
European T20 Premier League: యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ వేదికగా ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజాల జట్ల మధ్య జరిగిన ఆసక్తికర మ్యాచ్‌లో బెల్‌ఫాస్ట్ వోల్వ్స్ (Belfast Wolves) పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. సహ యజమానిగా, సారథిగా ఉన్న గ్లెన్ మ్యాక్స్‌వెల్ (Glenn Maxwell) నేతృత్వంలోని బెల్‌ఫాస్ట్ వోల్వ్స్ జట్టు.. మరో దిగ్గజం మాథ్యూ హెడెన్ (Matthew Hayden) శిక్షణ, యాజమాన్యంలో నడుస్తున్న గ్లాస్గో కాస్మిక్ (Glasgow Cosmic) జట్టుతో తలపడింది. ఈ పోరులో మొదట బ్యాటింగ్ చేసిన బెల్‌ఫాస్ట్ వోల్వ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్‌లో మార్క్ చాప్‌మన్ (Mark Chapman) కేవలం 25 బంతుల్లోనే 54 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడగా, లోర్కాన్ టక్కర్ (Lorcan Tucker) 45 బంతుల్లో 50 పరుగులతో విలువైన అర్ధ సెంచరీ నమోదు చేశాడు. కెప్టెన్ మ్యాక్స్‌వెల్ 6 బంతుల్లో 13 పరుగులు జోడించారు. ప్రత్యర్థి బౌలర్లలో లియామ్ లివింగ్‌స్టోన్ (Liam Livingstone) 3 వికెట్లతో రాణించగా, అలీ ఖాన్ (Ali Khan) 2 వికెట్లు తీశారు.
188 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో గ్లాస్గో కాస్మిక్ ఆరంభం తీవ్ర నిరాశ పరిచింది. బెల్‌ఫాస్ట్ వోల్వ్స్ జట్టుకు చెందిన 23 ఏళ్ల యువ పేసర్ మాథ్యూ హాంఫ్రీస్ (Matthew Humphreys) పదునైన లైన్ అండ్ లెంగ్త్‌తో ప్రత్యర్థి లైనప్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు.
ఈ మ్యాచ్‌లో తన కోటా 4 ఓవర్లు వేసిన హాంఫ్రీస్ కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు నేలకూల్చాడు. ప్రస్తుత ఈటీపీఎల్ (ETPL) సీజన్‌లో అతనికిదే అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన కావడం విశేషం. హెడెన్ సారథ్యంలోని బ్యాటింగ్ విభాగం ఈ విధ్వంసకర బౌలింగ్ ధాటికి వరుసగా పెవిలియన్ చేరి తక్కువ స్కోరుకే పరిమితమైంది. దీంతో గ్లెన్ మ్యాక్స్‌వెల్ జట్టు ఏకపక్షంగా విజయం సాధించి పాయింట్ల పట్టికలో తమ బలాన్ని చాటుకుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..