INDW vs PAKW: పాకిస్థాన్‌ను చిత్తు చిత్తుగా ఓడించిన టీమిండియా

మహిళల ఆసియా కప్‌ 2026లో పాకిస్థాన్‌పై టీమిండియా ఘన విజయం సాధించింది. దుబాయ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ 55 పరుగులకే ఆలౌట్‌ అయింది. శ్రీ చరణి, ప్రేమ రావత్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం 56 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 8.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించి, ఏడు వికెట్లతో గెలిచింది.

INDW vs PAKW: పాకిస్థాన్‌ను చిత్తు చిత్తుగా ఓడించిన టీమిండియా
Indw Vs Pakw

Updated on: Sep 05, 2026 | 10:34 PM

ఉమెన్స్ ఆసియా కప్ 2026లో భాగంగా దుబాయ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ముఖ్యంగా భారత బౌలింగ్ ఎటాక్ ముందు పాక్ బ్యాటర్లు ఏ మాత్రం నిలువులేకపోయారు. ఓపెనర్లు మినహా మిగతా ఏ బ్యాటర్ కూడా 10 పరుగులను టచ్ చేయలేదు. ముఖ్యంగా శ్రీచరణి, ప్రేమ రావత్ పాక్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు. ఇద్దరూ చెరో మూడు వికెట్లతో తీన్మార్ ఆడించారు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 18.1 ఓవర్లలో కేవలం 55 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు మునీబా అలీ 13, జుల్ఫీకర్ 14 మాత్రమే రెండు అంకెల స్కోర్ చేశారు. మిగతా బ్యాటర్లు వచ్చినవాళ్లు వచ్చినట్లే పెవిలియన్ బాటపట్టారు. టీమిండియా బౌలర్లలో శ్రీచరణి, ప్రేమ రావత్ మూడేసి వికెట్లు పడగొట్టగా, దీప్తి శర్మ 2, షఫాలీ వర్మ ఒక వికెట్ తీసుకున్నారు.

ఇక 56 పరుగుల స్వల్ప టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్‌‌ను పాకిస్థాన్ కెప్టెన్ ఫాతీమా సనా కాస్త ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది. షఫాలీ వర్మ, ప్రతీకా రావత్, స్మృతి మంధానలను అవుట్ చేసినా.. టార్గెట్ మరీ చిన్నది కావడంతో టీమిండియా పెద్దగా ఇబ్బంది పడలేదు. 8. 4 ఓవర్లలో 57 పరుగుల చేసి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

 

 

 

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us