అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్లోకి HMD ఫ్లిప్ ఫోన్.. 2320 మోడల్లో ఆ ఫీచర్ తెలిస్తే మతిపోవాల్సిందే
స్మార్ట్ఫోన్ల వినియోగం పెరిగినప్పటికీ, సాధారణ ఫ్లిప్ ఫోన్లకు ఇప్పటికీ ప్రత్యేకమైన ఆదరణ ఉంది. ముఖ్యంగా పెద్దవాళ్లు, సులభంగా ఫోన్ ఉపయోగించాలనుకునే వారు, ఫీల్డ్ వర్క్‌లో ఎక్కువ సమయం గడిపేవారు బేసిక్ ఫోన్లకు ప్రాధాన్యత ఇస్తుంటారు. ఈ అవసరాలను దృష్టిలో పెట్టుకుని HMD కంపెనీ సరికొత్త 4G ఫ్లిప్ ఫోన్‌ను తీసుకురాబోతున్నట్లు టెక్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. HMD 2320 Flip 4G పేరుతో రానున్న ఈ ఫోన్లో సాధారణ ఫ్లిప్ ఫోన్లకు భిన్నంగా పలు ప్రత్యేక ఫీచర్లు ఉండనున్నట్లు సమాచారం.

ప్రముఖ టిప్‌స్టర్ @smashx_60 వెల్లడించిన వివరాల ప్రకారం.. HMD 2320 Flip 4G ఫోన్లో GPS ట్రాకింగ్, Push-to-Talk, SOS బటన్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉండనున్నాయి. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడేలా ప్రత్యేక బటన్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. కాల్స్ మాట్లాడుకోవడంతో పాటు, ఇతరులతో సులభంగా కమ్యూనికేట్ చేసుకునేందుకు వాకీ-టాకీ తరహా ఫీచర్ కూడా ఇందులో ఉండనుందని అంచనా. అయితే కంపెనీ నుంచి ఈ ఫోన్‌కు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
HMD 2320 Flip 4G ఫీచర్లు
ఈ ఫోన్లో రెండు డిస్ప్లేలు ఉండనున్నాయి. లోపల 2.4 ఇంచుల మెయిన్ LCD స్క్రీన్, బయట నోటిఫికేషన్లు చూసుకునేందుకు 1.77 ఇంచుల చిన్న డిస్ప్లే ఇవ్వనున్నారు. Unisoc T127 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్లో 64MB RAM, 128MB ఇంటర్నల్ స్టోరేజ్ ఉండనున్నాయి. మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 32GB వరకు పెంచుకోవచ్చు. ఇందులో 1,450mAh బ్యాటరీ, USB Type-C ఛార్జింగ్ పోర్ట్ అందించనున్నట్లు సమాచారం.
ఇతర కనెక్టివిటీ ఫీచర్లు
HMD 2320 Flip 4Gలో రియల్ టైమ్ GPS ట్రాకింగ్, Push-to-Talk, అత్యవసర పరిస్థితుల కోసం ప్రత్యేక SOS బటన్ ఉండనున్నాయి. అలాగే డాకింగ్ ఛార్జింగ్ సపోర్ట్, వినికిడి లోపం ఉన్నవారి కోసం Hearing Aid Compatibility (HAC) ఫీచర్ కూడా ఇవ్వనున్నారు. ఫోటోల కోసం వెనుక 0.3MP కెమెరా, Bluetooth 5.0, 2.4GHz Wi-Fi, FM రేడియో, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ అందించనున్నట్లు తెలుస్తోంది. సింగిల్ Nano SIM ద్వారా 4G LTE నెట్‌వర్క్‌కు సపోర్ట్ లభించనుంది.
గతంలో వచ్చిన HMD 2660 Flip Senior Editionలో 2.8 ఇంచుల పెద్ద డిస్ప్లే ఉన్నప్పటికీ GPS ట్రాకింగ్, Push-to-Talk ఫీచర్లు లేవు. ఇక Nokia 2360 Flip 2G నెట్‌వర్క్‌కే పరిమితం కాగా, కొత్త HMD 2320 Flip 4Gలో 4G కనెక్టివిటీతో పాటు అదనపు సేఫ్టీ ఫీచర్లు ఉండనున్నట్లు సమాచారం. ధర, లాంచ్ తేదీ వంటి వివరాలు ఇంకా వెల్లడికాలేదు.
