ఇంతింతై వటుడింతై అన్నట్లు ఆన్‌లైన్ షాపింగ్ మార్కెట్ రోజురోజుకీ విస్తరిస్తోంది. ఒకప్పుడు ఆన్‌లైన్‌లో వస్తువు కొనుగోలు చేయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించే జనాలకు ఇప్పుడు ఎంతో భరోసా వచ్చింది. ఈ కామర్స్ సైట్స్ అలాంటి నమ్మకాన్ని కస్టమర్లకు అందిస్తున్నాయి. ఇక పెద్ద పెద్ద వస్తువులే కాకుండా రోజువారీ వస్తువులను కూడా ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసుకునే రోజులు వచ్చేశాయ్. ఇక ఈ కామర్స్ సైట్స్ సైతం నిత్యం ఏదో ఒక రకమైన ఆఫర్లతో వినియోగదారులను అట్రాక్ట్ చేస్తూనే ఉన్నాయి.
అయితే పెరుగుతోన్న ఆన్‌లైన్ షాపింగ్‌తో పాటే సైబర్ నేరాలు సైతం పెరిగిపోతున్నాయి. ఆన్‌లైన్ షాపింగ్ మాటున నేరస్థులు డబ్బులు కొట్టేస్తున్నారు. రకరకాల విధానాల్లో నేరాలకు పాల్పడుతూ ఎక్కడో కూర్చొని ప్రజల అకౌంట్ల నుంచి డబ్బులు కాజేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో అసలు ఆన్‌లైన్ షాపింగ్ చేసేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? మోసానికి గురి కాకూడదనకుంటే ఎలాంటి పద్ధతలు పాటించాలి.? లాంటి పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
మనలో చాలా మంది ఆన్‌లైన్ షాపింగ్ చేసే సమయంలో క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలను ఆన్‌లైన్‌లో సేవ్ చేస్తుంటారు. షాపింగ్ చేసే సమయంలో పదే పదే కార్డు వివరాలను ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలా చేస్తుంటారు. అయితే ఇది ఎంత మాత్రం సురక్షితం కాదని నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణం హ్యాకర్లు సదరు వెబ్‌సైట్‌ను హ్యాక్ చేస్తే మీ కార్డు వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు వెబ్‌సైట్ లేదా యాప్స్‌లో కార్డు వివరాలను సేవ్ చేయకుండా అప్పటికప్పడు పేమెంట్ చేయడమే ఉత్తమం.
భారీ డిస్కౌంట్‌తో స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు అంటూ కొన్ని ఫార్వర్డ్ మెసేజ్‌లు రావడం మీరు గమనించే ఉంటారు. క్లాత్ నుంచి మొదలు ఎలక్ట్రిక్ సామాన్ల వరకు డిస్కౌంట్స్ పేరుతో కొన్ని రకాల లింక్స్ వస్తుంటాయి. అయితే ఎలాంటి అధికారికత లేని లింక్స్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయకూడదు. వీటిలో దాదాపు ఫేక్ వెబ్ సైట్స్ ఉంటాయని సైబర్ నిపుణులు చెబుతున్నారు. సదరు వెబ్‌సైట్ నిజమైందో కాదో క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతే కొనుగోలు చేయాలి.
ఇలాంటి ఆన్‌లైన్ షాపింగ్ మోసాల బారిన పడకూడదనకుంటే ఎట్టి పరిస్థితుల్లో అనధికారిక వెబ్‌సైట్స్‌పై క్లిక్ చేయకూడదు. మీ బ్యాంక్ వివరాలను, వ్యక్తిగత వివరాలను ఎట్టి పరిస్థితుల్లో ఆన్‌లైన్‌లో షేర్ చేయకూడదు. ఒకవేళ సైబర్ క్రైమ్ బారిన పడినట్లయితే వెంటనే భారత ప్రభుత్వ హెల్ప్ నెంబర్ 1930కి కాల్ చేసి విషయాన్ని తెలియజేయాలి. అలాగే అధికారిక వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయొచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..