
Watch: శ్రీలంకతో ఆగస్టు 15 నుంచి గాల్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరగనున్న రెండు టెస్టుల సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టు తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే ప్రాక్టీస్ సెషన్ల తర్వాత దొరికిన ఖాళీ సమయాన్ని టీమిండియా ఆటగాళ్లు సరదాగా గడుపుతున్నారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు ప్లేయర్స్ సరికొత్త లుక్‌లో కనిపించేందుకు శ్రీలంకలోని ప్రముఖ హెయిర్‌స్టైలిస్ట్ చతురంగ సెలూన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా భారత స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్, తోటి బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌కు హెయిర్‌కట్ చేయడానికి ప్రయత్నించిన సరదా సంఘటన ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది.
స్టైలిస్ట్‌గా మారిన సిరాజ్
సెలూన్‌లో సర్ఫరాజ్ ఖాన్, శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్‌లతో పాటు మహమ్మద్ సిరాజ్ కూడా ఉన్నాడు. సర్ఫరాజ్ కుర్చీలో కూర్చోగానే, సిరాజ్ సరదాగా చేతిలోకి ట్రిమ్మర్ తీసుకుని హెయిర్‌కట్ చేయడానికి సిద్ధమయ్యాడు. అయితే నేరుగా ట్రిమ్మర్ ఉపయోగించకుండా, ముందుగా స్టైలిస్ట్ చతురంగను దాని సెట్టింగ్స్ గురించి అడిగి తెలుసుకోవడం అందరినీ నవ్వించింది. ఆ తర్వాత సర్ఫరాజ్ జుట్టుపై చేతివాటం ప్రదర్శించాడు. చివరకు ప్రొఫెషనల్ స్టైలిస్ట్ చతురంగనే సర్ఫరాజ్ హెయిర్‌కట్‌ను పూర్తి చేయగా, అతని పనితనాన్ని పంత్, సర్ఫరాజ్‌లు అభినందించారు.
The way Mohammed Siraj cuts Sarfaraz Khan’s hair like a big brother. 😂
Also, look at Shubman Gill and Rishabh Pant’s new haircuts for the Ind vs Sl Test series! pic.twitter.com/RGjrXZodAo
— Sonu (@Cricket_live247) August 11, 2026
అవకాశం కోసం ఎదురుచూస్తున్న సర్ఫరాజ్ ఖాన్
గాయం వల్ల సాయి సుదర్శన్ దూరమవ్వడంతో సర్ఫరాజ్ ఖాన్‌కు ఆఖరి నిమిషంలో భారత టెస్టు జట్టులో చోటు దక్కింది. 2024లో ఇంగ్లాండ్‌పై టెస్టు అరంగేట్రం చేసిన సర్ఫరాజ్, ఇప్పటివరకు 6 టెస్టుల్లో 11 ఇన్నింగ్స్‌లు ఆడి 371 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు అర్ధసెంచరీలు ఉన్నాయి. ఈ సిరీస్‌లో అతనికి తుది జట్టులో అవకాశం దక్కుతుందో లేదో చూడాలి.
సిరాజ్‌పై పెరిగిన కీలక బాధ్యత
ఫిట్‌నెస్ కారణాల వల్ల ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్‌కు దూరం కావడంతో, భారత ఫాస్ట్ బౌలింగ్ విభాగాన్ని నడిపించే బాధ్యత మహమ్మద్ సిరాజ్‌పై పడింది. అతడితో పాటు ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, ఆకిబ్ నబీలు పేస్ విభాగంలో ఉన్నారు. స్పిన్‌కు అనుకూలించే గాల్ పిచ్‌పై ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడంలో సిరాజ్ అనుభవం భారత్‌కు చాలా కీలకం కానుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి