వీవో వై 300 పేరుతో విడుదల చేసిన ఫోన్ ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా దీన్ని రూపొందించారు. రోజుకు కేవలం రూ.43 పడేలా ఈఎంఐ విధానంలో కొనుగోలు చేయవచ్చు. ఈ కొత్త స్మార్ట్ ఫోన్ పత్యేకత, ధర, ఇతర వివరాలను తెలుసుకుందాం. వీవో కంపెనీ గత నెలలోనే వై300 ప్లస్ ను విడుదల చేసింది. అనంతరం ప్రామాణిక వేరియంట్ వీవో వై300 5జీని ఆవిష్కరించింది. దీనిలో స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 చిప్ సెట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేసింది. కొత్త ఫోన్ రెండు రకాల స్టోరేజీ వేరియంట్లలో అంటే 128 జీబీ, 256 జీబీ లలో లభిస్తుంది. సోనీ కెమెరాతో ఫోటోలు స్పష్టంగా తీసుకోవచ్చు. అధునాతన ఏఐ ఫీచర్లు కూడా ఆకట్టుకుంటున్నాయి.
వీవో వై300 5జీ ఫోన్ మూడు రకాల రంగులలో అందుబాటులో ఉంది. టైటానియం సిల్వర్, ఎమరాల్డ్ గ్రీన్, ఫాంటమ్ పర్పుల్ రంగులలో నచ్చిన దాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఇక ధర విషయానికి వస్తే 8 జీబీ, 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.21,999, అలాగే 8 బీజీ, 256 జీబీ స్టోరేజీ ఫోన్ ను రూ.23,999కు కొనుగోలు చేసుకోవచ్చు. వీవో వై300 ఫోన్ బుక్కింగ్ లు ఈనెల 21న మొదలయ్యాయి. ఈ నెల 25 వరకూ కొనసాగుతాయి. కస్టమర్ల కోసం కంపెనీ వివిధ ఆఫర్లు కూడా ప్రకటించింది, ఎస్బీఐ, ఐడీఎఫ్ సీ ఫస్ట్, కోటక్ మహీంద్రా, యస్, బీంబీ, ఫెడరల్ బ్యాంకులకు చెందిన వారికి డిస్కౌంట్లు అందిస్తోంది. రూ. 2వేల తక్షణ క్యాష్‌బ్యాక్ లేదా రోజుకు రూ. 43 సులభమైన ఈఎంఐ విధానంలో ఫోన్ సొంతం చేసుకోవచ్చు. అలాగే వీవో ఇండియా ఈ- స్టోర్, ఫ్లిప్ కార్ట్, అమెజాన్, అన్ని భాగస్వామి రిటైల్ స్టోర్ లలో కొనుగోలు చేయవచ్చు.
వై 300 ఫోన్ కొనుగోలు చేసిన వారు రూ.1499కే వీవో టీడబ్ల్యూఎస్ 3ఈ ఫోన్ సొంత చేసుకోవచ్చు. ఈ ఆఫర్ నవంబర్ 21 నుంచి 30 వరకూ మాత్రమే చెల్లుబాటులో ఉంటుంది. కేవలం ఫ్లిప్ కార్ట్, అమెజాన్, స్టోర్ లలో మాత్రమే పొందే అవకాశం ఉంటుంది. కానీ వీవో ఈ-స్టోర్‌లో మాత్రం వర్తించదు. హై-గ్లోస్ మెటల్ లాంటి ఫ్రేమ్‌తో సొగసైన డిజైన్, 6.67 అంగుళాల అమోలెడ్ పంచ్-హోల్ డిస్‌ప్లే, బ్లూ లైట్ ఐ కేర్, 188 గ్రాముల బరువు దీని ప్రత్యేతకలు. 50 మెగాపిక్సెల్ సోనీ ప్రధాన కెమెరా, 2 మెగా పిక్సెల్ బోకె కెమెరాతో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. 2x పోర్ట్రెయిట్ మోడ్, ఏఐ ఆరా లైట్, ఏఐ సూపర్ మూన్, సూపర్ నైట్ అల్గారిథమ్, స్టైలిష్ నైట్ తదితర ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి. వై 300లోని 32 మెగా పిక్సల్ ఫ్రంట్ పోర్టెయిట్ కెమెరాతో సెల్ఫీలను చక్కగా తీసుకోవచ్చు. ముందు, వెనుక కెమెరాలతో ఏకకాలంలో రికార్డింగ్‌కు వీలుంటుంది. 80 డబ్ల్యూ ఫాష్‌ఛార్జ్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఎక్స్‌టెండెడ్ ర్యామ్ 3.0 ఫీచర్ ద్వారా 8 జీబీ అదనపు ర్యామ్‌ను అందిస్తుంది. ఐపీ64 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్, వెట్ టచ్ టెక్నాలజీతో ఆకట్టుకుంటోంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి