PKL 2024: సీజన్ 11లో జైపూర్ పింక్ పాంథర్స్ శుభారంభం.. బెంగాల్‌ వారియర్స్‌పై ఉత్కంఠ విజయం

|

Oct 20, 2024 | 11:23 PM

ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్‌లో  జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు ఉత్కంఠ విజయంతో శుభారంభం చేసింది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో జైపూర్‌‌ 39–34తో బెంగాల్ వారియర్స్‌ను ఓడించింది.

PKL 2024: సీజన్ 11లో జైపూర్ పింక్ పాంథర్స్ శుభారంభం.. బెంగాల్‌ వారియర్స్‌పై ఉత్కంఠ విజయం
Jaipur Pink Panthers Defeats Bengal Warriorz1
Follow us on
హైదరాబాద్‌, అక్టోబర్‌‌ 20: కెప్టెన్, స్టార్ రైడర్‌‌ అర్జున్ దేశ్వాల్ 15 పాయింట్లతో అదరగొట్టడంతో ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్‌లో  జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు ఉత్కంఠ విజయంతో శుభారంభం చేసింది.  ఆదివారం రాత్రి హైదరాబాద్ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో జైపూర్‌‌ 39–34తో బెంగాల్ వారియర్స్‌ను ఓడించింది. అర్జున్‌తో పాటు రైడర్‌‌ అభిజీత్ మాలిక్‌ (7 పాయింట్లు)  జైపూర్‌‌  విజయంలో కీలకంగా నిలిచాడు. బెంగాల్‌  జట్టులో నితిన్ ధాంకర్‌‌ (13) సూపర్ టెన్ సాధించగా, మణిందర్ సింగ్‌ (8), కెప్టెన్ ఫజెల్ అత్రాచలి (6) పోరాడినా ఫలితం లేకపోయింది. ఈ మ్యాచ్‌లో జైపూర్ తన ప్రత్యర్థిని రెండుసార్లు ఆలౌట్ చేసింది.
ఆధిపత్యం చేతులు మారుతూ సాగిన ఈ మ్యాచ్‌లో చివరకు బెంగాల్‌పై జైపూర్‌‌ పైచేయి సాధించింది. అర్జున్‌ దేశ్వాల్‌ను ట్యాకిల్‌ చేసిన నితేష్‌ కుమార్‌‌ జైపూర్‌‌కు తొలి పాయింట్ అందించగా.. వికాష్‌ ఖండోలా తన రైడ్‌లో నితేష్‌ను టచ్‌ చేసి బెంగాల్ ఖాతా తెరిచాడు. మరోసారి రైడ్‌కు వచ్చిన అర్జున్‌ను ఫజెల్‌ అత్రాచలి ట్యాకిల్‌ చేయగా.. మణిందర్ సింగ్ వరుసగా రెండు బోన్‌ పాయింట్లు తేవడంతో బెంగాల్ 5–2తో  ఆరంభం ఆధిక్యం అందుకుంది. ఈ దశలో అర్జున్ దేశ్వాల్  ఒక్కసారిగా జోరు పెంచాడు. వరుసగా సక్సెస్‌ఫుల్ రైడ్లతో పాయింట్లు రాబట్టి 9–8తో పింక్ పాంథర్స్‌ను తొలిసారి ఆధిక్యంలోకి తెచ్చాడు.  అతని దెబ్బకు బెంగాల్ కోర్టులో నితిన్‌ ధాంకర్‌‌ ఒక్కడే మిగిలిపోయాడు. నితిన్‌ను  కూడా ట్యాకిల్ చేసి 11వ నిమిషంలో ప్రత్యర్థిని తొలిసారి ఆలౌట్‌ చేసిన జైపూర్ 12–9తో  తన ఆధిక్యాన్ని పెంచుకుంది. ఇక్కడి నుంచి ఇరు జట్లూ పోటాపోటీగా ఆడాయి. సుర్జీత్‌ పట్టు నుంచి తప్పించుకొని వచ్చిన నితిన్‌ సూపర్ రైడ్ చేయడంతో బెంగాల్ 13–15తో ప్రత్యర్థిని అందుకునే ప్రయత్నం చేసింది. కానీ, మరోవైపు అర్జున్ తన జోరు కొనసాగిస్తూ సూపర్ టెన్ పూర్తి చేసుకున్నాడు.  జట్టును 21–15తో ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. అయితే, విరామానికి ముందు  ఫజల్ అత్రాచలి సూపర్ ట్యాకిల్‌తో అర్జున్‌ను మరోసారి నిలువరించాడు. దాంతో తొలి అర్ధభాగాన్ని జైపూర్‌‌ 21–18తో మూడు పాయింట్ల ఆధిక్యంతో ముగించింది.
 రెండో భాగంలో బెంగాల్‌ డిఫెన్స్‌లో మెరుగైంది. ఆ జట్టు కెప్టెన్‌ ఫజల్ అత్రాచలి వరుసగా రెండు సూపర్ ట్యాకిల్స్‌తో సత్తా చాటడంతో 23–24తో ప్రత్యర్థి ఆధిక్యాన్ని తగ్గించింది. కానీ, ఫజెల్ పోరాటం బెంగాల్‌ను మరో ఆలౌట్‌ ప్రమాదం నుంచి తప్పించలేపోయింది.  31వ నిమిషంలో బెంగాల్‌ను రెండోసారి ఆలౌట్‌ చేసిన జైపూర్‌‌ 29–25తో నాలుగు పాయింట్ల ఆధిక్యం సంపాదించుకుంది. కోర్టుపైకి పూర్తి జట్టు వచ్చిన తర్వాత బెంగాల్‌ పుంజుకుంది.  రైడర్లు మణిందర్, నితిన్  తెలివిగా ఆడుతూ  వరుసగా పాయింట్లు తీసుకొచ్చారు. అభిజీత్ మాలిక్‌ను ఔట్‌ చేసి నితిన్‌ సూపర్‌‌10 పూర్తి చేసుకోగా.. బెంగాల్ 30–32తో ముందుకొచ్చింది. మరో రెండు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా  నితిన్.. అర్జున్‌, లక్కీ శర్మను ఔట్ చేసి  రెండు పాయింట్లు రాబట్టడంతో 34–35తో మ్యాచ్‌లో ఉత్కంఠ రేగింది. కానీ, మరోసారి రైడ్‌కు వచ్చిన నితిన్‌ సూపర్ ట్యాకిల్ చేసిన జైపూర్ విజయం సొంతం చేసుకుంది.