
అండర్-19 ఆసియా కప్ 2026 ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారత యువ జట్టు సాధించిన నరాలు తెగే ఉత్కంఠభరిత విజయం యావత్ దేశాన్ని సంబరాల్లో ముంచెత్తింది. 338 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచిన వేళ, లోయర్ ఆర్డర్ బ్యాటర్ల అద్భుత పోరాటంతో టీమిండియా ఒక్క వికెట్ తేడాతో విజయం సాధించి రికార్డు స్థాయిలో 9వ సారి ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది. ఈ చారిత్రక విజయంపై భారత జాతీయ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రశంసల వర్షం కురిపించారు. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో లక్ష్య రాయ్‌చందాని సారథ్యంలోని భారత కుర్రాళ్లు చూపిన తెగువకు గౌతమ్ గంభీర్ ఫిదా అయ్యారు. ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘‘భయంలేని క్రికెట్.. చెదరని ఆత్మవిశ్వాసం.. పట్టుదలకు బ్యాటింగ్ ఆర్డర్ ఉండదు.. ఆసియా ఛాంపియన్స్.. వెల్ డన్ బాయ్స్’’ అంటూ కొనియాడారు. ప్రస్తుతం గంభీర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన భారత్ 42వ ఓవర్లో 252 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక భారత్ ఓటమి ఖాయమని అంతా భావించిన తరుణంలో లోయర్ ఆర్డర్ బ్యాటర్లు మనల్ చౌహాన్ (47), మోహిత్ ఉల్వా (49 నాటౌట్) అసాధారణ పోరాటం చేశారు. ముఖ్యంగా మోహిత్ ఉల్వా చివరి బంతికి ఫోర్ బాది జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
ఈ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఫైనల్‌లో కెప్టెన్ లక్ష్య రాయ్‌చందాని (80)తో కలిసి కేవలం 17.4 ఓవర్లలోనే 95 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి, భారీ ఛేదనకు బలమైన పునాది వేశాడు. అంతేకాకుండా ఈ టోర్నీ మొత్తం 5 ఇన్నింగ్స్‌లలో 90.25 సగటుతో ఒక సెంచరీ, మూడు అర్ధ సెంచరీల సాయంతో 361 పరుగులు చేసి టాప్ రన్-గెట్టర్‌గా నిలిచాడు.
విజయానంతరం ఆర్యవీర్ మాట్లాడుతూ.. ‘‘పిచ్ బ్యాటింగ్‌కు చాలా అనుకూలంగా ఉందని, ఇది మరీ అంత పెద్ద స్కోరు కాదని డ్రెస్సింగ్ రూమ్‌లో చర్చించుకున్నాం. సహజమైన ఆట ఆడితే కచ్చితంగా లక్ష్యాన్ని ఛేదిస్తామన్న నమ్మకం మాకు మొదటి నుంచీ ఉంది. చివరి 10 ఓవర్లలో 100-120 పరుగులు ఎలా ఛేదించాలో మేం ఎప్పుడూ ప్లాన్ చేసుకుంటాం. అందుకు ఎవరో ఒకరు చివరి వరకు క్రీజులో ఉండాలి. కెప్టెన్ లక్ష్య ఆ పనిని అద్భుతంగా చేశాడు. ఇక చివర్లో మోహిత్, మనల్ ఆడిన తీరు అమోఘం.. వారికి హ్యాట్సాఫ్’’ అని సహచర ఆటగాళ్లను ప్రశంసించాడు.