AITA Elections: ఎన్నికల బరిలోకి సానియా మీర్జా, మహేశ్ భూపతి.. లియాండర్ పేస్‌కు భారీ షాక్

AITA Elections: భారత టెన్నిస్ దిగ్గజాలు సానియా మీర్జా, మహేశ్ భూపతి AITA SOM ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేశారు. నవంబర్ 7న జరగనున్న ఈ ఎన్నికల్లో మరో ఆరుగురు మాజీ ఆటగాళ్లు కూడా పోటీ చేస్తున్నారు. లియాండర్ పేస్ మాత్రం నామినేషన్ వేయలేదు. అవసరమైన అర్హతలు లేకపోవడంతో ప్రస్తుత నిబంధనల ప్రకారం ఆయన అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం కోల్పోయారు.

AITA Elections: ఎన్నికల బరిలోకి సానియా మీర్జా, మహేశ్ భూపతి.. లియాండర్ పేస్‌కు భారీ షాక్
Sania Mirza

Updated on: Oct 26, 2026 | 12:40 PM

AITA Elections: భారత టెన్నిస్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టెన్నిస్ కోర్టులో ఎన్నో విజయాలు సాధించిన దిగ్గజాలు ఇప్పుడు క్రీడా పరిపాలనలోనూ తమదైన ముద్ర వేయడానికి సిద్ధమవుతున్నారు. మాజీ ప్రపంచ నంబర్ వన్‌లు సానియా మీర్జా, మహేశ్ భూపతి అఖిల భారత టెన్నిస్ సంఘం (AITA) ఎన్నికల ప్రక్రియలోకి అడుగుపెట్టారు. స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ అవుట్‌స్టాండింగ్ మెరిట్ (SOM) ప్రతినిధుల ఎన్నికల కోసం వీరిద్దరూ నామినేషన్లు దాఖలు చేశారు. అయితే, AITA అధ్యక్ష పదవికి పోటీ చేయాలని భావించిన మరో టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ పేరు నామినేషన్ల జాబితాలో లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. SOM ఎన్నికలు నవంబర్ 7న జరగనున్నాయి.

పేస్ అధ్యక్ష ఆశలకు నిబంధనల అడ్డంకి?

లియాండర్ పేస్ అధ్యక్ష అభ్యర్థిత్వానికి బెంగాల్ టెన్నిస్ సంఘం మద్దతు ప్రకటించింది. అయితే, AITA అధ్యక్ష పదవికి పోటీ చేయాలంటే సంఘం రాజ్యాంగంలో పేర్కొన్న అర్హతలను పూర్తి చేయాలి. సవరించిన నిబంధనల ప్రకారం, SOM జనరల్ బాడీ ప్రతినిధిగా ఎన్నిక కావడం లేదా AITA కార్యవర్గంలో కనీసం ఒక పూర్తి పదవీకాలం పనిచేసి ఉండటం లేదా రాష్ట్ర అనుబంధ సంఘంలో అధ్యక్షుడు, కార్యదర్శి జనరల్, కోశాధికారి వంటి పదవుల్లో పనిచేసి ఉండటం వంటి అర్హతల్లో ఒకటి అవసరం. పేస్ రాష్ట్ర సంఘంలో అవసరమైన పదవీకాలాన్ని పూర్తి చేయకపోవడంతో SOM ఎన్నికల ద్వారా అర్హత సాధించాల్సి ఉంది. కానీ ఆయన నామినేషన్ దాఖలు చేయలేదు. దీంతో ప్రస్తుత నిబంధనల ప్రకారం నవంబర్ 27న జరిగే AITA ఎన్నికల్లో బెంగాల్ ప్రతినిధిగా పాల్గొనే అవకాశం ఉన్నా, అధ్యక్ష పదవికి పోటీ చేయలేరు.

సానియా, భూపతితో పాటు మరో ఆరుగురు

SOM ఎన్నికల కోసం సానియా, భూపతితో పాటు మరో ఆరుగురు మాజీ ఆటగాళ్లు నామినేషన్లు సమర్పించారు. వీరిలో అంకితా భాంబ్రి, ప్రస్తుత డేవిస్ కప్ కోచ్ ఆశుతోష్ సింగ్, గౌరవ్ నటేకర్, జానకి కృష్ణమూర్తి, షాలిని ఠాకూర్ చావ్లా, ప్రస్తుత బిల్లీ జీన్ కింగ్ కప్ కెప్టెన్ విశాల్ ఉప్పల్ ఉన్నారు. మొత్తం ఎనిమిది మంది మాజీ ఆటగాళ్లు ఈ ఎన్నికల బరిలో నిలిచారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రతినిధుల కోసం భూపతి, సానియా, అంకితా, జానకి, విశాల్ ఉప్పల్ నామినేషన్లు దాఖలు చేశారు.

AITAలో ఆటగాళ్లకు మరింత ప్రాధాన్యం

క్రీడా సమాఖ్యల నిర్వహణలో అంతర్జాతీయ స్థాయిలో ఆడిన ఆటగాళ్లకు మరింత ప్రాతినిధ్యం కల్పించాలనే లక్ష్యంతో SOM వ్యవస్థను తీసుకొచ్చారు. సవరించిన AITA రాజ్యాంగం ప్రకారం జనరల్ బాడీలో నలుగురు SOM ప్రతినిధులకు చోటు ఉంటుంది. ఇందులో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉంటారు. అలాగే 15 మంది సభ్యులతో కూడిన ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఒక పురుషుడు, ఒక మహిళ చొప్పున ఇద్దరు SOM ప్రతినిధులను ఎన్నుకుంటారు. ఈ మార్పులతో క్రీడాకారులు కేవలం మైదానంలోనే కాకుండా, క్రీడల అభివృద్ధికి సంబంధించిన నిర్ణయాల్లోనూ భాగస్వాములు కావచ్చు.

ప్రస్తుతం పరిపాలనపై వారి గురి

మహేశ్ భూపతి డబుల్స్‌లో ప్రపంచ నంబర్ వన్‌గా నిలిచి పలు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధించాడు. భారత టెన్నిస్‌కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన ఆటగాళ్లలో ఆయన ఒకరు. సానియా మీర్జా కూడా డబుల్స్‌లో ప్రపంచ నంబర్ వన్‌గా నిలిచింది. మహిళల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో కలిపి ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలుచుకుంది. ఇప్పుడు వీరిద్దరూ టెన్నిస్ పరిపాలనలోకి రావాలని ప్రయత్నిస్తుండగా, పేస్ నామినేషన్ వేయకపోవడం అధ్యక్ష ఎన్నికల సమీకరణాల్లో కీలక పరిణామంగా నిలిచింది. SOM ఎన్నికల తర్వాత నవంబర్ 27న జరగనున్న AITA ఎన్నికలపై అందరి దృష్టి నెలకొంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us