MS Dhoni: Gen Z, Gen Alphaకు ధోనీ సలహా.. 30 ఏళ్లు వచ్చాక బాధపడొద్దంటే ఇప్పుడే ఇలా చేయాలట

MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ Gen Z, Gen Alpha యువతకు చాలా విలువైన సూచన చేశారు. రోజంతా కూర్చొని పనిచేయడం, శారీరక శ్రమ తగ్గడం, ఫాస్ట్‌ఫుడ్ అలవాట్లు భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చని సూచించాడు. జావేద్ అక్తర్‌తో జరిగిన కార్యక్రమంలో ధోనీ ఈ విషయాలను వెల్లడించారు.

MS Dhoni: Gen Z, Gen Alphaకు ధోనీ సలహా.. 30 ఏళ్లు వచ్చాక బాధపడొద్దంటే ఇప్పుడే ఇలా చేయాలట
Ms Dhoni (2)

Updated on: Oct 26, 2026 | 10:00 AM

MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ యువతకు ముఖ్యమైన మెసేజ్ ఇచ్చాడు. Gen Z, Gen Alpha తరాలు తమ ఆరోగ్యంపై ఇప్పటి నుంచే శ్రద్ధ పెట్టాలని సూచించాడు. రచయిత జావేద్ అక్తర్‌తో కలిసి పాల్గొన్న ఓ కార్యక్రమంలో ఆధునిక జీవనశైలి, శారీరక శ్రమ తగ్గడం, ఆహారపు అలవాట్లపై ధోనీ మాట్లాడాడు. రోజువారీ జీవితంలో కదలికలు తగ్గిపోతే భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని వివరించాడు. ఈ కార్యక్రమంలో నేటి యువత ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు, భావోద్వేగ సమస్యలు, వారికి పెద్దలు ఇవ్వాల్సిన సలహాలపై చర్చ జరిగింది. జావేద్ అక్తర్ మాట్లాడుతూ ప్రస్తుత యువతలో కొన్ని విషయాల్లో గత తరాల కంటే మెరుగైన విలువలు కనిపిస్తున్నాయని అభిప్రాయపడ్డాడు. తమ తరం తమ నమ్మకాలు, సూత్రాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేదని చెప్పాడు. యువత దగ్గర నుంచి పెద్దలు కూడా నేర్చుకోవాలని, తమకే అన్నీ తెలుసనే ధోరణి వద్దని సూచించాడు. ధోనీ మాత్రం యువత శారీరక ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ప్రధానంగా ప్రస్తావించాడు.

రోజంతా కూర్చోవడం ఆరోగ్యానికి మంచిది కాదు

గతంలో చాలామంది తమ రోజువారీ పనుల్లో భాగంగా ఎక్కువగా నడిచేవారని ధోనీ గుర్తుచేశాడు. ఇప్పుడు ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్లేందుకు వాహనాలు, ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉండటంతో శారీరక కదలికలు తగ్గుతున్నాయని వివరించాడు. ఆఫీసుల్లో గంటల తరబడి కూర్చొని పనిచేయడం, తిరిగి వాహనాల్లో ఇంటికి చేరుకోవడం సాధారణమైందని పేర్కొన్నాడు. దీనికి తోడు ఫాస్ట్‌ఫుడ్, చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలు, నూనెలో వేయించిన ఆహారం తీసుకుంటూ వ్యాయామం చేయకపోతే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడొచ్చని హెచ్చరించాడు.

రోజూ ఆటలు ఆడండి.. వ్యాయామానికి సమయం కేటాయించండి

యువత చిన్నప్పటి నుంచే ఆటలు, వ్యాయామాన్ని రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని ధోనీ సూచనలోని ముఖ్య ఉద్దేశం. శారీరక శ్రమ లేకపోయినా వెంటనే సమస్యలు కనిపించకపోవచ్చు. కానీ వయసు పెరిగే కొద్దీ దాని ప్రభావం బయటపడే అవకాశం ఉందని ఆయన వివరించాడు. అందుకే ఆరోగ్య సమస్యలు వచ్చిన తర్వాత మార్పులు చేసుకోవడం కంటే ముందుగానే మంచి అలవాట్లు పెంచుకోవడం అవసరం. నడక, సైక్లింగ్, ఆటలు లేదా తమకు సరిపోయే వ్యాయామాన్ని ఎంచుకోవచ్చు.

రోజుకు ఎంత వ్యాయామం అవసరం?

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మార్గదర్శకాల ప్రకారం.. 5–17 ఏళ్ల పిల్లలు, టీనేజర్లు రోజుకు సగటున కనీసం 60 నిమిషాల శారీరక చురుకుదనం కలిగి ఉండాలి. 18–64 ఏళ్ల పెద్దలు వారానికి కనీసం 150–300 నిమిషాల మోస్తరు తీవ్రత గల ఏరోబిక్ వ్యాయామం చేయాలి. వారంలో కనీసం రెండు రోజులు కండరాల బలాన్ని పెంచే వ్యాయామాలు కూడా ఉపయోగకరంగా ఉంటాయి. రోజంతా కూర్చునే సమయాన్ని తగ్గించి, ఆహారంలో సమతుల్యత పాటిస్తూ, క్రమం తప్పకుండా శారీరకంగా చురుకుగా ఉండటం దీర్ఘకాల ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us