
తక్కువ పెట్టుబడితో ఎక్కవ ఆధాయాన్ని ఇచ్చే పంటల్లో అండుకొర్రలు కూడా ఒకటి. వీటి సాగుకు ప్రత్యేకంగా ఎరువులు, పురుగుమందులు అవసరం లేదు. కలుపు తీయాల్సిన శ్రమా ఉండదు. పైపైన దున్ని విత్తనం వేస్తే సరిపోతుందని సాగుదారులు చెబుతున్నారు. వీటిని మామిడి తోటల్లో అంతర పంటగా వేసినా, నీడ ప్రభావం లేకుండా అద్భుతమైన దిగుబడిని ఇస్తోంది. ఎకరానికి కేవలం 2.5 కిలోల విత్తనాలతో 8 క్వింటాళ్ల వరకు దిగుబడి సాధించే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. అంతర పంటగా వేసినప్పుడు దిగుబడి కొంత తగ్గినా, దాని విలువను బట్టి ఇది లాభదాయకమే అని చెబుతున్నారు.
ఈ పంట వల్ల అతి పెద్ద ప్రయోజనం ఏమిటంటే.. దాని తక్కువ సాగు కాలం. అండు కొర్రలు కేవలం 60 రోజుల్లోనే కోతకు వస్తాయి. ప్రస్తుతానికి ఒక నెల పైన అయిన పంటకు, మరో 20-25 రోజుల్లో కంకులు బాగా పక్వానికి వచ్చి హార్వెస్టింగ్ చేయవచ్చు. వర్షాలు పెరిగిన కొద్దీ మరింత సాగు విస్తీర్ణం పెంచుకోవచ్చని రైతులు చెబుతున్నారు.
అండు కొర్రలకు ప్రస్తుతం మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. సరఫరా కొరత కారణంగా కిలో రూ. 350 వరకు ధర పలుకుతోంది. అయితే, దీని ఉత్పత్తి వ్యయం కిలోకు కేవలం రూ.30 మాత్రమే. ఈ భారీ ధరల వ్యత్యాసం రైతుల లాభాలను గణనీయంగా పెంచుతుంది. అండు కొర్రలు సిరిధాన్యాల కోవకు చెందినవి కాబట్టి, ఇవి ఆరోగ్యానికి, ముఖ్యంగా క్యాన్సర్ వంటి వ్యాధుల నివారణకు ఎంతో ఉపయోగపడతాయని నిపుణులు సూచిస్తున్నారు.
అంతే కాదు ఈ పంట పశుగ్రాసంగా కూడా అత్యుత్తమమైనది. అండు కొర్రలతో పాటు కొర్రలు, అరికలు, సామలు, ఊదలు వంటి ఇతర సిరిధాన్యాలు కూడా ఇదే మాదిరి ప్రయోజనాలను అందిస్తాయి. పంట కోసిన తర్వాత మిగిలిన కాడలు, ఆకులను పశుగ్రాసంగా వాడుకోవచ్చు. ఇవి నేల సారాన్ని కూడా మెరుగుపరుస్తాయి, తదుపరి పంటలకు ఎటువంటి ఎరువులు వేయాల్సిన అవసరం లేకుండా చేస్తాయి.
అంతేకాకుండా, అండు కొర్రల పొలాలు పక్షులను ఆకర్షిస్తాయి. వేల సంఖ్యలో చిన్నచిన్న పక్షులు పంటను చూడటానికి వస్తాయి. ఈ పక్షులు పంటలో ఉండే క్రిమికీటకాలను తిని, వాటి రెట్టల ద్వారా నేలకు సహజ ఎరువును అందిస్తాయి. దీనివల్ల 10 సంవత్సరాల వరకు ఎటువంటి రసాయన ఎరువులు వేయాల్సిన అవసరం లేకుండా నేల సారవంతంగా మారుతుంది.
వేరుశనగ, కుసుమలు, మినుములు, పెసలు వంటి పంటలతో అంతర పంటగా అండు కొర్రలను వేసుకోవచ్చు. రైతులు ఈ 100 ఎకరాల పొలాన్ని సందర్శించి, ఈ అద్భుతమైన సాగు పద్ధతిని తెలుసుకోవచ్చని సాగుదారులు తెలియజేస్తున్నారు.
Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నిపుణులు, రైతుల నుంచి సేకరించిన సమాచారం మేరకు అందించబడినవి.. వీటిని Tv9 దృవీకరించడం లేదు. వీటిపై మీకు సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించవచ్చు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.