
Ravindra Jadeja: భారత జట్టు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 2027 వన్డే ప్రపంచ కప్ సన్నాహాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా వెస్టిండీస్‌తో తలపడేందుకు టీమిండియా సిద్ధమైంది. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు భారత జట్టు బ్యాటింగ్ కోచ్ సీతాన్షు కొటక్ సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాపై ప్రశంసల వర్షం కురిపించారు. గత జనవరి నుంచి వన్డే జట్టుకు దూరంగా ఉన్న జడేజా, ఈ సిరీస్ ద్వారా మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో జడేజా రాబోయే 2027 వన్డే వరల్డ్ కప్ ప్రణాళికల్లో కీలకమైన ఆటగాడిగా కొనసాగుతాడని కోచ్ స్పష్టం చేశారు.
జడేజా అనుభవం, ఆల్ రౌండ్ ప్రతిభ కీలకం
సౌతాఫ్రికా లాంటి పిచ్‌లు పేస్, బౌన్స్‌కు అనుకూలంగా ఉంటాయని అక్కడ స్పిన్నర్ల పాత్ర కూడా చాలా ముఖ్యమని కోచ్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన రవీంద్ర జడేజా పరుగులను కట్టడి చేయడంతో పాటు బ్యాటర్లను నిలకడగా ఒత్తిడిలోకి నెట్టగల సమర్థుడని పేర్కొన్నారు. ఐసీసీ వెల్లడించిన వివరాల ప్రకారం.. జడేజా లాంటి అనుభవజ్ఞుడైన ఆటగాడు జట్టులో ఉండటం వల్ల వచ్చే ప్రయోజనాలు ఎనలేనివని సీతాన్షు కొటక్ తెలిపారు. సెలెక్షన్ కమిటీ నిర్ణయాలు ఎలా ఉన్నప్పటికీ ప్రపంచ స్థాయి ఆటగాడిగా జడేజా రికార్డులు అందరికీ తెలిసిందేనని కొటక్ గుర్తుచేశారు.
రోహిత్, విరాట్ లాగే జడేజా కూడా ఎంతో ముఖ్యం
రవీంద్ర జడేజా ప్రాముఖ్యత గురించి కోచ్ మాట్లాడుతూ.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను ఏ విధంగా అయితే సీనియర్ ఆటగాళ్లుగా చూస్తామో, అదే కోవలో జడేజాను కూడా చూడాలని అన్నారు. అతడి వద్ద ఉన్న అపారమైన అనుభవం జట్టుకు ఎంతో ఉపకరిస్తుందని తెలిపారు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ రాణించగలగడంతో పాటు ప్రపంచంలోనే అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకడిగా ఉన్న జడేజా జట్టుకు ఒక బలమైన ఆస్తులని కొనియాడారు. ప్రస్తుతానికి ప్రపంచ కప్ కోసం పరిశీలిస్తున్న 20-25 మంది ప్రాథమిక ఆటగాళ్ల జాబితాలో జడేజా కచ్చితంగా ఉన్నాడని ఆయన పరోక్షంగా వెల్లడించారు.
వెస్టిండీస్‌తో సిరీస్‌తో ప్రారంభం కానున్న అసలు పోరు
భారత్ – వెస్టిండీస్ మధ్య ఆదివారం నుంచి ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ద్వారా టీమిండియా తన భవిష్యత్ ప్రణాళికలను పరీక్షించుకోనుంది. రవీంద్ర జడేజా లాంటి సీనియర్ ఆటగాళ్ల రీఎంట్రీ జట్టు మిడిలార్డర్‌కు, బౌలింగ్ విభాగానికి మరింత బలాన్ని చేకూరుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సిరీస్‌లో జడేజా తన సత్తా చాటితే 2027 వన్డే ప్రపంచ కప్ జట్టులో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకునే అవకాశం ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..