
Mohammed Shami: టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీకి 2027 వన్డే వరల్డ్ కప్‌లో చోటు దక్కడం చాలా కష్టంగా కనిపిస్తోంది. కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని టీమిండియా ప్రణాళికల్లో ప్రస్తుతం ఆయన లేడు. అయినప్పటికీ వన్డే వరల్డ్ కప్‌లో షమీ నమోదు చేసిన రికార్డులు మాత్రం ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. ప్రపంచకప్‌లో భారతదేశం తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా షమీ రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది.
వరల్డ్ కప్‌లో షమీ గణాంకాలు
మహమ్మద్ షమీ భారత్ తరఫున 2015, 2019, 2023 వన్డే ప్రపంచకప్‌లలో ప్రాతినిధ్యం వహించారు. ఈ మూడు టోర్నమెంట్లలో కలిసి ఆయన కేవలం 18 మ్యాచ్‌ల్లోనే ఏకంగా 55 వికెట్లు పడగొట్టారు. అత్యంత అద్భుతమైన విషయం ఏంటంటే.. ఆయన బౌలింగ్ సగటు కేవలం 13.52 గా నమోదైంది. అంటే ప్రతి వికెట్‌కు ఆయన సగటున ఇచ్చింది కేవలం 13.5 పరుగులు మాత్రమే.
2023 వరల్డ్ కప్‌లో విధ్వంసం
2023 వన్డే ప్రపంచకప్ ప్రారంభంలో షమీకి తుది జట్టులో చోటు లభించలేదు. అయితే ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడటంతో షమీకి అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టుకున్న ఆయన వెనక్కి తిరిగి చూడలేదు. కేవలం 7 మ్యాచ్‌ల్లోనే 24 వికెట్లు తీసి ఆ టోర్నమెంట్‌లోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచారు. ముఖ్యంగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఏకంగా 7 వికెట్లు పడగొట్టి కీవీస్ వెన్ను విరిచారు.
జహీర్ ఖాన్, జవగల్ శ్రీనాథ్‌లను అధిగమించిన వేళ
వరల్డ్ కప్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రికార్డు అంతకుముందు దిగ్గజ బౌలర్లు జహీర్ ఖాన్ (44 వికెట్లు), జవగల్ శ్రీనాథ్ (44 వికెట్లు) పేరిట ఉండేది. కానీ షమీ కేవలం 18 మ్యాచ్‌ల్లోనే 55 వికెట్లతో ఈ ఇద్దరు దిగ్గజాలను దాటేసి అగ్రస్థానానికి చేరుకున్నారు. కొత్త బంతితో స్వింగ్ చేయడం, పాత బంతితో రివర్స్ స్వింగ్ రాబట్టడంలో షమీకి ఉన్న నైపుణ్యం పెద్ద మ్యాచ్‌ల్లో భారత్‌కు ఎన్నో విజయాలను అందించింది. భవిష్యత్తులో షమీ జట్టులోకి రీఎంట్రీ ఇస్తారా లేదా అనేది సెలెక్టర్ల చేతుల్లో ఉన్నప్పటికీ ఆయన వరల్డ్ కప్ రికార్డులు మాత్రం ఎల్లప్పుడూ నిలిచిపోతాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..