CWG 2026 : కష్టాలను తొక్కేసి.. వెయిట్లను ఎత్తేసి.. భారత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన వీరనారి

CWG 2026 Harjinder Kaur : కామన్వెల్త్ గేమ్స్ 2026లో హర్జిందర్ కౌర్ రజత పతకం సాధించి భారత్‌కు గర్వకారణమయ్యారు. గేదెలు మేపిన రోజుల నుంచి వెయిట్‌ లిఫ్టింగ్‌లో ప్రపంచ వేదిక పై మెరిసిన ఆమె జీవిత ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం.

CWG 2026 : కష్టాలను తొక్కేసి.. వెయిట్లను ఎత్తేసి.. భారత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన వీరనారి
Harjinder Kaur

Updated on: Jul 29, 2026 | 6:47 AM

CWG 2026 : భారత వెయిట్‌లిఫ్టర్ హర్జిందర్ కౌర్ మరోసారి అంతర్జాతీయ వేదికపై మన దేశం పేరును మార్మోగేలా చేశారు. కామన్వెల్త్ గేమ్స్ 2026లో మహిళల 69 కేజీల విభాగంలో అద్భుత ప్రదర్శన కనబరిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ పోటీల్లో ఆమె మొత్తం 227 కేజీల బరువును ఎత్తి తన కెరీర్‌లోనే అత్యుత్తమ వ్యక్తిగత రికార్డును నమోదు చేసింది. కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్‌కు ఇది 11వ మెడల్ కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో స్నాచ్ విభాగంలో 101 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో 126 కేజీల బరువు ఎత్తి ఈ చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. అంతకుముందు 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో 71 కేజీల విభాగంలో ఆమె కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే.

హర్జిందర్ బలానికి అసలు కారణం ఏంటి?

పంజాబ్‌లోని మెహస్ గ్రామానికి చెందిన హర్జిందర్ కౌర్ విజయ ప్రస్థానం ఎన్నో కష్టాలతో కూడుకుంది. ఆమె కుటుంబం ఒకే ఒక్క గది ఉన్న ఇంట్లో నివసించేది. అక్కడ వారు ఆరు గేదెలను పోషిస్తూ, కౌలుకు వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. చిన్నతనంలో హర్జిందర్ పొలాల్లో పశువుల కోసం గడ్డి కోయడం, కత్తిరించే యంత్రాన్ని తిప్పడం వంటి పనులు చేసేది. ఆ రోజుల్లో చేసిన కష్టమే ఆమె చేతులకు కొండంత బలాన్ని ఇచ్చి, తర్వాతి కాలంలో వెయిట్‌లిఫ్టింగ్ రంగానికి బలమైన పునాదిగా మారింది.

కబడ్డీ నుంచి క్రీడా ప్రస్థానం ప్రారంభం

తండ్రి సాహిబ్ సింగ్, తల్లి కుల్దీప్ కౌర్‌లకు చిన్న కుమార్తె అయిన హర్జిందర్‌కు చిన్నప్పటి నుంచే క్రీడలంటే ఎంతో ఆసక్తి ఉండేది. నాభాలోని ప్రభుత్వ గర్ల్స్ స్కూల్‌లో చదువుతున్న సమయంలో పంజాబ్‌లో ఎంతో ప్రజాదరణ పొందిన కబడ్డీ ఆటతో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ప్రాక్టీస్ కోసం రోజూ 5 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ మైదానానికి వెళ్లేది. ఆ తర్వాత ఆనంద్‌పూర్ సాహిబ్‌లోని కాలేజీలో చేరినప్పుడు కోచ్ సురీందర్ సింగ్ ఆమెను కాలేజీ కబడ్డీ జట్టులోకి తీసుకున్నారు. అనంతరం పంజాబీ యూనివర్సిటీ స్పోర్ట్స్ వింగ్‌కు చేరుకున్నాక, కోచ్ పరమ్‌జీత్ శర్మ హర్జిందర్ టాలెంట్ ను గుర్తించారు.

తాడు లాగడం నుంచి వెయిట్‌లిఫ్టింగ్ వైపు

ఆమె భుజాలు, చేతుల్లో ఉన్న అసాధారణమైన బలాన్ని చూసిన కోచ్ శర్మ, మొదట ఆమెను తాగు లాగడం (Tug of War) జట్టులో చేర్చారు. రస్సాకషి(తాడు లాగే పోటీ) పోటీల్లో తన సత్తా చాటిన తర్వాత, కోచ్‌ల సలహా మేరకు ఆమె వెయిట్‌లిఫ్టింగ్ వైపు అడుగులు వేసింది. ప్రారంభంలో కబడ్డీ, రస్సాకషి నుంచి వెయిట్‌లిఫ్టింగ్‌కు మారడానికి కాస్త సమయం పట్టినప్పటికీ, హర్జిందర్ పడ్డ కష్టం వృథా పోలేదు. సరైన దిశలో కష్టపడితే విజయాలు అవే వస్తాయని నిరూపిస్తూ, ఈరోజు దేశం గర్వించేలా మరో అంతర్జాతీయ పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించింది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us