MS Dhoni: ఫిట్‌గా ఉండాలంటే ఇవి మానేయండి.. యువతకు ధోనీ ఫిట్‌నెస్ సీక్రెట్స్..

45 ఏళ్ల వయసులో కూడా మైదానంలో 20 ఏళ్ల కుర్రాడిలా చిరుతపులి వేగంతో ఎలా రన్నింగ్ చేస్తున్నారు..? ఎంఎస్ ధోనీ ఫిట్‌నెస్ రహస్యం ఏమిటి? నేటి బిజీ లైఫ్‌లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యువత వెంటనే వదిలేయాల్సిన మూడు చెడు అలవాట్లేమిటో మిస్టర్ కూల్ స్వయంగా వివరించారు. 30 ఏళ్లు దాటాక వచ్చే సమస్యల నుంచి తప్పించుకోవాలంటే ధోనీ చెప్పిన ఈ గోల్డెన్ రూల్స్ తెలుసుకోవాల్సిందే..

MS Dhoni: ఫిట్‌గా ఉండాలంటే ఇవి మానేయండి.. యువతకు ధోనీ ఫిట్‌నెస్ సీక్రెట్స్..
Ms Dhoni Fitness Secrets

Updated on: Oct 26, 2026 | 6:23 PM

భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన సారథుల్లో ఒకరైన మహేంద్ర సింగ్ ధోనీ.. 45 ఏళ్ల వయసులో కూడా మైదానంలో యువ ఆటగాళ్లతో సమానంగా పరుగులు తీస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఆయన ఫిట్‌నెస్ రహస్యం ఏమిటి? రోజువారీ బిజీ లైఫ్‌లో ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? అనే విషయాలపై మిస్టర్ కూల్ నేటి యువతకు కొన్ని కీలక సూచనలు చేశారు. ప్రముఖ రచయిత జావేద్ అక్తర్‌తో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధోనీ.. ఫిట్‌నెస్, జీవనశైలి మార్పులపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

30 ఏళ్ల తర్వాత మొదలయ్యే అసలు సమస్య..

నేటితరం యువత గంటల తరబడి కూర్చుని పనిచేసే నిశ్చల జీవనశైలికి అలవాటుపడిందని ధోనీ ఆందోళన వ్యక్తం చేశారు. శరీరానికి తగినంత కదలిక లేకపోవడం వల్ల వచ్చే నష్టం 20లలో వెంటనే కనిపించకపోవచ్చు కానీ 30 ఏళ్లు దాటిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటిగా ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయని హెచ్చరించారు. ఫిట్‌నెస్ అనేది మన శరీరానికి, ఆరోగ్యానికి మనం చేసుకునే అత్యుత్తమ పెట్టుబడి అని ఆయన స్పష్టం చేశారు.

యువత తక్షణమే వదులుకోవాల్సిన 3 అలవాట్లు..

బద్ధకం వీడండి.. నడకను అలవాటు చేసుకోండి: ఆధునిక సౌకర్యాల వల్ల కొద్దిపాటి దూరాలకు కూడా క్యాబ్‌లు, ఆటోలు బుక్ చేసుకుని శారీరక శ్రమను పూర్తిగా తగ్గించేస్తున్నామని ధోనీ గుర్తుచేశారు. ఎంత బిజీగా ఉన్నా రోజుకు కనీసం అరగంట నడవాలని, కాసేపు స్మార్ట్‌ఫోన్లను పక్కనపెట్టి గ్రౌండ్‌లోకి వెళ్లి క్రికెట్, వాలీబాల్ వంటి ఆటలు ఆడాలని సూచించారు. ఆటలు శరీరాన్ని చురుగ్గా ఉంచడమే కాకుండా మానసిక ఉల్లాసాన్ని కూడా ఇస్తాయి.

ప్రాసెస్డ్ – ఫాస్ట్ ఫుడ్‌కు దూరం: దేశంలో వేగంగా విస్తరిస్తున్న జంక్ ఫుడ్ సంస్కృతిపై ధోనీ హెచ్చరించారు. పిజ్జాలు, బర్గర్లు, మోమోస్, చౌమీన్ వంటి నూనెలో వేయించిన ఆహారాలు శరీరానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రాత్రిపూట అధిక కార్బోహైడ్రేట్లు ఉండే అన్నం, రొట్టెలు తీసుకోవడం సరికాదని, ఎల్లప్పుడూ శరీరానికి అవసరమైన సమతుల్య పోషకాహారాన్ని మాత్రమే తీసుకోవాలని చెప్పారు.

చక్కెరను పూర్తిగా తగ్గించండి: దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా, దృఢంగా ఉండాలంటే చక్కెరతో పాటు చక్కెరతో చేసిన పదార్థాలకు వీడ్కోలు పలకాలని ధోనీ స్పష్టం చేశారు. చక్కెర ఉత్పత్తులు ఊబకాయం, మధుమేహానికి దారితీసి 30 ఏళ్ల తర్వాత శరీరాన్ని లోలోపలే బలహీనపరుస్తాయి.

గెలుపోటములను స్వీకరించడం నేర్పేది క్రీడలే

కేవలం శారీరక ఆరోగ్యమే కాకుండా జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కొనే పాఠాలను కూడా క్రీడలే నేర్పుతాయని ధోనీ అన్నారు. ఓటమి ఎదురైనప్పుడు బలహీనతలను తెలుసుకుని సరిదిద్దుకోవడం, గెలిచినప్పుడు గర్వపడకుండా క్రమశిక్షణతో మరింత మెరుగవ్వడం మైదానంలోనే సాధ్యమవుతుందన్నారు. అందుకే పిల్లలను చిన్నప్పటి నుంచే ఆటల వైపు ప్రోత్సహించాలని, అది వారిని భవిష్యత్తులో వైఫల్యాలను తట్టుకుని విజయాల వైపు నడిచేలా తీర్చిదిద్దుతుందని ధోనీ పిలుపునిచ్చారు.

Loading...
Unable to load recommendations.
Follow Us