Ishan Kishan : విమర్శకుల నోళ్లు మూయించిన వికెట్ కీపర్..  వైభవ్ సూర్యవంశీపై ఇషాన్ సంచలన కామెంట్స్

Ishan Kishan : జింబాబ్వేపై 81 రన్స్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్ కిషన్.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇతరుల ప్రదర్శన లేదా బయటి చర్చల గురించి ఆలోచించి బాధపడటం కంటే మన చేతుల్లో ఉన్న పనిపై దృష్టి పెట్టడమే ముఖ్యమని చెప్పాడు.

Ishan Kishan : విమర్శకుల నోళ్లు మూయించిన వికెట్ కీపర్..  వైభవ్ సూర్యవంశీపై ఇషాన్ సంచలన కామెంట్స్
Ishan Kishan

Updated on: Jul 26, 2026 | 7:50 AM

Ishan Kishan : జింబాబ్వేతో జరిగిన రెండో టి20 అంతర్జాతీయ మ్యాచ్‌లో భారత వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ మైండ్‌బ్లోయింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కేవలం 44 బంతుల్లోనే 81 పరుగులు బాది జట్టుకు భారీ స్కోరు అందించడంతో పాటు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకున్నాడు. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ మొదట్లో తీవ్ర కష్టాల్లో పడింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (8), వైభవ్ సూర్యవంశీ (20) త్వరగానే పెవిలియన్ చేరడంతో టీమిండియా 3 ఓవర్లలోనే 29 పరుగులకు 2 వికెట్లు కోల్పోయింది. ఆ క్లిష్ట సమయంలో క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్.. జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడి జట్టు స్కోరును 20 ఓవర్లలో 5 వికెట్లకు 219 పరుగులకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 90 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి సిరీస్‌ను 2-0తో ఖాయం చేసుకుంది.

బయట ఏం జరుగుతుందో నాకు అనవసరం: ఇషాన్

ధనాధన్ ఇన్నింగ్స్ అనంతరం 28 ఏళ్ల ఇషాన్ కిషన్ విలేకరులతో మాట్లాడాడు. అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీల విధ్వంసకర బ్యాటింగ్ గురించి బయట జరుగుతున్న చర్చలపై తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. “మైదానం బయట ఏం జరుగుతుందనే దానిపై నేను అస్సలు దృష్టి పెట్టను. నాకు ఏ విధంగా బ్యాటింగ్ చేయాలో బాగా తెలుసు. అందరికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ క్షణంలో మనం జీవించడం. ఎవరు ఎక్కువ పరుగులు చేస్తున్నారు లేదా ఎవరు ఎక్కువ సిక్సర్లు, ఫోర్లు కొడుతున్నారనే విషయాల గురించి ఆలోచించి బుర్ర పాడుచేసుకోకూడదు” అని ఇషాన్ తేల్చి చెప్పాడు.

సన్నివేశానికి తగ్గట్టు ఆడటమే ముఖ్యం

భారత జట్టు త్వరితగతిన వికెట్లు కోల్పోయిన వేళ ఇషాన్ ఎంతో నిలకడగా, తెలివిగా ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. మొదటి 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అతను, తర్వాతి 13 బంతుల్లోనే 31 పరుగులు రాబట్టి గేర్ మార్చాడు. ముఖ్యంగా మిడ్-వికెట్ మీదుగా అతను బాదిన భారీ షాట్లు స్టేడియంలో హైలైట్‌గా నిలిచాయి. “క్రీజులో ఉన్నప్పుడు పరిస్థితిని అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు వేగంగా ఆడాల్సి వస్తే, మరికొన్నిసార్లు భాగస్వామ్యాలు నెలకొల్పాల్సి ఉంటుంది. పిచ్ స్వభావం, మ్యాచ్ పరిస్థితిని బట్టి ఆడటమే అసలైన ఆటగాడి లక్షణం” అని వెల్లడించాడు.

కంట్రోల్లో ఉన్నదానిపై దృష్టి పెట్టాలి

కష్టకాలంలో ఆటగాళ్లు ఎలా వ్యవహరించాలనే దానిపై ఇషాన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. “పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు, మన నియంత్రణలో లేని విషయాల గురించి ఆలోచించి బాధపడే కంటే.. మనం ఏం చేయగలమో దానిపై దృష్టి పెట్టడం చాలా మంచిది” అని హితవు పలికాడు. అంతేకాకుండా 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీపై ఇషాన్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఇంగ్లాండ్ పర్యటనలో కష్టపడినప్పటికీ, మొదటి టి20లోనే అర్ధశతకంతో పునరాగమనం చేయడం వైభవ్ పరిణతికి నిదర్శనమని పొగిడాడు.

సోషల్ మీడియాను పక్కనపెట్టు

వైభవ్ సూర్యవంశీకి చిన్న వయసులోనే వచ్చిన క్రేజ్ గురించి ఇషాన్ కిషన్ హెచ్చరించాడు. “ఇంత చిన్న వయసులో భారత్ తరఫున ఆడుతున్నప్పుడు దేనిపై దృష్టి పెట్టాలో తెలుసుకోవడం అత్యవసరం. నేను, అభిషేక్, అక్షర్ భాయ్, జట్టులోని సీనియర్లు వైభవ్‌కు నిరంతరం ఒకటే చెబుతుంటాం.. కేవలం క్రికెట్‌పై మాత్రమే దృష్టి పెట్టమని, సోషల్ మీడియా లేదా బయట వచ్చే గోలను పట్టించుకోవద్దని సలహా ఇస్తాం. వైభవ్ గనుక క్రీజులో నిలదొక్కుకుంటే పవర్ ప్లేలోనే 80-90 పరుగులు రాబట్టగలడు, అతనొక్కడే ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలడు” అని ఇషాన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us