PKL 2024: ప్రొ కబడ్డీ లీగ్‌లో యు ముంబా బోణీ.. సూపర్‌‌10తో సత్తా చాటిన జఫర్దనేష్

|

Oct 23, 2024 | 10:40 PM

PKL Season 11: ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్‌ను ఓటమితో ఆరంభించిన యు ముంబా వెంటనే పుంజుకుంది. అమిర్‌‌మొహమ్మద్ జఫర్దనేష్‌ (10 పాయింట్లు) సూపర్ టెన్‌తో విజృంభించడంతో గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి బోణీ చేసింది.

PKL 2024: ప్రొ కబడ్డీ లీగ్‌లో యు ముంబా బోణీ.. సూపర్‌‌10తో సత్తా చాటిన జఫర్దనేష్
U Mumba Beat Gujarat
Follow us on

హైదరాబాద్, అక్టోబర్ 23: ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్‌ను ఓటమితో ఆరంభించిన యు ముంబా వెంటనే పుంజుకుంది. అమిర్‌‌మొహమ్మద్ జఫర్దనేష్‌ (10 పాయింట్లు) సూపర్ టెన్‌తో విజృంభించడంతో గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి బోణీ చేసింది. బుధవారం రాత్రి ఇక్కడి  జీఎంసీ బాలయోగి ఇండోర్‌‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో యు ముంబా 33–27 తేడాతో గుజరాత్‌ను ఓడించింది. గుజరాత్ తరఫున పర్దీక్ దహియా, సొంబీర్‌‌ చెరో ఐదు పాయింట్లతో రాణించినా ఫలితం లేకపోయింది. ఒక గెలుపు, ఒక ఓటమితో గుజరాత్ 6 పాయింట్లతో ఆరో స్థానంలో ఉండగా, యు ముంబా 5 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది.

ఆరంభంలో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఇరు జట్ల డిఫెన్స్‌ బలంగా ఉండటంతో పాయింట్లు అంత సులువుగా రాలేదు. తన రైడ్‌లో నీరజ్‌ను టచ్ చేసి మంజీత్‌ ముంబా ఖాతా తెరిచాడు. గుమన్‌ సింగ్‌ను ట్యాకిల్ చేసిన ఆ జట్టు మరో పాయింట్ అందుకుంది. అయితే, సోంబిర్ యాంకిల్‌ హోల్డ్‌తో మంజీత్‌ను ట్యాకిల్ చేసి గుజరాత్‌కు తొలి పాయింట్ అందించాడు. ఆపై అజిత్‌ను జితేందర్‌ను నిలువరించగా.. ముంబా రైడర్‌‌ గుమన్‌ మరో టచ్ పాయింట్ తెచ్చాడు. 6–6తో స్కోరు సమంగా ఉన్న దశలో ముంబా కాస్త వేగం పెంచింది. వరుసగా మూడు పాయింట్లతో 9–6తో ఆధిక్యంలోకి వచ్చింది. కానీ, జఫర్దనేష్‌ను సూపర్ ట్యాకిల్ చేసిన జెయింట్స్‌ వెంటనే 9–9తో స్కోరు సమం చేసింది. అయితే, తన తర్వాతి రైడ్‌లో నీరజ్‌, హిమాన్షును ఔట్ చేస్తూ జఫర్దనేష్‌ రెండు పాయింట్లు రాబట్టాడు. దాంతో ముంబా 14–13తో ఒక్క పాయింట్ ఆధిక్యంతో తొలి అర్ధభాగాన్ని ముగించింది.

U Mumba Beat Gujarat

రెండో అర్ధభాగం మొదలైన వెంటనే గుజరాత్ కోర్టులో మిగిలిన ఇద్దరు ఆటగాళ్లు జితేందర్‌‌, నీరజ్‌ను జఫర్దనేష్ ఔట్ చేశాడు. దాంతో ప్రత్యర్థిని తొలిసారి ఆలౌట్ చేసిన ముంబా 18–13తో ఐదు పాయింట్ల ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక్కడి నుంచి ముంబా హవానే నడించింది. జఫర్దనేష్‌ వరుస రైడ్ పాయింట్లతో పాటు డిఫెన్స్‌లో ఆకట్టుకున్నాడు. రెండు విజయవంతమైన ట్యాకిల్స్‌ చేశాడు. మరోవైపు తొలి అర్ధభాగంలో నిరాశపరిచిన గుజరాత్ రైడర్లు పర్తీక్ దహియా పుంజుకున్నా.. ముంబా వెనక్కు తగ్గలేదు. చివరి వరకు తన ఆధిక్యాన్ని కాపాడుకుంటూ వెళ్లి సీజన్‌లో తొలి విజయం ఖాతాలో వేసుకుంది.

U Mumba Beat Gujarat

కాగా, ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్‌లో భాగంగా గురువారం జరిగే తొలి మ్యాచ్‌లో బెంగాల్‌ వారియర్స్‌తో యూపీ యోధాస్ తలపడుతుంది. మరో మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్‌తో జైపూర్ పింక్ పాంథర్స్‌ పోటీ పడనుంది.