
Nepal vs UAE Clash: మలేషియా వేదికగా ముగిసిన ఏసీసీ ప్రీమియర్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో నేపాల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆటగాళ్లు మైదానంలోనే పరస్పరం వాగ్వాదానికి దిగారు. 314 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో యూఏఈ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఈ గొడవ జరిగింది. ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం ముదిరి తోపులాటకు దారితీసింది. ఆరో ఓవర్ ప్రారంభించేందుకు లెగ్ స్పిన్నర్ సందీప్ లమిచానే (Sandeep Lamichhane) సిద్ధమవుతున్న వేళ, వికెట్ కీపర్ ఆసిఫ్ షేక్ (Aasif Sheikh) బ్యాటర్ తనీష్ సూరి (Tanish Suri) కి ఏదో చెప్పడంతో వివాదం రాజుకుంది. దీంతో సహనం కోల్పోయిన సూరి ఘాటుగా స్పందించాడు. ఫీల్డర్లు కూడా అక్కడికి చేరుకోవడంతో వాతావరణం మరింత వేడెక్కింది.
ఈ తీవ్ర ఉద్రిక్తతను గమనించిన ఆన్-ఫీల్డ్ అంపైర్లు విశ్వనాథన్ కాళిదాస్ (Viswanadan Kalidas), తబారక్ దార్ (Tabarak Dar) వెంటనే రంగంలోకి దిగారు. ఆటగాళ్లను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆ తరువాత నేపాల్ కెప్టెన్ లమిచానే బ్యాటర్‌ను కౌగిలించుకుని వివాదానికి ముగింపు పలకడంతో మ్యాచ్ యథావిధిగా కొనసాగింది.
What’s gone on here? Tanish Suri is one of the most mild mannered kids there is. Never seen him get remotely this riled pic.twitter.com/CgTM5jQrYT
— Paul Radley (@PaulRadley) September 12, 2026
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ నిర్ణీత 50 ఓవర్లలో 313 పరుగులు చేసింది. ఓపెనర్ ఆసిఫ్ షేక్ 106 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 102 పరుగులు సాధించి అద్భుత శతకంతో మెరిశాడు. ఐదో స్థానంలో వచ్చిన గుల్షన్ ఝా (Gulsan Jha) 38 బంతుల్లో 52 పరుగులు బాదాడు. యూఏఈ బౌలర్ ఇబ్రార్ అహ్మద్ (Ibrar Ahmed) కీలక వికెట్లు తీసి ప్రత్యర్థి స్కోరును కట్టడి చేసే ప్రయత్నం చేశాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ 49.1 ఓవర్లలో 269 పరుగులకే ఆలౌట్ కావడంతో నేపాల్ ఘన విజయం సాధించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..