
IND Vs PAK: అండర్-19 ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో జరుగుతున్న కీలక పోరులో టీమిండియా యువ బ్యాటర్లు తడబడ్డారు. ముఖ్యంగా భారత క్రికెట్ దిగ్గజాలు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులు ఆర్యవీర్ సెహ్వాగ్, అన్వయ్ ద్రవిడ్ అంచనాలను అందుకోలేకపోయారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ఆరంభం నుంచే పాక్ బౌలర్లు చుక్కలు చూపించారు. వరుసగా వికెట్లు పడటంతో టీమిండియా ఒత్తిడిలో పడింది.
రెండో బంతికే కెప్టెన్ ఔట్
టాస్ గెలిచిన భారత అండర్-19 జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఇన్నింగ్స్ ప్రారంభమైన రెండో బంతికే కెప్టెన్ లక్ష్య రాజ్చందానీ వికెట్ కోల్పోయింది. పాకిస్థాన్ బౌలర్ అలీ రజా అద్భుత బంతితో లక్ష్యను క్లీన్ బౌల్డ్ చేశాడు. మరోవైపు ఓపెనర్‌గా వచ్చిన ఆర్యవీర్ సెహ్వాగ్ కూడా ఆరంభం నుంచి పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డాడు. పాక్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో భారత బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడలేకపోయారు. 17 ఓవర్లు పూర్తయ్యే సమయానికి కూడా భారత్ స్కోరు 50 పరుగులు దాటలేదు.
40 బంతుల్లో 22 పరుగులే చేసిన ఆర్యవీర్
వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ ఈ మ్యాచ్‌లో పూర్తిగా నిరాశపరిచాడు. పాక్ బౌలర్ల దూకుడు ముందు దూకుడుగా ఆడలేకపోయిన అతడు రక్షణాత్మకంగా బ్యాటింగ్ చేశాడు. క్రీజులో ఎక్కువసేపు ఉన్నప్పటికీ స్కోరు బోర్డును వేగంగా ముందుకు తీసుకెళ్లలేకపోయాడు. చివరకు 40 బంతుల్లో 22 పరుగులు చేసిన ఆర్యవీర్ పెవిలియన్ చేరాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఒక ఫోర్, ఒక సిక్స్ ఉన్నాయి. అయితే నేపాల్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆర్యవీర్ 70 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆ మ్యాచ్‌లో చూపించిన ఆటతీరును పాకిస్థాన్‌పై కొనసాగించలేకపోయాడు.
అన్వయ్ ద్రవిడ్ కూడా నిరాశ
భారత్ 42 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో అర్జున్ రాజ్‌పుత్, అన్వయ్ ద్రవిడ్ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఇద్దరూ కలిసి ఐదో వికెట్‌కు 44 పరుగులు జోడించారు. దీంతో భారత జట్టు కొంతవరకు కోలుకుంటున్నట్లు కనిపించింది. అయితే 23వ ఓవర్లో అన్వయ్ ద్రవిడ్ 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. కీలక సమయంలో అతడు వికెట్ కోల్పోవడంతో భారత్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. రాహుల్ ద్రవిడ్ తనయుడు ఈ మ్యాచ్‌లో పెద్ద ఇన్నింగ్స్ ఆడతాడని ఆశించిన అభిమానులకు నిరాశే మిగిలింది.
తొలి మ్యాచ్‌లో భారత్ ఘన విజయం
భారత ఇన్నింగ్స్‌లో అర్జున్ రాజ్‌పుత్ ఒంటరి పోరాటం చేశాడు. సహచర బ్యాటర్లు వరుసగా వికెట్లు కోల్పోతున్నా అతడు మాత్రం పాక్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కేవలం 43 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసి జట్టుకు అండగా నిలిచాడు. మరోవైపు అండర్-19 ఆసియా కప్‌లో భారత్ తొలి మ్యాచ్‌లో నేపాల్‌పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గ్రూప్-ఏలో భారత్‌తో పాటు పాకిస్థాన్, నేపాల్, యూఏఈ జట్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో భారత టాప్ ఆర్డర్ వైఫల్యం జట్టుకు ఆందోళన కలిగించే అంశంగా మారింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..