శాంసంగ్ గెలాక్సీ వాచ్ 4 యూజర్లకు బ్యాడ్ న్యూస్.. ఐదేళ్ల తర్వాత షాకింగ్ నిర్ణయం
Samsung Galaxy Watch 4: Samsung Galaxy Watch 4, Watch 4 Classic వినియోగదారులకు శాంసంగ్ కీలక ప్రకటన చేసింది. ఈ రెండు స్మార్ట్‌వాచ్‌లకు ఐదేళ్లపాటు అందించిన సాఫ్ట్‌వేర్ మద్దతును ఇప్పుడు నిలిపివేసింది. సెప్టెంబర్ సెక్యూరిటీ బులిటెన్‌లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. దీంతో ఇకపై కొత్త సాఫ్ట్‌వేర్, భద్రతా అప్‌డేట్స్ అందవు. అయితే ఇప్పటికే ఉన్న ఫీచర్లపై మాత్రం ఎలాంటి ప్రభావం ఉండదు.

2021 ఆగస్టులో విడుదలైన Galaxy Watch 4 సిరీస్ అప్పట్లో శాంసంగ్‌కు కీలకమైన మలుపుగా నిలిచింది. టీజెన్ నుంచి Wear OS వైపు కంపెనీ అడుగుపెట్టింది ఈ వాచ్‌లతోనే. ఇప్పుడు ఐదేళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత వీటికి అప్‌డేట్స్ నిలిచిపోయాయి. వరుసగా వచ్చిన ప్రధాన సాఫ్ట్‌వేర్ మార్పులతో యూజర్లకు అందిన అనుభవం ప్రత్యేకంగా నిలిచింది.
Wear OSలో శాంసంగ్ కీలక మార్పు..
Galaxy Watch 4, Watch 4 Classic మోడల్స్ 2021లో Wear OS 3.5తో వచ్చాయి. గూగుల్‌తో కలిసి పనిచేసిన శాంసంగ్ తొలిసారిగా ఈ వాచ్‌లలో Wear OSను తీసుకొచ్చింది. దీంతో గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకునే అవకాశం లభించింది. ఆ తర్వాత Wear OS 4, Wear OS 5, చివరగా Wear OS 6 వరకు ఈ వాచ్‌లు అప్‌గ్రేడ్ అయ్యాయి. One UI Watch విషయంలోనూ ఇదే విధమైన మద్దతు లభించింది. One UI Watch 4.5 నుంచి ప్రారంభమైన అప్‌డేట్స్ చివరకు One UI Watch 8 వరకు చేరాయి. సాధారణంగా స్మార్ట్‌వాచ్‌లకు పరిమిత అప్‌డేట్స్ మాత్రమే అందించే పరిస్థితిలో శాంసంగ్ నాలుగు ప్రధాన ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్స్ ఇవ్వడం విశేషం.
చివరి అప్‌డేట్‌తో ముగిసిన ప్రయాణం..
గత ఆగస్టులో వచ్చిన సెక్యూరిటీ ప్యాచ్ ఈ వాచ్‌లకు చివరి అప్‌డేట్‌గా నిలిచింది. సెప్టెంబర్ నుంచి శాంసంగ్ క్వార్టర్లీ సెక్యూరిటీ అప్‌డేట్ జాబితా నుంచి Galaxy Watch 4 సిరీస్‌ను తొలగించింది. ఇకపై కొత్త భద్రతా సమస్యలు వచ్చినా వాటికి ప్యాచ్‌లు అందే అవకాశం లేదు. అయితే ప్రస్తుత యూజర్లు వెంటనే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఉన్న ఫీచర్లు సాధారణంగానే పనిచేస్తాయి. ప్రస్తుతం శాంసంగ్ సెక్యూరిటీ సపోర్ట్ జాబితా Galaxy Watch 5 సిరీస్ నుంచి కొనసాగుతోంది. Galaxy Watch FEకి కూడా మద్దతు ఉంది. పాత టీజెన్ వాచ్‌లకు గత ఏడాదే సపోర్ట్ ముగియగా, ఇప్పుడు Galaxy Watch 4 వంతు వచ్చింది.
