Team India: పెళ్లిపీటలు ఎక్కనున్న ఛాంపియన్ ప్లేయర్.. వధువు ఎవరంటే?

Kuldeep Yadav Vanshika Marriage: టీ20 వరల్డ్ కప్ 2026 విజయం తర్వాత భారత క్రికెట్ జట్టులో మరో ఆనంద వార్త వెలువడింది. స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన చిన్ననాటి స్నేహితురాలు వంశికాతో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. వరల్డ్ కప్ విజయానందం మధ్య జరగనున్న ఈ పెళ్లి వేడుక ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది.

Team India: పెళ్లిపీటలు ఎక్కనున్న ఛాంపియన్ ప్లేయర్.. వధువు ఎవరంటే?
Kuldeep Yadav Wedding Date

Updated on: Mar 11, 2026 | 9:41 AM

Kuldeep Yadav Wedding Date: టీమిండియా చైనామన్ కుల్డీప్ యాదవ్ (Kuldeep Yadav) టీ20 వరల్డ్ కప్ 2026 విజయం తర్వాత తన వ్యక్తిగత జీవితంలో కీలక నిర్ణయం తీసుకున్నాడు. భారత జట్టు వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ గెలిచిన నేపథ్యంలో కుల్దీప్ కూడా ఈ విజయానికి భాగస్వామిగా నిలిచాడు. భారత జట్టు (Team India) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ (Narendra Modi Stadium) స్డేడియంలో న్యూజిలాండ్ (New Zealand) ను ఓడించి మూడోసారి టీ20 వరల్డ్ కప్ టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ విజయానంతరం కుల్దీప్ తన చిన్ననాటి స్నేహితురాలు వంశికాతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

కుల్దీప్ పెళ్లి ఎప్పుడు జరగనుంది?

మీడియా నివేదికల ప్రకారం, కుల్దీప్ యాదవ్, వంశికా వివాహం మార్చి 14న ఉత్తరాఖండ్‌లోని అందమైన పర్యాటక ప్రాంతం ముస్సోరి (Mussoorie) లోని ఒక రిసార్ట్‌లో జరుగుతుంది. పెళ్లి వేడుకల తర్వాత మార్చి 17న లక్నో (Lucknow) లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి క్రీడా, రాజకీయ రంగాల ప్రముఖులు హాజరవుతారని సమాచారం. పెళ్లి ముందు జరిగే హల్దీ, మెహందీ వంటి కార్యక్రమాలు మార్చి 13 నుంచే ప్రారంభమవుతాయని కుల్దీప్‌కు దీర్ఘకాల కోచ్ కపిల్ దేవ్ పాండే తెలిపారు.

కుల్దీప్ వధువు వంశికా ఎవరు?

కుల్దీప్, వంశికా ఇద్దరూ కాన్పూర్ (Kanpur) కు చెందినవారు. వీరి ఇళ్లు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. చిన్నప్పటి నుంచే పరిచయం ఉన్న ఈ జంట గత సంవత్సరం లక్నోలో జరిగిన కార్యక్రమంలో నిశ్చితార్థం చేసుకున్నారు. వంశికా ప్రస్తుతం ఎల్ఐసీ (Life Insurance Corporation of India) లో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. క్రికెట్ ప్రపంచానికి దూరంగా ఉండే ఆమె ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చర్చకు వస్తోంది.

ఇవి కూడా చదవండి

వరల్డ్ కప్‌లో కుల్దీప్ ప్రదర్శన..

టీ20 వరల్డ్ కప్ 2026లో కుల్దీప్ యాదవ్ జట్టులో భాగమైనప్పటికీ అతనికి ఎక్కువ అవకాశాలు లభించలేదు. మొత్తం టోర్నమెంట్‌లో అతను ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. అది పాకిస్తాన్‌పై జరిగిన గ్రూప్ మ్యాచ్. ఆ మ్యాచ్‌లో అతను 4 ఓవర్లలో కేవలం 14 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసి మంచి ప్రదర్శన చేశాడు. టోర్నమెంట్‌లో భారత బౌలింగ్ దళాన్ని ప్రధానంగా జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah), అక్షర్ పటేల్ (Axar Patel) నడిపించారు.

ప్రముఖ అతిథులు హాజరయ్యే అవకాశం..?

కుల్దీప్ యాదవ్ పెళ్లి వేడుక స్టార్ స్టడెడ్ ఈవెంట్‌గా మారే అవకాశం ఉంది. ఇటీవల కుల్దీప్ తండ్రి రామ్ సింగ్ యాదవ్ యోగీ ఆదిత్యానాథ్ (Yogi Adityanath) ను కలిసి పెళ్లికి వ్యక్తిగతంగా ఆహ్వానించారు. అలాగే బీసీసీఐ (Board of Control for Cricket in India) అధికారులు, ప్రస్తుత ఆటగాళ్లు, మాజీ క్రికెటర్లు కూడా హాజరవుతారని సమాచారం.

వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఆనందంలో ఉన్న టీమిండియా అభిమానులకు ఇప్పుడు కుల్దీప్ యాదవ్ పెళ్లి మరో సంతోషకరమైన వార్తగా మారింది. క్రికెట్ విజయంతో పాటు వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించబోతున్న ఈ స్టార్ స్పిన్నర్‌కు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us