Pro Kabaddi: ఆఖరు రైడ్ వరకు నరాలుతెగే ఉత్కంఠ.. బెంగాల్‌, పుణెరి పోరు టై

|

Oct 29, 2024 | 9:36 PM

PKL 2024, Pro Kabaddi League - Season 11: : ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్‌లో మరో మ్యాచ్‌ టైగా ముగిసింది. ఆఖరు కూత వరకు ఉత్కంఠరేపిన బెంగాల్‌ వారియర్స్‌, పుణెరి పల్టాన్‌ పోరు 32-32తో టై అయ్యింది. మాజీ చాంపియన్ల సమరంలో ప్రథమార్థం ఆటలో పుణెరి పల్టాన్‌ మూడు పాయింట్ల ఆధిక్యం సాధించినా.. ద్వితీయార్థంలో బెంగాల్‌ వారియర్స్‌ లెక్క సమం చేసింది.

Pro Kabaddi: ఆఖరు రైడ్ వరకు నరాలుతెగే ఉత్కంఠ.. బెంగాల్‌, పుణెరి పోరు టై
Bengal Warriorz Vs Puneri Paltan
Follow us on

హైదరాబాద్‌, 29 అక్టోబర్‌ 2024 : ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్‌లో మరో మ్యాచ్‌ టైగా ముగిసింది. ఆఖరు కూత వరకు ఉత్కంఠరేపిన బెంగాల్‌ వారియర్స్‌, పుణెరి పల్టాన్‌ పోరు 32-32తో టై అయ్యింది. మాజీ చాంపియన్ల సమరంలో ప్రథమార్థం ఆటలో పుణెరి పల్టాన్‌ మూడు పాయింట్ల ఆధిక్యం సాధించినా.. ద్వితీయార్థంలో బెంగాల్‌ వారియర్స్‌ లెక్క సమం చేసింది. పీకెఎల్‌ సీజన్‌ 11లో ఇది మూడో టై కావటం విశేషం. బెంగాల్‌ వారియర్స్‌ ఆటగాళ్లలో రెయిడర్‌ సుశీల్‌ (10 పాయింట్లు) సూపర్‌ టెన్‌ ప్రదర్శనతో మెరువగా..నితిన్‌ కుమార్ (6 పాయింట్లు), నితేశ్‌ కుమార్‌ (4 పాయింట్లు) రాణించారు. పుణెరి పల్టాన్ తరఫున ఆకాశ్‌ షిండె (8 పాయింట్లు), పంకజ్‌ మోహిత్‌ (8 పాయింట్లు) ఆకట్టుకున్నారు. ఐదు మ్యాచుల్లో మూడు విజయాలు,ఓ టైతో పాయింట్ల పట్టికలో పుణెరి పల్టాన్‌ అగ్రస్థానం నిలుపుకోగా.. బెంగాల్‌ వారియర్స్‌ నాలుగు మ్యాచుల్లో ఒక్క విజయమే సాధించింది.

నువ్వా.. నేనా! :

బెంగాల్‌ వారియర్స్‌తో మ్యాచ్‌లో పుణెరి పల్టాన్‌ శుభారంభం చేసింది. తొలి పది నిమిషాల్లో పాయింట్ల కోసం ఇరు జట్ల ఆటగాళ్లు చెమటోడ్చారు. ప్రతి కూతకు పాయింట్లు మారుతుండటంతో ఆధిపత్యం కోసం నువ్వా నేనా అన్నట్టు ఉత్కంఠ నడిచింది. తొలి పది నిమిషాల ఆట అనంతరం బెంగాల్‌ వారియర్స్‌ 7-6తో ఓ పాయింట్‌ ముందంజలో నిలిచింది. కానీ తర్వాతి పది నిమిషాల్లో పుణెరి పల్టాన్‌ పుంజుకుంది. ప్రథమార్థం ఆట ముగిసే సమయానికి పుణెరి పల్టాన్‌ మూడు పాయింట్ల ఆధిక్యం సాధించింది. 15-12తో బెంగాల్‌ వారియర్స్‌పై పైచేయి సాధించింది.

Bengal Warriorz Vs Puneri Paltan

విరామం అనంతరం బెంగాల్‌ వారియర్స్‌ దూకుడు పెంచింది. రెయిడర్లు సుశీల్‌ సూపర్‌ టెన్‌ షోతో దూకుడు పెంచాడు. దీంతో బెంగాల్‌ వారియర్స్‌ వెనుకంజ నుంచి పుంజుకుని ఆధిక్యం కోసం పోటీపడింది. రెయిడింగ్‌లో నితిన్‌ కుమార్‌, డిఫెన్స్‌లో నితిన్‌ మెరవటంతో బెంగాల్‌ వారియర్స్‌ రేసులోకి వచ్చింది. 30-31తో ఓ పాయింట్‌ వెనుకంజలో ఉండగా విశ్వాస్‌ రెయిడ్‌ పాయింట్‌తో బెంగాల్‌ వారియర్స్‌ స్కోరు సమం చేసింది. ఆ తర్వాత వరుసగా చావోరేవో తేల్చకోవాల్సిన రెయిడ్లలో ఇరు జట్లు నిరాశపరిచాయి. ఆఖరు రెండు కూతల్లో ఎవరికీ పాయింట్‌ దక్కలేదు. దీంతో 32-32తో బెంగాల్ వారియర్స్‌, పుణెరి పల్టాన్ సమవుజ్జీలుగా నిలిచి పాయింట్లను సమానంగా పంచుకున్నాయి.