Test Cricket Records: టెస్టుల్లో సరికొత్త చరిత్ర సృష్టించిన ఆసీస్ స్పీడ్‌స్టర్..కపిల్ దేవ్ రికార్డు సమం

Test Cricket Records: బంగ్లాదేశ్‌తో టెస్టులో మిచెల్ స్టార్క్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. 434 వికెట్లతో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఎడమచేతి బౌలర్‌గా నిలిచాడు. కపిల్ దేవ్ రికార్డును సమం చేసిన స్టార్క్, డేల్ స్టెయిన్ 439 వికెట్ల రికార్డుపై కన్నేశాడు. మరో ఆరు వికెట్లు తీస్తే టెస్టు క్రికెట్ ఆల్‌టైమ్ టాప్-10లోకి చేరనున్నాడు.

Test Cricket Records: టెస్టుల్లో సరికొత్త చరిత్ర సృష్టించిన ఆసీస్ స్పీడ్‌స్టర్..కపిల్ దేవ్ రికార్డు సమం
Mitchell Starc

Updated on: Aug 13, 2026 | 5:46 PM

Test Cricket Records: బంగ్లాదేశ్‌తో డార్విన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ప్రభంజనం సృష్టించాడు. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ 9వ ఓవర్లో షాద్‌మాన్ ఇస్లాంను అవుట్ చేయడం ద్వారా టెస్టుల్లో తన 434వ వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఒక్క వికెట్‌తో శ్రీలంక లెజెండరీ స్పిన్నర్ రంగానా హెరాత్ (433 వికెట్లు) రికార్డును అధిగమించి, టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు పడగొట్టిన లెఫ్ట్ హ్యాండ్ బౌలర్‌గా అగ్రపీఠాన్ని కైవసం చేసుకున్నాడు. లెఫ్ట్ హ్యాండ్ అత్యుత్తమ బౌలర్లలో వాసిమ్ అక్రమ్ (414), డానియల్ వెటోరీ (362), చమిందా వాస్ (355), రవీంద్ర జడేజా (348)ల కంటే స్టార్క్ ఎంతో ముందున్నాడు.

కపిల్ దేవ్ రికార్డు సమం

ఈ చారిత్రాత్మక వికెట్‌తో భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఆల్‌టైమ్ రికార్డును సైతం స్టార్క్ సమం చేశాడు. కపిల్ దేవ్ 131 టెస్టుల్లో 434 వికెట్లు సాధించగా, స్టార్క్ కేవలం 106 టెస్టుల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం. ప్రస్తుతం అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో వీరిద్దరూ సంయుక్తంగా 11వ స్థానంలో ఉన్నారు. స్టార్క్ తదుపరి లక్ష్యం సౌతాఫ్రికా పేస్ సంచలనం డాలే స్టెయిన్ నమోదు చేసిన 439 వికెట్ల రికార్డును అధిగమించడమే. స్టెయిన్‌ను దాటి ఆల్‌టైమ్ టాప్-10 బౌలర్ల జాబితాలోకి చేరడానికి స్టార్క్‌కు మరో 6 వికెట్లు మాత్రమే అవసరం.

బిగ్ టోర్నీల ఘనుడు మిచెల్ స్టార్క్

అక్టోబర్ 2010లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన స్టార్క్, తన భయంకర యార్కర్లు, అద్భుతమైన స్వింగ్‌తో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన బౌలర్‌గా ఎదిగాడు. ఆస్ట్రేలియా సాధించిన ప్రధాన టైటిళ్లలో స్టార్క్ పాత్ర అత్యంత కీలకమైనది. 2015, 2023 వన్డే ప్రపంచకప్‌లు గెలిచిన ఆసీస్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 2015 వరల్డ్ కప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు. వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్.. ఇలా మూడింటినీ ముద్దాడిన అరుదైన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. వన్డేల్లో 130 మ్యాచ్‌ల్లో 247 వికెట్లు పడగొట్టిన స్టార్క్, సెప్టెంబర్ 2025లో టి20 అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us