Watch: వీరూ కొడుకుపై పాక్ స్పిన్నర్ ప్రతాపం.. వికెట్ తీసి మరీ సెండాఫ్ ఇచ్చిన పాక్ బౌలర్

Watch: అండర్-19 ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ 22 పరుగులకే ఔటయ్యాడు. అతడి వికెట్ తీసిన పాక్ స్పిన్నర్ నిఖాబ్ షఫీక్ మైదానంలో ఘాటుగా సెండాఫ్ ఇచ్చాడు. మరోవైపు అన్వయ్ ద్రవిడ్ కూడా బ్యాట్‌తో నిరాశపరిచాడు. అర్జున్ రాజ్‌పుత్ సెంచరీతో భారత జట్టును ఆదుకున్నాడు.

Watch: వీరూ కొడుకుపై పాక్ స్పిన్నర్ ప్రతాపం.. వికెట్ తీసి మరీ సెండాఫ్ ఇచ్చిన పాక్ బౌలర్
Aaryavir Sehwag

Updated on: Nov 08, 2026 | 5:06 PM

Watch: పాకిస్థాన్‌తో మ్యాచ్ అంటే భారత క్రికెట్‌లో ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. అలాంటి హై-వోల్టేజ్ పోరులో టీమిండియా యువ ఆటగాడు ఆర్యవీర్ సెహ్వాగ్‌కు చేదు అనుభవం ఎదురైంది. భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడైన ఆర్యవీర్.. అండర్-19 ఆసియా కప్ మ్యాచ్‌లో 22 పరుగులకే ఔటయ్యాడు. అతడి వికెట్ తీసిన పాక్ స్పిన్నర్ నిఖాబ్ షఫీక్ మైదానంలోనే ఘాటుగా సెండాఫ్ ఇచ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.

ఆరంభంలోనే కష్టాలు

ఒమన్‌లోని అల్ అమరత్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా భారత్, పాకిస్థాన్ అండర్-19 జట్ల మధ్య ఈ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే పాక్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత బ్యాటర్లు పరుగులు సాధించడానికి ఇబ్బంది పడ్డారు. కెప్టెన్ లక్ష్య రాయ్‌చందానీ ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. వికెట్ కీపర్ బ్యాటర్ వీకే వినీత్ 8 పరుగులకే ఔటయ్యాడు. దీంతో భారత్ ఆరంభంలోనే ఒత్తిడిలో పడింది.

భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఇచ్చిన ఆర్యవీర్

ఈ పరిస్థితుల్లో క్రీజులో ఉన్న ఆర్యవీర్ సెహ్వాగ్‌పై జట్టు ఆశలు పెట్టుకుంది. అయితే పాక్ బౌలర్లను ఎదుర్కొంటూ అతను వేగంగా పరుగులు చేయలేకపోయాడు. నిఖాబ్ షఫీక్ వేసిన 17వ ఓవర్‌లో బంతిని బౌండరీ దాటించేందుకు ఆర్యవీర్ స్వీప్ షాట్ ఆడాడు. కానీ బంతి బ్యాట్‌కు సరిగ్గా తగలకపోవడంతో డీప్ మిడ్ వికెట్‌లో ఉన్న మహమ్మద్ సయ్యమ్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో 40 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్‌తో 22 పరుగులు చేసిన ఆర్యవీర్ ఇన్నింగ్స్ ముగిసింది.

వికెట్ తీసిన ఆనందంలో పాక్ బౌలర్ సెండాఫ్

ఆర్యవీర్ వికెట్ పడగానే పాక్ జట్టులో ఆనందం కనిపించింది. ముఖ్యంగా అతడిని ఔట్ చేసిన స్పిన్నర్ నిఖాబ్ షఫీక్ మరింత ఉత్సాహంగా స్పందించాడు. ఆర్యవీర్‌ను పెవిలియన్‌కు వెళ్లాలన్నట్లుగా చేతితో సైగ చేస్తూ సెండాఫ్ ఇచ్చాడు. పాక్ ఆటగాళ్లు కూడా ఈ వికెట్‌ను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆర్యవీర్‌పై భారీ అంచనాలు

ఆర్యవీర్ తండ్రి వీరేంద్ర సెహ్వాగ్‌కు పాకిస్థాన్‌పై అద్భుతమైన రికార్డు ఉంది. వన్డేల్లో ఆ జట్టుపై 31 మ్యాచ్‌ల్లో 1,071 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఆరు అర్ధ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో అయితే పాకిస్థాన్‌పై తొమ్మిది మ్యాచ్‌ల్లో 1,276 పరుగులు సాధించాడు. 2004లో పాకిస్థాన్‌పై చేసిన ట్రిపుల్ సెంచరీ అతడి కెరీర్‌లో ప్రత్యేక ఇన్నింగ్స్‌గా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో తండ్రిలాగే పాక్‌పై రాణిస్తాడని ఆర్యవీర్‌పై అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ మ్యాచ్‌లో మాత్రం అతను పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు.

ఆర్యవీర్, అన్వయ్ నిరాశ

ఈ మ్యాచ్‌లో మరో మాజీ భారత కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్వయ్ ద్రవిడ్ కూడా బ్యాట్‌తో నిరాశపరిచాడు. అతను 16 బంతుల్లో 10 పరుగులు చేసి ఔటయ్యాడు. ఒకవైపు కీలక బ్యాటర్లు వెనుదిరుగుతున్నా.. అర్జున్ రాజ్‌పుత్ మాత్రం అద్భుతంగా ఆడాడు. 85 బంతుల్లో 107 పరుగులు చేసి భారత ఇన్నింగ్స్‌కు అండగా నిలిచాడు. అతడి స్కోరులో 11 ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. ఆర్యవీర్, అన్వయ్ విఫలమైన వేళ అర్జున్ సెంచరీతో భారత్‌ను ఆదుకున్నాడు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

 

Loading...
Unable to load recommendations.
Follow Us