
Cricket Controversy: క్రికెట్‌లో ఒక్క పరుగు ఎంత కీలకమో మరోసారి నిరూపించే ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళల అండర్-19 టోర్నీలో ఉత్తరాఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఝార్ఖండ్ జట్టు ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. అయితే ఈ ఓటమికి అధికారిక స్కోరర్ చేసిన పొరపాటే కారణమని ఝార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ ఆరోపిస్తోంది. చివరి ఓవర్లో తమ జట్టు ఖాతాలో చేరాల్సిన పరుగు నమోదు చేయలేదని పేర్కొంటూ బీసీసీఐకి ఫిర్యాదు చేసింది. ఈ ఓటమితో ఝార్ఖండ్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించడంతో వివాదం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
ఉత్తరాఖండ్ లక్ష్యం 135 పరుగులు
నాగ్‌పూర్‌లోని అమృత్‌బాయి డాగా కాలేజ్ మైదానంలో అక్టోబర్ 20న ఈ మ్యాచ్ జరిగినట్లు వార్తా కథనాలు వెల్లడించాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ఉత్తరాఖండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. దీంతో ఝార్ఖండ్ ముందు 135 పరుగుల లక్ష్యం నిలిచింది. లక్ష్య ఛేదనలో ఝార్ఖండ్ బ్యాటర్లు చివరి వరకు పోరాడినా, చివరి బంతికి జట్టు 133 పరుగులకే ఆలౌటైంది. అధికారిక స్కోరు ప్రకారం ఉత్తరాఖండ్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. ఈ ఫలితంతో ఝార్ఖండ్ టోర్నీలో ముందుకు వెళ్లే అవకాశాన్ని కోల్పోయింది.
19.4 ఓవర్‌లో ఏం జరిగింది?
ఝార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ ఆరోపణ ప్రకారం.. ఇన్నింగ్స్ 19.4వ ఓవర్‌లో రెండో పరుగు కోసం ప్రయత్నించిన సమయంలో ఝార్ఖండ్ బ్యాటర్ రనౌట్ అయ్యింది. అప్పటికే బ్యాటర్లు మొదటి పరుగు పూర్తి చేసినా, అధికారిక స్కోరర్ దాన్ని జట్టు ఖాతాలో నమోదు చేయలేదని అసోసియేషన్ చెబుతోంది. రనౌట్‌ను మాత్రమే నమోదు చేయడంతో ఆ బంతికి పరుగులు జోడించలేదన్నది ప్రధాన ఆరోపణ. అయితే మైదానంలోని స్కోర్‌బోర్డును నిర్వహిస్తున్న వ్యక్తి మాత్రం ఆ పరుగును స్కోరులో కలిపినట్లు ఝార్ఖండ్ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో మైదానంలో కనిపించిన స్కోరును నమ్మి బ్యాటర్లు తమ ఇన్నింగ్స్ కొనసాగించారని చెబుతున్నాయి.
స్కోరును సరిచేయాలని కోరినా ఫలితం లేదట
మ్యాచ్ ముగిసిన తర్వాత స్కోరులో తేడా ఉన్న విషయాన్ని ఝార్ఖండ్ ఆటగాళ్లు అధికారిక స్కోరర్ దృష్టికి తీసుకెళ్లినట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి. అయితే తమ అభ్యర్థన మేరకు స్కోరును సవరించేందుకు స్కోరర్ అంగీకరించలేదని ఝార్ఖండ్ అసోసియేషన్ ఆరోపించింది. మైదానంలోని స్కోర్‌బోర్డులో ప్రతి బంతి తర్వాత తాజా స్కోరు కనిపించినా, ప్రధాన స్కోరర్ మాత్రం ఒక పరుగు నమోదు చేయడం మర్చిపోయాడని ఝార్ఖండ్ అధికారి ఒకరు వెల్లడించినట్లు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్, అవుట్‌లుక్ కథనాలు తెలిపాయి. అధికారిక లెక్కలకు, మైదానంలోని స్కోర్‌బోర్డుకు మధ్య తేడా రావడం మ్యాచ్ ఫలితంపై సందేహాలు రేకెత్తించింది.
బీసీసీఐ ఏం నిర్ణయం తీసుకుంటుంది?
ఈ ఘటనపై ఝార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ ఇప్పుడు బీసీసీఐకి లేఖ రాసి విచారణ జరపాలని కోరింది. అధికారిక స్కోరులో పరుగు నమోదు కాకపోవడం వల్లే మ్యాచ్ టై అయ్యే అవకాశం కోల్పోయామని అసోసియేషన్ వాదిస్తోంది. అయితే ఈ ఆరోపణలపై బీసీసీఐ తీసుకునే నిర్ణయం ఇంకా వెల్లడికాలేదు. మ్యాచ్ ఫలితాన్ని మార్చుతారా, స్కోరింగ్ విధానంపై విచారణ జరుపుతారా అన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా యువ క్రికెటర్ల భవిష్యత్తును ప్రభావితం చేసే టోర్నీల్లో స్కోరింగ్‌లో కచ్చితత్వం ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..