AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ నెల 30న భారీ టెలిస్కోప్‌‌తో నాసా ప్రయోగం! దీని ప్రత్యేకతలు తెలిస్తే ఔరా అనాల్సిందే

నాసా నాన్సీ గ్రేస్ రోమన్ స్పేస్ టెలిస్కోప్ విశ్వ పరిశోధనలో కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది. హబుల్ కంటే 100 రెట్లు విస్తృతమైన వీక్షణంతో బిలియన్ల గెలాక్సీలను మ్యాప్ చేయనుంది. డార్క్ ఎనర్జీ, డార్క్ మ్యాటర్ రహస్యాలను ఛేదించడంతో పాటు లక్షలాది ఎక్సోప్లానెట్లను గుర్తించేందుకు శాస్త్రవేత్తలకు సహాయపడనుంది.

ఈ నెల 30న భారీ టెలిస్కోప్‌‌తో నాసా ప్రయోగం! దీని ప్రత్యేకతలు తెలిస్తే ఔరా అనాల్సిందే
Nasa Nancy Grace Roman Space Telescope
SN Pasha
|

Updated on: Aug 28, 2026 | 12:36 PM

Share

అంతరిక్ష పరిశోధనలో మరో కీలక ముందడుగు పడనుంది. నాసా రూపొందించిన నాన్సీ గ్రేస్ రోమన్ స్పేస్ టెలిస్కోప్ విశ్వంలోని అతి పెద్ద రహస్యాలను ఛేదించేందుకు సిద్ధమవుతోంది. సుమారు 4.3 బిలియన్ డాలర్ల వ్యయంతో రూపొందించిన ఈ అంతరిక్ష టెలిస్కోప్ ఆగస్టు 30న ప్రయోగం కానున్నట్లు సమాచారం. హబుల్ టెలిస్కోప్‌కు సమానమైన పదునైన దృష్టితో పాటు దాదాపు 100 రెట్లు విస్తృతమైన వీక్షణ క్షేత్రం దీని ప్రత్యేకత.

డార్క్ ఎనర్జీపై కీలక పరిశోధన

రోమన్ టెలిస్కోప్ తొలి ఐదేళ్లలో ప్రధానంగా మూడు భారీ సర్వేలను నిర్వహించనుంది. వీటిలో సూపర్‌నోవాలు, విశ్వశాస్త్రం, ఎక్సోప్లానెట్లపై పరిశోధనలు ఉంటాయి. విశ్వం వేగంగా విస్తరిస్తుండటానికి కారణమని భావిస్తున్న డార్క్ ఎనర్జీ స్వభావాన్ని అర్థం చేసుకోవడం ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. వేలాది సుదూర సూపర్‌నోవాలను పరిశీలించడం ద్వారా విశ్వ విస్తరణ గతంలో ఎలా మారిందో శాస్త్రవేత్తలు మరింత కచ్చితంగా అంచనా వేయనున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సూపర్‌నోవా డేటాతో పోలిస్తే ఇది భారీ పురోగతిగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

బిలియన్ల గెలాక్సీల మ్యాపింగ్

రోమన్ కాస్మోలజీ సర్వేలో ఒక బిలియన్‌కు పైగా గెలాక్సీలను మ్యాప్ చేయనుంది. గెలాక్సీల ఆకారాల్లో కనిపించే సూక్ష్మ మార్పులను పరిశీలించడం ద్వారా డార్క్ మ్యాటర్ ఎక్కడ ఉందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. యూక్లిడ్, వెరా సి. రూబిన్ అబ్జర్వేటరీ వంటి ఇతర టెలిస్కోపుల డేటాతో కలిపి విశ్లేషిస్తే డార్క్ ఎనర్జీపై మరింత కచ్చితమైన సమాచారం లభించవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

లక్షలాది ఎక్సోప్లానెట్ల వేట

ఇక ఇతర నక్షత్రాల చుట్టూ తిరిగే గ్రహాల అన్వేషణలోనూ రోమన్ సంచలనం సృష్టించనుంది. నక్షత్రాల కాంతి తాత్కాలికంగా తగ్గే విధానాన్ని పరిశీలించడం ద్వారా సుమారు 1 లక్ష కొత్త ఎక్సోప్లానెట్లను గుర్తించే అవకాశం ఉంది. అంతేకాకుండా, పాలపుంత కేంద్రంలోని కోట్లాది నక్షత్రాలను పరిశీలించి గ్రావిటేషనల్ మైక్రోలెన్సింగ్ ద్వారా సాధారణ పద్ధతుల్లో గుర్తించలేని సుమారు 2,500 గ్రహాలను కనుగొనే అవకాశం ఉందని అంచనా.

హబుల్, జేమ్స్ వెబ్‌కు తోడుగా

రోమన్ టెలిస్కోప్ సేకరించే భారీ డేటా భవిష్యత్ పరిశోధనలకు ఎంతో కీలకం కానుంది. ముఖ్యంగా ఆసక్తికరమైన లక్ష్యాలను గుర్తించిన తర్వాత వాటిని జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ మరింత లోతుగా పరిశీలించే అవకాశం ఉంటుంది. దీంతో విశ్వంలోని డార్క్ ఎనర్జీ, డార్క్ మ్యాటర్, నక్షత్రాలు, గెలాక్సీలు, గ్రహాలపై పరిశోధనలు కొత్త దశలోకి వెళ్లనున్నాయి.

Follow Us