AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: తొలి ఓవర్‌లోనే మూడు వికెట్లు.. టీమిండియా చరిత్రలోనే చెత్త రికార్డు

IND vs NZ: న్యూజిలాండ్‌తో నాలుగో వన్డేలో భారత జట్టుకు ఘోరమైన ఆరంభం ఎదురైంది. 334 పరుగుల లక్ష్య ఛేదనలో తొలి ఓవర్‌లోనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ డకౌట్ అయ్యారు. ఒక్క పరుగు కూడా చేయకుండానే మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా వన్డే చరిత్రలో తొలిసారి ఈ చెత్త రికార్డును నమోదు చేసింది.

IND vs NZ: తొలి ఓవర్‌లోనే మూడు వికెట్లు.. టీమిండియా చరిత్రలోనే చెత్త రికార్డు
Rohit Sharma, Virat Kohli, Shreyas Iyer
Rakesh
|

Updated on: Nov 13, 2026 | 3:15 PM

Share

IND vs NZ: న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో భారత జట్టుకు ఊహించని షాక్ తగిలింది. 334 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా తొలి ఓవర్‌లోనే మూడు వికెట్లు కోల్పోయింది. ఒక్క పరుగు కూడా చేయకుండానే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పెవిలియన్‌కు చేరారు. భారత వన్డే క్రికెట్ చరిత్రలో ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం ఇదే తొలిసారి. న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ ఒకే ఓవర్‌లో ముగ్గురు కీలక బ్యాటర్లను ఔట్ చేసి భారత్‌ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాడు.

తొలి బంతికే రోహిత్ శర్మ ఔట్

న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో 333 పరుగులు చేసింది. విల్ యంగ్ 125 పరుగులతో చెలరేగడంతో భారత్ ముందు 334 పరుగుల లక్ష్యం నిలిచింది. ఈ లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. న్యూజిలాండ్ తరఫున మ్యాట్ హెన్రీ బౌలింగ్ ప్రారంభించాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే రోహిత్‌ను హెన్రీ పెవిలియన్‌కు పంపించాడు. బయటకు కదిలిన బంతిని ఆడే ప్రయత్నంలో రోహిత్ బ్యాట్‌కు తగిలిన బంతి ఫస్ట్ స్లిప్‌లో ఉన్న ఫిన్ అలెన్ చేతుల్లో పడింది. దీంతో రోహిత్ ఒక్క బంతి ఆడి సున్నా పరుగులకే వెనుదిరిగాడు.

కోహ్లీ, అయ్యర్ కూడా డకౌట్

రోహిత్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. హెన్రీ వేసిన ఐదో బంతికి లోపలికి వచ్చిన బంతిని అంచనా వేయడంలో కోహ్లీ విఫలమయ్యాడు. బంతి కాస్త కిందికి రావడంతో బ్యాట్, ప్యాడ్ మధ్య నుంచి వెళ్లి వికెట్లను తాకింది. దీంతో కోహ్లీ నాలుగు బంతులు ఎదుర్కొని సున్నా పరుగులకే ఔటయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను హెన్రీ చివరి బంతికి ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు పంపాడు. తొలుత అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా.. న్యూజిలాండ్ రివ్యూ తీసుకోవడంతో నిర్ణయం భారత్‌కు వ్యతిరేకంగా మారింది. ఇలా తొలి ఓవర్ ముగిసేసరికి భారత్ స్కోరు 0/3గా నిలిచింది.

భారత వన్డే చరిత్రలో చెత్త రికార్డు

వన్డేల్లో భారత జట్టు ఇంతకుముందు ఎప్పుడూ తొలి ఓవర్‌లో ఒక్క పరుగు కూడా చేయకుండా మూడు వికెట్లు కోల్పోలేదు. ఈ మ్యాచ్‌తో ఆ చెత్త రికార్డు టీమిండియా ఖాతాలో చేరింది. అంతర్జాతీయ వన్డేల్లో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న జట్ల జాబితాలో భారత్ కూడా చేరింది. 1983 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ తొలిసారి ఈ పరిస్థితిని ఎదుర్కొంది. 1997లో దక్షిణాఫ్రికాతో జరిగిన లాహోర్ వన్డేలోనూ పాకిస్థాన్‌కు ఇదే అనుభవం ఎదురైంది. 2003 ప్రపంచకప్‌లో శ్రీలంక చేతిలో బంగ్లాదేశ్, 2026లో మిర్‌పూర్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఆస్ట్రేలియా కూడా ఇలాంటి ఆరంభాన్ని ఎదుర్కొన్నాయి.

ఇది కూడా చదవండి: IND vs NZ: కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే డకౌట్.. శ్రేయస్ అయ్యర్ పేరిట చెత్త రికార్డు

శ్రేయస్, రోహిత్ పేరిట మరో రెండు రికార్డులు

ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్‌కు మరో చేదు అనుభవం ఎదురైంది. శుభ్‌మన్ గిల్ అందుబాటులో లేకపోవడంతో తొలిసారి వన్డేల్లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అతడు.. తన కెప్టెన్సీ తొలి మ్యాచ్‌లోనే డకౌట్ అయ్యాడు. మరోవైపు రోహిత్ శర్మ వన్డేల్లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన తర్వాత తొలిసారి తొలి బంతికే ఔటయ్యాడు. ఈ సిరీస్‌లో మూడు ఇన్నింగ్స్‌ల్లో అతడికి ఇది రెండో డకౌట్. ఇక రోహిత్, కోహ్లీ ఇద్దరూ ఒకే వన్డే ఇన్నింగ్స్‌లో సున్నా పరుగులకే ఔటవడం ఇది రెండోసారి. గతంలో 2010లో శ్రీలంకతో దంబుల్లాలో జరిగిన మ్యాచ్‌లోనూ ఇలా జరిగింది. ఆ మ్యాచ్‌లో వీరేంద్ర సెహ్వాగ్ 99 పరుగుల వద్ద నాటౌట్‌గా నిలిచాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us