బిగ్ షాక్.. రిహాబ్‌కు ఏకంగా 32 మంది భారత ఆటగాళ్లు.. సీఓఈ నివేదికలో సంచలన విషయాలు..!
Team India Injury Crisis: టీమిండియా ఎంత బలమైన జట్టైనా.. కీలక ఆటగాళ్లు అందుబాటులో లేకపోతే వ్యూహాలన్నీ తలకిందులే! ఇప్పుడు భారత క్రికెట్‌లో అదే సమస్య తీవ్రంగా కనిపిస్తోంది. ఏడాది వ్యవధిలో ఏకంగా 32 మంది టాప్ క్రికెటర్లు గాయాల నుంచి కోలుకునేందుకు రిహాబిలిటేషన్ చేయించుకున్నట్టు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నివేదిక వెల్లడించింది.

Team India Injury Crisis: భారత క్రికెట్‌లో ఆటగాళ్ల గాయాలు ఇప్పుడు టీమ్ మేనేజ్‌మెంట్‌కు పెద్ద సవాలుగా మారుతున్నాయి. కీలక సిరీస్‌ల సమయంలో స్టార్ ప్లేయర్లు అందుబాటులో లేకపోవడం జట్టు కాంబినేషన్‌పై నేరుగా ప్రభావం చూపుతోంది. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) వార్షిక నివేదిక ప్రకారం.. 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి మధ్య భారత పురుషుల క్రికెట్‌కు చెందిన 32 మంది టాప్ ఆటగాళ్లు గాయాల నుంచి కోలుకునేందుకు రిహాబిలిటేషన్ చేయించుకున్నారు.
వీరిలో 20 మంది సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్లు ఉండగా, 12 మంది ఇండియా-ఏ లేదా టార్గెటెడ్ కేటగిరీ ఆటగాళ్లు ఉన్నారు. ఇది కేవలం సంఖ్య కాదు. భారత క్రికెట్‌లో ఇంజ్యూరీ మేనేజ్‌మెంట్ ఎంత కీలకంగా మారిందో చూపించే గణాంకాలు.
ఐపీఎల్ తర్వాత కూడా గాయాల పరంపర..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 ముగిసిన తర్వాత కూడా గాయాల సమస్య కొనసాగినట్టు నివేదికలో పేర్కొన్నారు. దాదాపు ప్రతి సిరీస్‌లో కనీసం ఇద్దరు ఆటగాళ్లు గాయాల బారిన పడిన పరిస్థితి కనిపించింది. భారత్ టెస్టు, వన్డే జట్ల కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill), ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) కూడా గత ఏడాది ఆటగాళ్ల ఫిట్‌నెస్ సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు.
సాఫ్ట్ టిష్యూ ఇంజరీలే పెద్ద సమస్య..!
సీఓఈ నివేదికలో మరో కీలక అంశం సాఫ్ట్ టిష్యూ ఇంజరీలే కావడం గమనార్హం. 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి మధ్య మొత్తం 68 మంది క్రికెటర్ల గాయాలను బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు చెందిన స్పోర్ట్స్ సైన్స్ మెడిషన్ (SSM) విభాగం నిర్వహించింది. ఇందులో మహిళా క్రికెటర్లు కూడా ఉన్నారు. ఈ కేసుల్లో సాఫ్ట్ టిష్యూ గాయాలు ఎక్కువగా కనిపించాయి.
ఎక్కువమంది చదివినది: ఇక లాభం లేదురా బుడ్డోడా.. టీమిండియాలో చోటు కోసం జైస్వాల్ కీలక నిర్ణయం..!
మసిల్స్, వాటికి సంబంధించిన టిష్యూ గాయాల వల్ల ఆటగాళ్ల పరుగులు, బౌలింగ్, ఫీల్డింగ్‌లో వేగవంతమైన కదలికలు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది.
పంత్, రోహిత్ కూడా రిహాబ్..
ఆ నివేదికలో ఇంపాక్ట్ ఇంజరీకి ఉదాహరణగా రిషభ్ పంత్ (Rishabh Pant) పేరును ప్రస్తావించారు. 2025 జులైలో మాంచెస్టర్ టెస్టు సందర్భంగా కాలికి ఫ్రాక్చర్ కావడంతో పంత్ చికిత్స తీసుకున్నాడు. ఇక మరో కీలక విషయం రోహిత్ శర్మ (Rohit Sharma)కు సంబంధించినది. ఈ కాలంలో రోహిత్ కూడా రిహాబిలిటేషన్ చేసినట్టు నివేదిక వెల్లడించింది. రిపోర్టు ప్రకారం.. IPL 2026 తర్వాత హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా రోహిత్ సీఓఈకి వెళ్లాడు. ఆ సమయంలో రోహిత్ అక్కడ చికిత్స పొందుతున్న విషయంపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేయలేదు.
బుమ్రా, హార్దిక్, హర్షిత్.. లిస్టు పెద్దే..!
గాయాలతో ఇబ్బంది పడిన ఆటగాళ్ల జాబితాలో పలువురు కీలక పేర్లు ఉన్నాయి. జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah), వాషింగ్టన్ సుందర్ (Washington Sundar), నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy), హర్షిత్ రాణా (Harshit Rana), హార్దిక్ పాండ్యా (Hardik Pandya), ప్రసిద్ధ్ కృష్ణ (Prasidh Krishna) వంటి ఆటగాళ్ల గాయాల కేసులు పదేపదే తెరపైకి వచ్చాయి.
ముఖ్యంగా హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి గత 18 నెలల్లో కనీసం నాలుగు నెలల చొప్పున సీఓఈలో గడిపినట్టు నివేదిక పేర్కొంది. 2026 సెప్టెంబర్ 30 వరకు ఉన్న జాబితాలో విరాట్ కోహ్లీ (Virat Kohli), వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy), ప్రిన్స్ యాదవ్ (Prince Yadav), హర్ష్ దూబే (Harsh Dubey) వంటి ఇతర ఆటగాళ్ల పేర్లు కూడా ఉన్నాయి.
వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌పైనా ప్రశ్నలు..
భారత జట్టు స్ట్రెంథ్ అండ్ కండీషనింగ్ కోచ్ అడ్రియన్ లే రూక్స్ (Adrian Le Roux) 2025 జూన్‌లో ఆటగాళ్ల వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ విధానంలో కొన్ని మార్పులు సూచించినట్టు నివేదిక పేర్కొంది. అయితే సీఓఈ తన ప్రస్తుత విధానానికి భిన్నంగా వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదన్న అంశం కూడా నివేదికలో ఉంది. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్ల విషయంలో ఈ సమన్వయం అత్యంత కీలకం. మ్యాచ్‌లు, ప్రాక్టీస్ సెషన్లు, ప్రయాణాలు, రికవరీ మధ్య సరైన సమతుల్యత లేకపోతే గాయాల ప్రమాదం పెరిగే అవకాశం ఉంటుంది.
ఎక్కువమంది చదివినది: నెట్స్‌లో బుడ్డోడి ఊచకోత.. తుది జట్టులోకి చోటు కోసం గట్టిగానే ఇచ్చిపడేశాడుగా..?
భారీగా పెరిగిన బడ్జెట్..
ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై దృష్టి పెంచేందుకు బీసీసీఐ CoE బడ్జెట్‌ను పెంచింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి CoE అంచనా బడ్జెట్ రూ.127 కోట్లు. గత ఆర్థిక సంవత్సరంలో వాస్తవ ఖర్చు సుమారు రూ.92 కోట్లు. అంటే దాదాపు రూ.35 కోట్ల పెరుగుదల కనిపిస్తోంది. ఈ బడ్జెట్‌లో పరిపాలనా ఖర్చులు, ట్రైనింగ్ కోర్సులు, మ్యాచ్‌లకు సంబంధించిన వ్యయాలు ఉన్నాయి. అయితే పెరిగిన నిధులు ఆటగాళ్ల గాయాల నివారణ, ఫిట్‌నెస్‌పై ఎంత ప్రభావం చూపుతాయన్నది రాబోయే రోజుల్లో కీలకంగా మారనుంది.
ఇంతకుముందూ ఇలాంటి సమస్యే..!
భారత క్రికెట్‌లో సాఫ్ట్ టిష్యూ ఇంజరీల సమస్య కొత్తది కాదు. 2021-22లో కోవిడ్ సమయంలో బయో-బబుల్ వ్యవస్థ తర్వాత కూడా పలువురు ఆటగాళ్లు గాయాల బారిన పడ్డారు. అయితే రెండు, మూడు నెలల్లో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. 2017లోనూ సుమారు మూడు నెలల పాటు గాయాల సమస్య కనిపించింది. ఆ సమయంలో స్ట్రెంథ్ అండ్ కండీషనింగ్ కోచ్ శంకర్ బసు ఫిట్‌నెస్ ప్రోగ్రామ్‌లో కీలక మార్పులు చేశారు.
టీమిండియాకు బెంచ్ స్ట్రెంత్ ఎంత ఉన్నా.. కీలక ఆటగాళ్లు పదేపదే గాయపడితే దాని ప్రభావం జట్టు కాంబినేషన్‌పై తప్పకుండా పడుతుంది. 32 మంది టాప్ ఆటగాళ్లు రిహాబ్‌కు వెళ్లిన గణాంకం భారత క్రికెట్‌కు ఒక ముఖ్యమైన హెచ్చరికలా కనిపిస్తోంది. పెరిగిన సీఓఈ బడ్జెట్, కొత్త ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లు మంచి అడుగులే అయినా.. వాటి అసలు ఫలితం గాయాల సంఖ్య తగ్గినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఇకపై టీమిండియా ఫిట్‌నెస్ వ్యూహంలో ప్రివెన్షన్‌కే మొదటి ప్రాధాన్యం ఇవ్వాల్సిన సమయం వచ్చింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




