతడికి డబ్బులు అందించాడు. అనంతరం పొలం వద్దకు తీసుకెళ్లి పూజలు చేసినట్లు నటించి.. డబ్బులు రెట్టింపు అయ్యాయని చెబుతూ ఓ బ్యాగు చేతిలో పెట్టాడు. పది రోజుల తర్వాత తెరవాలని చెప్పాడు. తీరా బ్యాగు తెరిచి చూస్తే అందులో కనిపించింది అసలు కరెన్సీ కాదు.. చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో ముద్రించిన నోట్లు, తెల్ల కాగితాలు. మోసపోయానని గుర్తించిన బాధితుడిని మరోసారి పూజల పేరుతో నమ్మించి మరిన్ని డబ్బులు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇలా మొత్తం రూ.8 లక్షలు కాజేసినట్లు ఫిర్యాదు అందింది.
ఈ ముఠా మోసాల తీరు కూడా ఆసక్తికరంగా ఉంది. చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో ముద్రించిన నోట్లను ఇతరుల నుంచి కొనుగోలు చేసి.. వాటిని అసలైన కరెన్సీ కట్టల మాదిరిగా తయారు చేస్తున్నారు. కట్టకు పైన, కింద అసలైన కరెన్సీ నోట్లను ఉంచి.. మధ్యలో నకిలీ నోట్లను అమర్చి అమాయకులకు చూపిస్తున్నారు. కట్ట మొత్తం అసలైన డబ్బేనని నమ్మించి మోసాలకు పాల్పడుతున్నారు. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితులైన అత్రం పరశురామ్, మండలి బక్కన్నలకు మరో నలుగురు సహకరిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఈ కేసులో దర్యాప్తు వేగవంతం చేసిన ఉట్నూరు పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.500 ముఖ విలువతో ముద్రించిన 34 కట్టలు, రూ.100 ముఖ విలువతో 55 కట్టలు, రూ.2 వేల ముఖ విలువతో 10 కట్టలు.. మొత్తంగా 99 కట్టల చిల్డ్రన్ బ్యాంక్ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.40 లక్షలకు పైగా ఉంటుందని అంచనా. వీటితో పాటు 100 నకిలీ బంగారు నాణేలు, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా సభ్యులపై ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాల్లోనూ పలు కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ వ్యవహారంలో ప్రధాన నిందితులైన అత్రం పరశురామ్, మండలి బక్కన్నలు ఇప్పటికే ఇచ్చోడ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మరో కేసులో అరెస్టయ్యారు. తాజాగా మరో నలుగురు పోలీసులకు చిక్కారు. ఈ ముఠా చేతిలో సుమారు 40 మంది వరకు బాధితులు ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇలాంటి మోసాలకు గురైన వారు భయపడకుండా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు.
మొత్తానికి డబ్బులు రెట్టింపు చేస్తామనే ఆశ.. అమాయకులకు కష్టాలను మిగులుస్తోంది. మంత్రతంత్రాల పేరుతో ఒకవైపు.. నకిలీ కరెన్సీ కట్టల పేరుతో మరోవైపు.. ప్రజల ఆశలను పెట్టుబడిగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. డబ్బులు ఊరికే రెట్టింపు కావు.. పూజలతో అదృష్టం మారదు.. అనే వాస్తవాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. అత్యాశకు పోయి సంపాదించిన సొమ్మును పోగొట్టుకోకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.