ప్రతీ ఒక్కరి స్మార్ట్ ఫోన్‌లో కచ్చితంగా ఉండే యాప్స్‌లో వాట్సాప్ ముఖ్యమైంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ కలిగిన యాప్స్‌లో ఇదీ ఒకటి. ఎప్పటికప్పుడు యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తుంది కాబట్టే వాట్సాప్‌కు ఇంతటి ఆదరణ లభిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా వాట్సాప్ మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది.
సాధారణంగా వాట్సాప్‌లో మనకు తెలిసిన వ్యక్తి ఆన్‌లైన్‌లో ఉన్నాడో లేదో ఎలా తెలుస్తుంది.? ఇందుకోసం సదరు వ్యక్తి ప్రొఫెల్‌ను క్లిక్ చేసి చూడాలి. ఒకవేళ ఆన్‌లైన్‌లో ఉంటే ఆన్‌లైన్‌లో ఉన్నట్లే లేదంటే లాస్ట్ సీన్ ఎప్పుడుందో కనిపిస్తుంది. మరి అలా కాకుండా ఆన్‌లైన్‌లో ఎవరెవరు ఉన్నారో వారి జాబితాను ఒకచోట చూపిస్తే ఎలా ఉంటుంది.? అచ్చంగా ఇలాంటి ఫీచర్‌నే తీసుకొచ్చే పనిలో పడింది వాట్సాప్. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం వాట్సాప్‌లో మనం ఎవరితోనైనా చాట్ చేయాలంటే కింద కుడివైపు ఉండే ‘ప్లస్’ సింబల్‌ను క్లిక్ చేసి చాట్‌ను సెలక్ట్ చేసుకొని మెసేజ్ చేస్తుంటాం. వాట్సాప్ తీసుకురానున్న ఈ కొత్త ఫీచర్ సహాయంతో ‘ప్లస్’ బటన్‌పై క్లిక్ చేయగానే ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో ఒక లిస్ట్ ప్రత్యక్షమవుతుంది. 2.24.9.14 వెర్షన్‌తో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఈ కొత్త ఫీచర్ బీటా టెస్టింగ్ జరుగుతోంది. ఎవరైతే రీసెంట్‌గా ఆన్‌లైన్‌లో ఉన్నారో వారి వివరాలను ఒక చోట చూపిస్తుంది.
ఇక స్టేటస్‌కు సంబంధించిన వాట్సాప్ మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ను పరిచయం చేయనుంది. యూజర్ల ఎంగేజ్‌మెంట్ కోసం ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. మన కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న వారు ఎవరైనా కొత్తగా స్టేటస్ పెడితే వెంటనే పలానా వ్యక్తి స్టేటస్ పెట్టినట్లు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను పరీక్షిస్తున్నారు. త్వరలోనే యూజర్లందరికీ ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది వాట్సాప్.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..