Video: W,W,W.. 3 బంతుల్లో 3 వికెట్లు పడినా హ్యాట్రిక్ దక్కలే.. క్రికెట్ చరిత్రలోనే విచిత్రమైన మ్యాచ్..!

Luke Wood Hattrick Drama: వరుస ఓటములతో కుంగిపోయిన సావుదర్న్ బ్రేవ్స్‌కు ఈ గెలుపు కొత్త ఊపిరి పోసింది. నాటకీయ పరిణామాల మధ్య సాధించిన ఈ విజయం ద హ్యాండ్రెడ్ లీగ్ చరిత్రలోనే చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. కాగా, వరుసగా 3 బంతుల్లో 3 వికెట్లు నేలకూలినా, బౌలర్ ఖాతాలో హ్యాట్రిక్ నమోదు కాకపోవడం ఈ మ్యాచ్‌లోనే అతిపెద్ద విచిత్రం.

Video: W,W,W.. 3 బంతుల్లో 3 వికెట్లు పడినా హ్యాట్రిక్ దక్కలే.. క్రికెట్ చరిత్రలోనే విచిత్రమైన మ్యాచ్..!
Luke Wood Hattrick Drama

Updated on: Jul 31, 2026 | 5:53 PM

Luke Wood Hattrick Drama: ద హ్యాండ్రెడ్ లీగ్‌లో ఊహించని సీన్ చోటుచేసుకుంది. కేవలం 128 పరుగుల చిన్న లక్ష్యాన్ని కాపాడుకుంటూ సావుదర్న్ బ్రేవ్స్ జట్టు సృష్టించిన అద్భుతం క్రికెట్ అభిమానులను అవాక్కయ్యేలా చేసింది. వరుసగా 3 బంతుల్లో 3 వికెట్లు నేలకూలినా, బౌలర్ ఖాతాలో హ్యాట్రిక్ నమోదు కాకపోవడం ఈ మ్యాచ్‌లోనే అతిపెద్ద విచిత్రం.

ద హ్యాండ్రెడ్ లీగ్‌లో నరాలు తెగే ఉత్కంఠ..

క్రికెట్ మైదానంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ద హ్యాండ్రెడ్ 2026 టోర్నీలో సావుదర్న్ బ్రేవ్స్, బర్మింగ్‌హామ్ ఫినిక్స్ జట్ల మధ్య జరిగిన పోరు ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. మ్యాచ్ ఆఖరి క్షణాల్లో చోటుచేసుకున్న పరిణామాలు ప్రేక్షకులను సీట్ల అంచులపై కూర్చోబెట్టాయి. ఆఖరి ఓవర్‌లో బౌలర్ చూపించిన ప్రతిభ జట్టుకు విజయాన్ని అందించడమే కాకుండా, క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే ఒక అరుదైన ఘట్టానికి వేదికైంది.

ల్యూక్ వుడ్ వేసిన ఆ విచిత్ర ఓవర్..

సావుదర్న్ బ్రేవ్స్ స్టార్ బౌలర్ ల్యూక్ వుడ్ ఇన్నింగ్స్ ఆఖరి ఐదు బంతులను విసిరేందుకు సిద్ధమయ్యాడు. ఇన్నింగ్స్ 96వ బంతికి బెన్ ద్వార్షుయిస్‌ను అవుట్ చేసిన వుడ్, తర్వాతి 97వ బంతికి స్కాట్ కర్రీని పెవిలియన్ పంపాడు. దీంతో వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు పడ్డాయి. ఇక 98వ బంతికి హ్యాట్రిక్ సాధించే సువర్ణావకాశం ల్యూక్ వుడ్‌కు దక్కింది.

హ్యాట్రిక్ ఎందుకు దక్కలేదంటే?

హ్యాట్రిక్ బంతిని వుడ్ ఎంతో చాకచక్యంగా వేశాడు. ఆ బంతిని ఎదుర్కొన్న సాకిబ్ మహమూద్ పరుగు తీసేందుకు ప్రయత్నించాడు. అయితే షార్ట్ థర్డ్ మ్యాన్ దిశలో ఉన్న ఆదిల్ రషీద్ మెరుపు వేగంతో స్పందించి, నేరుగా వికెట్లను గండంగా కొట్టాడు. దాంతో బ్యాటర్ రనౌట్‌గా వెనుతిరిగాడు. వరుసగా మూడో బంతికి వికెట్ పడినప్పటికీ, అది రనౌట్ కావడంతో నిబంధనల ప్రకారం బౌలర్ వ్యక్తిగత ఖాతాలోకి హ్యాట్రిక్ చేరలేదు. క్రికెట్ భాషలో దీనిని ‘టీమ్ హ్యాట్రిక్’గా పరిగణించారు.

చిన్న లక్ష్యం.. కొండంత పోరాటం..

తొలుత బ్యాటింగ్ చేసిన సావుదర్న్ బ్రేవ్స్ నిర్ణీత 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 128 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ 34 పరుగులతో రాణించాడు. ప్రత్యర్థి బౌలర్ రెహాన్ అహ్మద్ 3 వికెట్లతో దెబ్బకొట్టాడు. అనంతరం 129 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బర్మింగ్‌హామ్ ఫినిక్స్ ఒకానొక దశలో 47 బంతుల్లో 52/1 స్కోరుతో ఎంతో బలంగా కనిపించింది.

అక్కడి నుంచి సావుదర్న్ బ్రేవ్స్ బౌలర్లు కంబ్యాక్ ఇచ్చిన తీరు అద్భుతం. మార్కస్ స్టోయినిస్ బ్యాటింగ్‌లోనే కాకుండా బౌలింగ్‌లోనూ మెరిసి 10 బంతుల్లో 16 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. జోఫ్రా ఆర్చర్ 20 బంతుల్లో 21 పరుగులే ఇచ్చి ఒక వికెట్ సాధించాడు. ల్యూక్ వుడ్ మొత్తం 3 వికెట్లతో చెలరేగడంతో బర్మింగ్‌హామ్ జట్టు 116 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా 12 పరుగుల తేడాతో సావుదర్న్ బ్రేవ్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. వరుసగా మూడు ఓటముల తర్వాత ఈ జట్టు నమోదు చేసిన తొలి విజయం ఇది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us