West Indies Cricket: భారత్‌తో సిరీస్‌కు ముందే విండీస్‌కు బిగ్ షాక్.. ఆటగాళ్ల జీతాల్లో భారీ కోత ఎందుకంటే?

West Indies Cricket: వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఖర్చులను తగ్గించే చర్యల్లో భాగంగా అంతర్జాతీయ ఆటగాళ్ల రిటైనర్ ఫీజుల్లో 25 శాతం కోత విధించింది. దేశవాళీ ఆటగాళ్ల కాంట్రాక్టులను ఏడు నెలలకు తగ్గించడంతో పాటు పురుషుల Super50, మహిళల T20 Blaze టోర్నమెంట్లను సస్పెండ్ చేసింది. దేశీయ ప్రయాణాలు, వసతి ఖర్చులు కూడా బోర్డుపై భారీ భారంగా మారినట్లు CEO క్రిస్ డెహ్రింగ్ వెల్లడించారు.

West Indies Cricket: భారత్‌తో సిరీస్‌కు ముందే విండీస్‌కు బిగ్ షాక్.. ఆటగాళ్ల జీతాల్లో భారీ కోత ఎందుకంటే?
West Indies Cricket

Updated on: Sep 27, 2026 | 8:40 AM

West Indies Cricket: ప్రపంచ క్రికెట్‌లో ఒకప్పుడు అగ్రరాజ్యంగా వెలుగొందిన వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రస్తుతం వెస్టిండీస్ జట్టు భారత్ పర్యటనలో భాగంగా పరిమిత ఓవర్ల సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. అయితే ఈ సిరీస్ ప్రారంభానికి ముందే వెస్టిండీస్ క్రికెట్‌కు సంబంధించిన ఒక షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. బోర్డులో నెలకొన్న తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆటగాళ్ల జీతాల్లో కోత విధించడంతో పాటు, పలు కీలక దేశీయ టోర్నమెంట్‌లను రద్దు చేస్తున్నట్లు బోర్డు వర్గాలు అధికారికంగా ప్రకటించాయి.

ఆటగాళ్ల జీతాల్లో 25 శాతం కోత

ఆర్థిక లోటును పూడ్చుకునే చర్యల్లో భాగంగా క్రికెట్ వెస్టిండీస్ సంచలన నిర్ణయాలు తీసుకుంది. సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగిన ఆటగాళ్ల జీతాలలో ఏకంగా 25 శాతం కోత విధిస్తున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా దేశీయ క్రికెటర్ల కాంట్రాక్ట్ కాలాన్ని కేవలం 7 నెలలకు కుదించారు. మరోవైపు దేశవాళీ క్రికెట్‌ను ప్రోత్సహించే మెన్స్ సూపర్ 50, ఉమెన్స్ టీ20 బ్లేజ్ వంటి ప్రముఖ టోర్నమెంట్‌లను ఈ ఏడాదికి పూర్తిగా సస్పెండ్ చేశారు. బోర్డు ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి ఈ కఠిన నిర్ణయాలు తప్పడం లేదని బోర్డు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

ప్రయాణ ఖర్చులే బోర్డు కొంపముంచాయా?

వెస్టిండీస్ క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్రిస్ డేహరింగ్ బోర్డు ఎదుర్కొంటున్న ఇబ్బందుల వెనుక అసలు కారణాలను బయటపెట్టారు. గత 15 ఏళ్ల కాలంలో కరేబియన్ ద్వీప దేశాల మధ్య జరిపిన దేశీయ విమాన ప్రయాణాల కోసం బోర్డు ఏకంగా 80 మిలియన్ డాలర్లు (మన భారత కరెన్సీలో సుమారు రూ.670 కోట్లు) ఖర్చు చేసిందని ఆయన తెలిపారు. అయితే ఈ విమానయాన సంస్థల నుంచి బోర్డుకు ఎలాంటి స్పాన్సర్‌షిప్ లేదా ఆర్థిక సహాయం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విపరీతంగా పెరిగిపోయిన ప్రయాణ, వసతి ఖర్చుల కారణంగా బోర్డుపై తీవ్రమైన ఆర్థిక భారం పడిందని పేర్కొన్నారు.

భారత్ సిరీస్‌పైనే విండీస్ ఆశలు

ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వెస్టిండీస్ క్రికెట్ బోర్డు, భారత్‌తో జరగబోయే వైట్-బాల్ సిరీస్‌పై భారీ ఆశలు పెట్టుకుంది. సాధారణంగా టీమిండియాతో జరిగే సిరీస్‌ల ద్వారా ఆయా దేశాల బోర్డులకు బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్, స్పాన్సర్‌షిప్‌ల రూపంలో భారీగా ఆదాయం సమకూరుతుంది. ఈ భారత పర్యటన ద్వారా వచ్చే ఆదాయంతో కొంతవరకు ఆర్థిక ఊరట లభిస్తుందని విండీస్ బోర్డు భావిస్తోంది. మరి ఈ ఆర్థిక సంక్షోభం నుంచి వెస్టిండీస్ క్రికెట్ పూర్తిగా ఎలా బయటపడుతుందో వేచి చూడాలి.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us