Suryakumar Yadav : క్రికెట్ ప్రపంచంలో సూర్యకుమార్ యాదవ్ లేటెస్ట్ పోస్ట్ కలకలం.. అసలు ఏం జరిగిందంటే?

Suryakumar Yadav : సూర్యకుమార్ యాదవ్ చేసిన తాజా సోషల్ మీడియా పోస్ట్ వైరల్‌గా మారింది. టీమిండియాకు తన మద్దతు ప్రకటించిన సూర్య, వైభవ్ సూర్యవంశీని అభినందిస్తూ, తన పేరుతో వైరల్ అవుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు.

Suryakumar Yadav : క్రికెట్ ప్రపంచంలో సూర్యకుమార్ యాదవ్ లేటెస్ట్ పోస్ట్ కలకలం.. అసలు ఏం జరిగిందంటే?
Suryakumar Yadav

Updated on: Jul 07, 2026 | 4:22 PM

Suryakumar Yadav : భారత స్టార్ క్రికెటర్, టీమిండియా మాజీ టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సోషల్ మీడియాలో పెట్టిన ఒక సుదీర్ఘమైన పోస్ట్ ప్రస్తుతం తీవ్ర సంచలనంగా మారింది. గత కొంతకాలంగా సూర్యకుమార్ యాదవ్ భారత జట్టుకు దూరంగా ఉంటున్నారు. టీమిండియా టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి ఆయన్ని తప్పించడంతో పాటు, క్రమంగా జట్టులో కూడా ఆయనకు చోటు దక్కకుండా పోయింది. ఇటీవల ఐర్లాండ్ పర్యటనలో ఆడిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ మెన్ ఇన్ బ్లూ జట్టులో మళ్లీ కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన తాజా పోస్ట్ క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ పోస్ట్‌లో ఆయన జట్టుకు తన మద్దతును తెలియజేయడంతో పాటు పలు కీలక విషయాలను పంచుకున్నారు.

సూర్యకుమార్ యాదవ్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో స్పందిస్తూ.. ప్రస్తుతం ఆడుతున్న భారత జట్టు గురించి ఎంతో సానుకూలంగా మాట్లాడారు. “నేను ప్రస్తుత టీమిండియా జట్టు ప్రదర్శన పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాను, వారికి ఎల్లప్పుడూ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జట్టులోని ఆటగాళ్లందరూ దేశం కోసం తమ అత్యుత్తమ ప్రదర్శన ఇస్తున్నారని నాకు బాగా తెలుసు, నా పూర్తి మద్దతు ఎప్పటికీ మన జట్టుకే ఉంటుంది” అంటూ సూర్య రాసుకొచ్చారు. కెప్టెన్సీ, జట్టులో చోటు కోల్పోయినప్పటికీ, టీమిండియాపై ఆయనకున్న అభిమానం తగ్గలేదని ఈ పోస్ట్ ద్వారా స్పష్టమైంది.

భారత జట్టుకు మద్దతు ఇవ్వడంతో పాటు, సూర్యకుమార్ యాదవ్ తన పోస్ట్‌లో భారత యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. వైభవ్‌ను ఉద్దేశించి సూర్య ఎంతో స్ఫూర్తిదాయకమైన మాటలు రాశారు. “వైభవ్ కోసం నేను ఒక ప్రత్యేకమైన మాట చెప్పాలనుకుంటున్నాను.. నువ్వు ప్రస్తుతం ఎన్నో అంచనాలు, ఎంతో ఉత్సాహంతో కూడిన ఒక గొప్ప క్రికెట్ ప్రయాణం ప్రారంభంలో ఉన్నావు. నీ కెరీర్‌లోని ప్రతి క్షణాన్ని పూర్తిగా ఆస్వాదించు, నీ ఆటతీరుతో మన దేశం గర్వపడేలా చేస్తూనే ఉండు” అంటూ ఆ యువ ఆటగాడిని సూర్య అభినందించారు.

ఈ పోస్ట్‌లో సూర్యకుమార్ యాదవ్ తనపై జరుగుతున్న ఒక తప్పుడు ప్రచారంపై తీవ్రంగా మండిపడ్డారు. అభిమానులకు ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో తన పేరుతో చెలామణి అవుతున్న ఒక ప్రకటన పూర్తిగా అబద్ధమని ఆయన తేల్చి చెప్పారు. “గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో నా పేరుతో ఒక స్టేట్‌మెంట్ విపరీతంగా షేర్ అవుతోందని నా దృష్టికి వచ్చింది, దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను అలాంటి వ్యాఖ్యలు ఎక్కడా చేయలేదని స్పష్టం చేయాలనుకుంటున్నాను. దయచేసి ఇటువంటి ఆధారాలు లేని తప్పుడు సమాచారాన్ని ఎవరూ నమ్మవద్దు, అలాగే వాటిని షేర్ చేయవద్దు” అని సూర్య కోరారు. అయితే ఆ తప్పుడు ప్రకటన దేనికి సంబంధించింది అనే విషయాన్ని మాత్రం ఆయన పూర్తిగా వెల్లడించలేదు. తన పేరును తప్పుగా వాడుతూ వైరల్ చేస్తున్న మాటల కంటే, భారత క్రికెట్, తన తోటి ఆటగాళ్లపై తనకున్న గౌరవం, సపోర్ట్ ఎల్లప్పుడూ చాలా గొప్పగా ఉంటాయని సూర్య స్పష్టం చేశారు.

భారత క్రికెట్ జట్టులో మిస్టర్ 360 డిగ్రీల ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ కెరీర్ రికార్డులు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఆయన ఇప్పటివరకు టీమిండియా తరఫున మొత్తంగా 1 టెస్ట్ మ్యాచ్, 37 వన్డేలు, 113 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు. తాను ఆడిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఆయన 8 పరుగులు చేశారు. వన్డే ఫార్మాట్‌లో 35 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసిన సూర్య 773 పరుగులు సాధించారు. ఇక సూర్యకు అత్యంత ఇష్టమైన టీ20 ఇంటర్నేషనల్స్ విషయానికి వస్తే, 107 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసిన ఆయన ఏకంగా 3272 పరుగులు స్కోర్ చేసి సంచలన రికార్డులు సృష్టించారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us